24న పైడిమాంబ దేవర ఉత్సవం

ABN , First Publish Date - 2021-05-11T05:05:31+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దేవర ఉత్సవం ఈ నెల 24న నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించే సిరిమానోత్సవానికి ఈ దేవర ఉత్సవం నాంది వంటిది. ఏటా వైశాఖ మాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

24న పైడిమాంబ దేవర ఉత్సవం
పైడిమాంబ

రోనా నిబంధనల నడుమ నిర్వహణకు ఏర్పాట్లు 

కలెక్టర్‌, ఎస్పీలకు లేఖ రాసిన దేవదాయశాఖ 

(విజయనగరం రూరల్‌) 

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ దేవర ఉత్సవం ఈ నెల 24న నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. దసరా పండుగ వెళ్లిన మరుసటి మంగళవారం నిర్వహించే సిరిమానోత్సవానికి ఈ దేవర ఉత్సవం నాంది వంటిది. ఏటా వైశాఖ మాసంలో దేవర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పైడిమాంబ ఆరు నెలలు రైల్వే స్టేషన్‌ వద్దనున్న వనంగుడిలోనూ...మరో ఆరు నెలలు మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి వద్ద దర్శనమిస్తారు. వైశాఖ మాసంలో వనంగుడి నుంచి చదురుగుడికి పైడిమాంబను తీసుకురావడమే దేవర ఉత్సవం. అక్టోబరు నెలలో జరిగే సిరిమానోత్సవం, ఉయ్యాల కంబాల ఉత్సవం అనంతరం  తిరిగి వనంగుడికి వెళతారు. ఏటా దేవర ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించేవారు. మేళతాళాలు, అమ్మవారికి ఇష్టమైన సాముగరిడీలు, పులివేషాలు ఇలా పైడిమాంబ భక్తుల కోలాహలం మధ్య దేవర ఉత్సవం జరిగేది. గత ఏడాది కూడా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కరోనా నిబంధనలు అనుసరించి దేవర ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఏడాది కూడా కరోనా కారణంగా ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. దేవర ఉత్సవం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ప్రారంభమై, తెల్లవారు జామున ఆరు గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు కలెక్టరు హరిజవహర్‌లాల్‌, ఎస్పీ రాజకుమారికి లేఖ రాశారు. వారి నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేపట్టేందుకు ఆలయ ఈవో కిషోర్‌కుమార్‌ నిర్ణయించారు.

దేవర ఉత్సవం ఇలా 

దేవర ఉత్సవం రాత్రి ఏడు గంటలకు పైడిమాంబ ఆలయం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి హుకుంపేటలో ఉన్న పూజారి బంటుపల్లి వెంకటరమణ ఇంటికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ పూజల అనంతరం ఊరేగింపు వనంగుడికి చేరుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది. పెద్దచెరువుకు, వనంగుడిలోనూ పైడిమాంబ భక్తులు, పురోహితులు పూజలు నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలకు రైల్వే స్టేషన్‌ నుంచి ఊరేగింపుగా బయలుదేరి రైల్వేస్టేషన్‌ రోడ్డు, ఎన్‌సీసీఎస్‌ రోడ్డు, కన్యకాపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం రోడ్డు మీదుగా చదురుగుడికి చేరుకుంటుంది. అక్కడ తొలుత అధికారులు, అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అవకాశం కలిస్తారు. దేవర ఉత్సవం రోజున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం  ఉంది.. చాలా మంది అదే రోజు ముర్రాటలు సమర్పించనున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రస్తుతం పైడిమాంబ ఆలయాన్ని ఉదయం 6  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరుస్తున్నారు. కరోనా విజృంభణ తగ్గితే సాయంత్రం కూడా భక్తులకు అవకాశం ఇస్తారు. లేదంటే నిర్దేశించిన సమయంలోగానే మొక్కుబడులు తీర్చుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా దేవర ఉత్సవం రోజున కొద్ది మంది భక్తులకు మాత్రమే అవకాశం కల్పించారు.. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 



Updated Date - 2021-05-11T05:05:31+05:30 IST