ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్‌ఆర్‌సీదే

ABN , First Publish Date - 2022-01-20T07:11:30+05:30 IST

ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లోని వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఏకపక్షంగా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు పేర్కొంది. ..

ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్‌ఆర్‌సీదే

కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలుచేయాలి

మెడికల్‌ పీజీ ఫీజుల జీవోలను కొట్టేసిన హైకోర్టు 

అధిక ఫీజులను తిరిగి చెల్లించాలని కాలేజీలకు ఆదేశాలు


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ ప్రొఫెషనల్‌ కాలేజీల్లోని వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఏకపక్షంగా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు పేర్కొంది. అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ)కే ఫీజులను నిర్ణయించే అధికారం ఉంటుందని స్పష్టంచేసింది. 2017- 2020 కాలానికి మెడికల్‌ అండ్‌ డెంటల్‌ పీజీ కోర్సులకు ఫీజులను నిర్ణయిస్తూ 2017లో ప్రభుత్వం రెండు జీవోలు జారీచేసింది. అన్‌ఎయిడెడ్‌ నాన్‌ మైనార్టీ, అన్‌ఎయిడెడ్‌ మైనార్టీ కాలేజీలకు సంబంధించి వేర్వేరు జీవోల (41, 43) ద్వారా ఫీజులను నిర్ధారించింది. ఏకపక్షంగా అధిక ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిని కొట్టేయాలని కోరుతూ హెల్త్‌కేర్‌ రిఫామ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, ఉస్మానియా జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సామ సందీ్‌పరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో ఫీ రెగ్యులేటరీ కమిటీ ఉన్నప్పటికీ, కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా ప్రభుత్వం జీవోలు జారీచేసిందని పేర్కొన్నారు. ప్రైవేటు ప్రొఫెషనల్‌ కాలేజీల్లో ఫీజుల నిర్థారణకు ప్రత్యేక కమిటీలు ఉండాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. ఇస్లామిక్‌ అకాడమీ వర్సెస్‌ కర్ణాటక, పీఏ ఇనాందార్‌ వర్సెస్‌ మహారాష్ట్ర కేసుల్లో కోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు జారీచేసిందన్నారు. కేసులు పెండింగ్‌లో ఉండటంతో మెడికల్‌ కాలేజీలు డాక్టర్లకు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు జారీచేయకుండా తమ వద్దే పెట్టుకున్నాయని తెలిపారు.  వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం... ఫీ రెగ్యులేటరీ కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోలు చెల్లవని పేర్కొంది.  ప్రైవేటు ఫ్రొఫెషనల్‌ కోర్సులకు ఫీజులను నిర్ణయించే అధికా రం ఫీ రెగ్యులేటరీ కమిటీదేనని స్పష్టంచేసింది. టీఏఎ్‌ఫఆర్‌సీ ఫీజులను నిర్థారించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం కొత్త జీవోలు జా రీచేసిందని పేర్కొంది. టీఏఎ్‌ఫఆర్‌సీ సిఫార్సులను అనుసరించి  2016లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్‌ 29 ప్రకారం ఫీజులను వసూలు చేయాలని తెలిపింది. ఈ మేరకు 2017లో జారీచేసిన రెండు జీవోలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను 30 రోజుల్లో తిరిగి చెల్లించాలని మెడికల్‌ కాలేజీలకు ఆదేశాలు జారీచేసింది. కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వారికి అప్పగించాలని స్పష్టంచేసింది.

Updated Date - 2022-01-20T07:11:30+05:30 IST