చెత్తతో కంపోస్టు ఎరువు

ABN , First Publish Date - 2020-12-03T04:12:55+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సి పాలిటీలో చెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఈ కంపోస్టు తయారు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.

చెత్తతో కంపోస్టు ఎరువు
మున్సిపాలిటీలోని కంపోస్టు తయారీ కేంద్రం

-కాగజ్‌నగర్‌లో 30వార్డుల నుంచి వ్యర్థ పదార్థాల సేకరణ

-ప్రత్యేక సిబ్బంది నియామకం

-మున్సిపాలిటీలోని నర్సరీకి వినియోగించేందుకు చర్యలు

కాగజ్‌నగర్‌, డిసెంబరు2: కాగజ్‌నగర్‌ మున్సి పాలిటీలో చెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. ఈ కంపోస్టు తయారు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. కంపోస్టు తయారు కాగానే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెంచు తున్న మొక్కలకు అందిస్తున్నారు. ఈప్రయోగం విజయవంతం అయితే రానున్న రోజుల్లో మరింత అధికంగా కంపోస్టు తయారు చేసి అమ్మకాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపా లిటీలో 30వార్డుల్లో రోడ్లపై వృథాగా పడేసిన పదా ర్థాలు, చెత్త, పేడను పలు వాహనాల్లో మున్సి పల్‌ కార్యాలయంలోని ప్రత్యేక కంపోస్టు కేంద్రానికి తరలి స్తున్నారు. మార్కెట్‌ ఏరియాలో కుళ్లిపోయిన పదార్థాలను నేరుగా తీసుకొస్తున్నారు. వీటిని ప్రత్యేకంగా శుభ్రపరిచి రెండు రోజుల పాటు ఆరబెడుతున్నారు. 

అనంతరం కంపోస్టు తయారు చేసేందుకు ఆ పదార్థాలను అలాగే ఐదు రోజుల పాటు ఉంచు తారు. ఈ దశలో ఆవు పేడను కలిపేస్తారు. రెండో దశలో మరో వారం రోజుల పాటు ఉంచుతారు. ఈదశలో నీటి తడి లేకుండా ప్రత్యేకంగా ఎండబెడతారు. మూడో దశలో ఏడు రోజుల పాటు ప్రత్యేకంగా కలియబెడుతారు. నాలుగో దశలోకి రాగానే పూర్తిగా నీరు లేకుండా చేసి మళ్లీ వారం రోజుల పాటు ఉంచుతారు. ఐదో దశలోకి రాగానే ఈ పదార్థాలు పూర్తిగా ఎండి పోతాయి. ఇలా వారం రోజుల తర్వాత మళ్లీ ఆరో దశకు చేరుకుంటుంది. ఈ దశలో పూర్తిగా పొడిగా మారుతుంది. అనంతరం పొడిగా మారిన కంపోస్టును జల్లెడ పట్టి సంచుల్లో నిల్వ చేస్తారు. ఈకంపోస్టును మొక్కలు పెంచుతున్న సమయంలో భూమిపై చల్లుతారు. దీంతో నేల చక్కటి సారవంతంగా తయారై  మొక్కలు బలంగా ఎదిగేం దుకు ఉపయోగపడుతుంది. 


చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలు

30 వార్డుల్లో ఉండే వ్యర్థాలను నాలుగు ట్రాక్టర్లు, ఆరు మినీ ట్రాలీలు, మూడు పెద్ద ఆటోల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలి స్తున్నారు. ఇంటింటా రెండు చెత్త బుట్టలను కూడా అందజేశారు. ఇంట్లో వృథాగా పడేసే పదార్థాలతో కంపోస్టు తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో మూడు డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేశారు. ఈ డంపింగ్‌ యార్డులో చెత్తను సేకరించి వీటి ద్వారా కంపోస్టు తయారు చేసి అమ్మకాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పొడి, తడి చెత్తను రీసైక్లింగ్‌ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇలా తయారు చేసి కంపోస్టును పూర్తి స్థాయిలో అమ్మకాలు జరిపేం దుకు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేక టెండరుకు శ్రీకారం చుడుతున్నారు. 


ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం

-ప్రణీల్‌ కుమార్‌, పర్యావరణ ఇంజనీర్‌, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కంపోస్టు తయారు చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేంగా తడి, పొడి చెత్త సేకరణ, కూరగాయాల మార్కెట్‌లో వృథాగా పడేసే వ్యర్థాలతో కంపోస్టు తయారీకి చర్యలు చేపట్టాం. వృథాగా పడేసే కూరగాయాలను తొలుత శుభ్రంగా కడిగి రెండ్రోజుల పాటు నీరు లేకుండా ఆరబెడతారు. ఈప్రక్రియ కాగానే నాలుగు వారాల పాటు ఆవుపేడ, ఇతరత్రా పదార్థాలను కలిపి నీడపట్టున ఆరబెడతాం. ఈ ప్రక్రియ కాగానే పూర్తిగా ఎండిపోతోంది. కంపోస్టు కూడా తయారు అవుతోంది. వీటిని ప్రస్తుతం మున్సిపల్‌ ఆధ్వర్యంలో చేపట్టే నర్సరీలో మొక్కలకు వాడుతున్నాం. 

మూడు డంప్‌ యార్డుల్లో తయారీకి చర్యలు

-శ్రీనివాస్‌, కమిషనర్‌, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరిస్తున్నాం. ఈ చెత్తతో పాటు మార్కెట్‌లో వృథాగా పడేసే కూరగాయాలను సైతం సేకరిస్తున్నాం. వీటి ద్వారా చక్కటి కంపోస్టు తయారు చేస్తున్నాం. ప్రస్తుతం తయారు చేసిన కంపోస్టును నర్సరీలో పెంచుతున్న మొక్కలకు వాడుతున్నాం. త్వరలోనే మూడు డంప్‌ యార్డుల్లో కూడా ఈ ప్రక్రియను చేపడుతాం. కంపోస్టు తయారు కాగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు   క్రయ, విక్రయాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.



Updated Date - 2020-12-03T04:12:55+05:30 IST