ఎరువుల దుకాణాలపై అధికారుల మెరుపు దాడులు

ABN , First Publish Date - 2020-08-15T10:55:15+05:30 IST

శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలపై వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా

ఎరువుల దుకాణాలపై అధికారుల మెరుపు దాడులు

కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన అధికారులు

జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల తనిఖీలు

బ్లాక్‌ దందాపై ఆరా తీసిన అధికారులు

అధికారులకు బ్లాక్‌దందాపై వివరించిన రైతులు

ఆకస్మిక తనిఖీలతో బిత్తరపోయిన ఎరువుల వ్యాపారులు

అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు

కొందరు సిబ్బంది సహకారంతో దుకాణాలు మూసివేసిన వైనం

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కలెక్టర్‌ ఆదేశాలు


కామారెడ్డి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల దుకాణాలపై వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌పాటిల్‌తో పాటు, జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డి దాదాపు 3 గంటల పాటు ఎరువుల దుకాణాలలో, గోదాంలలో తనిఖీలు నిర్వహించారు. ‘ఆంధ్రజ్యోతి’ కామారెడ్డి మినీలో వచ్చిన ‘బ్లాక్‌లో యూరియా’ కథనానికి స్పందించిన కలెక్టర్‌ శరత్‌ వ్యవసాయ, రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయిలో ఎరువుల దుకాణాలను పరిశీలించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఉన్న ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారులు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్లాక్‌ దందాపై అధికారులు ఆరా తీశారు. జిల్లా కేంద్రంలో రైతులు కొందరు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకురాగా ఎలాంటి బిల్లులు లేకుండా ఎరువులను కొనుగోలు చేయరాదని రూ.265 కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపినట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.


జిల్లా కేంద్రంలో మూడు గంటల పాటు అధికారుల తనిఖీలు

జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్‌ ప్రాంతంలో ఉన్న ఎరువుల దుకాణాలను, ఆయా చోట్ల గోదాంలలో ఉన్న స్టాక్‌ను అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌ శరత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో అప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు టీంలుగా విడిపోయి ప్రతీ షాపులోని స్టాక్‌ రిజిష్టర్‌లను, రికార్డులను, ధరల పట్టికను పరిశీలించారు. కొన్ని దుకాణాలలో స్టాక్‌ వివరాలు సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో రికార్డులను అస్తవ్యస్తంగా నిర్వహించడం, ధరల పట్టికకు, బుక్‌లో ఉన్నవాటికి పొంతన లేకపోవడం, రిటైల్‌ పుస్తకంలో రాయాల్సిన వివరాలను హోల్‌సేల్‌లో రాయడం వంటి తప్పిదాలు చేయడంతో జిల్లా వ్యవసాయాధికారి సింగిరెడ్డి సదరు దుకాణాదారుడితో పాటు రిజిష్టర్‌ల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం, చూసీచూడనట్టు వ్యవహరిస్తూ అలసత్వం వహించిన ఏవో శ్రీనివాస్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు దుకాణదారుడు వ్యవసాయాధికారిణి తప్పుదోవపట్టించే ప్రయత్నం చేయడం, ధరల పట్టికను హోల్‌సేల్‌ వివరాలను సరిగా నమోదు చేయకపోవడంతో హోల్‌సేల్‌ లైసైన్స్‌ రద్దు చేయాలని ఏవోను ఆదేశించారు.


ఆకస్మిక తనిఖీలతో బెంబేలెత్తిన వ్యాపారులు

ఊహించని విధంగా జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలను కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఎరువుల వ్యాపారులు బెంబేలెత్తారు. కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు నేరుగా దుకాణ సముదాయాలకు వచ్చి రికార్డులు తనిఖీలు చేయడంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు. కొందరైతే దుకాణ సముదాయాలను మూసివేసి వెళ్లారు. దీంతో జిల్లా వ్యవసాయాధికారి సదరు దుకాణాలకు సీజ్‌ చేయాలని, తనిఖీలు చేపట్టిన తర్వాతనే దుకాణాలు కొనసాగించేలా చూడాలని ఏవోకు ఆదేశాలు ఇవ్వడంతో అప్పటికప్పుడు మళ్లీ దుకాణాలకు తిరిగి వచ్చి తెరిచారు. అయితే దుకాణాదారులు నిబంధనలను సరిగా పాటించకపోవడం మండల వ్యవసాయాధికారి చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు తాము వచ్చిన సమయంలో నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


