పల్లెకు పండుగ

ABN , First Publish Date - 2021-01-11T07:18:56+05:30 IST

సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి హైదరాబాద్‌ నుంచి రాష్ట్రవాసులు భారీగా తరలివస్తున్నారు.

పల్లెకు పండుగ

  • హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు పయనం
  • కీసర, పంతంగి టోల్‌గేట్ల వద్ద భారీ రద్దీ 
  • 2 రోజుల్లో 37 వేల వాహనాలు రాక..
  • ఉత్తరాంధ్రకు భారీగా ప్రత్యేక బస్సులు


కంచికచర్ల రూరల్‌/చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి 10: సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడానికి హైదరాబాద్‌ నుంచి రాష్ట్రవాసులు భారీగా తరలివస్తున్నారు. వీరిలో అధిక శాతం సొంత కార్లలో బయల్దేరడంతో విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణ వైపు నుంచి వస్తున్న వాహనాలతో కృష్ణాజిల్లా కీసర టోల్‌గేట్‌ వద్ద ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. గత రెండు రోజుల్లో దాదాపుగా 37వేల వాహనాలు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ఫాస్టాగ్‌ లైన్లలో అంతరాయం లేకుండా టోల్‌గేట్‌ సిబ్బంది చర్యలు చేపట్టారు. నందిగామ రూరల్‌ సీఐ సతీష్‌, ఎస్సై రంగనాథ్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా వద్ద 16 గేట్లకుగాను 10 గేట్ల నుంచి వాహనాలను విజయవాడ వైపు పంపుతున్నారు. రెండు రోజుల్లో 80వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. 


ఉత్తరాంధ్రకు ఆర్టీసీలో ‘స్పెషల్స్‌’

సంక్రాంతి పండుగ ప్రయాణాలు ఊపందుకోవడంతో ఉత్తరాంధ్రకు ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు భారీగా తిప్పుతున్నారు. రెండు రోజులుగా రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళంలకు 80కి పైగా స్పెషల్‌ బస్సులు నడుస్తున్నాయి. సోమవారం ఈ రూట్‌లో 90 బస్సులు నడపటానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రెగ్యులర్‌ రైళ్లు లేకపోవడంతో విజయనగరం, ఒడిశా వెళ్లేవారు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.


పండగ సమీపిస్తుండటంతో విజయవాడ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికుల సంఖ్య కూడా పెరుగుతోంది. పండగ రోజు వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చేవారి కోసం ఆదివారం విజయవాడ నుంచి 10 స్పెషల్‌ బస్సులను పంపించారు. ఇప్పటికే చాలామంది ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వచ్చేసి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తుండటంతో ఈసారి ప్రయాణాలు బాగా తగ్గాయి. పండగ తర్వాత రెగ్యులర్‌గా ఆఫీసులకు రావాలని ఐటీ కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తుండటంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-01-11T07:18:56+05:30 IST