జిల్లా అధికారులను తప్పుదోవ పట్టించే యత్నం

జిల్లాలోని కిందిస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు అన్ని తానే చూసుకునే యూనియన్‌లో కీలక బాధ్యతలు చేపడుతున్న వ్యాపారి అధికారులను తప్పుదోవ పట్టించే యత్నం చేయడంతో ఓ దశలో జిల్లా వ్యవసాయాధికారి అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఫర్టిలైజర్‌ దుకాణాన్ని పరిశీలిస్తున్న క్రమంలో తమకు లైసెన్స్‌డ్‌ గోదాంలో మరింత స్టాక్‌ ఉందని పలువురు తెలపడంతో తనిఖీలకు వెళ్లేందుకు బయలుదేరిన అధికారులను సదరు వ్యాపారి అడుగడుగునా అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశాడు. ఎరువులు స్టాక్‌ ఉన్న దుకాణాలను తెరవాలని యజమానులకు సమాచారం అందించాలని తెలపడంతో అది కూల్‌డ్రింక్‌ గోదాం అని అక్కడ ఎరువుల దుకాణం లేదని అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే ఆ గోదాంను నిర్వహిస్తున్న వ్యాపారి వచ్చి గోదాం తెరవడంతో యూనియన్‌లో కీలక బాధ్యతలు చేపడుతున్న వ్యాపారికి పద్ధతి మార్చుకోవాలని జిల్లా స్థాయి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటే కిందిస్థాయి సిబ్బంది పట్ల ఏ విధంగా ఉంటున్నారో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొందరు మండల అధికారులు, సిబ్బంది వీరికి సహకరించడంతోనే తాము ఏమి చేసినా నడిచిపోతుందనే ధోరణిలో ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రికార్డుల నిర్వహణను నేరుగా జిల్లా వ్యవసాయశాఖాధికారి పరిశీలించడం అంతా తప్పుల తడకగా గజిబిజిగా ఉండడంపై సిబ్బందిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.


జిల్లాలోని అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీలు

జిల్లాలోని అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో చాలా చోట్ల రికార్డుల నిర్వహణ, ధరల పట్టికలను సరిగా నిర్వహించడం లేదని కొందరు రైతులకు ఖాళీ కాగితాలపై రేట్లను వేసి అమ్మకాలు జరుపుతున్నారని అధికారుల దృష్టికి రైతులతో పాటు పలువురు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో కొంత అధికారులకు ఎప్పటి నుంచి ఈ విషయాలు తెలిపినా ఖచ్చితంగా దుకాణపేరుతో కూడిన రిసిప్ట్‌ తీసుకోవాలని దాటవేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కాగా లింగంపేటలో మూడు దుకాణాలను రికార్డులు సరిగా లేదని వాటిని సరిగా చూపిన తర్వాతనే ఎరువులను విక్రయించాలని అప్పటి వరకు మూసి ఉంచాలని తెలిపారు. అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయాధికారులు ప్రతీ దుకాణం యొక్క వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందించారని సమాచారం.


టాప్‌ 20 రైతుల వివరాలు సేకరిస్తున్నాం

జిల్లాలో యూరియా కొరతకు ప్రధాన కారణం చాలా మంది రైతులు అవసరం లేకున్నా ముందు చూపు మేరకు పెద్ద మొత్తంలో యూరియా కొనుగోలు చేసి స్టాక్‌ చేయించుకున్నట్టు అధికారుల తనిఖీలలో తేలింది. దీంతో చాలా ప్రాథమిక సహకార కేంద్రాలలో బహిరంగా మార్కెట్‌లో యూరియా కొరత ఏర్పడడంతో చిన్న, సన్నకారు రైతులకు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని పీఏసీఎస్‌లలో, ప్రైవేట్‌ డీలర్ల వద్ద ఎవరెవరు పెద్ద మొత్తంలో యూరియాను తరలించారో సేకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో శుక్రవారం రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ఏక కాలంలో తనిఖీలు చేసి అధిక మొత్తంలో యూరియాను తీసుకెళ్లిన టాప్‌ 20 రైతుల వివరాలు సేకరిస్తున్నారు.


బ్లాక్‌లో ఎరువులను అమ్మితే వారిపై కఠిన చర్యలు- శరత్‌, కలెక్టర్‌

జిల్లాలో ఎరువుల దుకాణాల వారు యూరియాను బ్లాక్‌లో అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యూరియా కృత్రిమ కొరత సృష్టించొద్దు. జిల్లాకు వచ్చిన యూరియాను మార్కెట్‌లో అందుబాటులో ఉంచాం. కొరత లేకుండా చూస్తున్నాం. అన్ని ఫర్టిలైజర్‌ షాపులను రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో ఏక కాలంలో తనిఖీలు చేయించాం. చాలా మంది ఫర్టిలైజర్‌ దుకాణాల వారు రికార్డులను సరిగా పొందుపరచకపోవడం, ఎరువుల ధరల పట్టికను పెట్టకపోవడం వంటివి తనిఖీలలో బయటపడ్డాయి. పూర్తి నివేదిక తెప్పించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఫర్టిలైజర్‌ దుకాణాలపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-08-15T10:55:15+05:30 IST