దసరా సందడి షురూ...మార్కెట్‌లో పండుగ కొనుగోళ్లు

ABN , First Publish Date - 2020-10-19T10:19:40+05:30 IST

కరోనాతో ఈ ఏడాది పండుగలు ఇళ్లకే పరిమితమయ్యాయి. బతుకమ్మ పండుగతోపాటు దసరాను ఇళ్లలో సంబురంగా జరుపుకోవడానికి జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు

దసరా సందడి షురూ...మార్కెట్‌లో పండుగ కొనుగోళ్లు

కిటకిటలాడుతున్న షాపింగ్‌మాల్స్‌

ఆఫర్లతో ప్రత్యేక ఆకర్షణ

ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్ల జోరు

కొవిడ్‌ను మరిచి సందడి 


(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

కరోనాతో ఈ ఏడాది పండుగలు ఇళ్లకే పరిమితమయ్యాయి. బతుకమ్మ పండుగతోపాటు దసరాను ఇళ్లలో సంబురంగా జరుపుకోవడానికి జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. కొత్త దుస్తుల కొనుగోలుకు జనం బయటకు వస్తుండడంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. లాక్‌డౌన్‌తోపాటు వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా జనం ఇంటిపట్టునే ఉండడంతో వ్యాపారాలు వెలవెలబోయాయి. బతుకమ్మ, దసరా పండుగలతో మళ్లీ పండుగ జోష్‌ కనిపిస్తోంది. వ్యాపారులు పండుగ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు  సిరిసిల్ల, వేములవాడలో షాపింగ్‌ సందడి మొదలైంది.  


కొత్త దుస్తుల సంప్రదాయం 

బతుకమ్మ, దసరా అనగానే ఇంటిల్లిపాది కొత్త దుస్తులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. ధనిక, పేద తేడా లేకుండా ప్రతీ ఒక్కరు కొత్త బట్టలను కొనుగోలు చేస్తారు. కొత్త దుస్తులు ధరించి దసరా పండుగ రోజు జమ్మి పంచుకుంటారు. బతుకమ్మ పండుగ రోజు మహిళలు ఆటాపాటలతో గడుపుతారు. దీంతో చీరల దుకాణాలే కాకుండా రెడిమెడ్‌ దుకాణాలు, కిడ్స్‌వేర్‌లు కళకళలాడుతున్నాయి. బట్టల దుకాణాల్లో కొందరు వ్యాపారులు రూ. 2 వేల నుంచి ఆపై కొనుగోలు చేసిన వారికి వెండి నాణేలు, వివిధ వస్తువులు బహుమతులుగా అందజేస్తున్నారు. 


ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్ల జోరు 

దసరా సందర్భంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగింది. ప్రధాన సంస్థలు 80 శాతం వరకు డిస్కౌంట్‌లు ప్రకటించడంతో జిల్లాలో భారీగా కొనుగోలు చేస్తున్నారు. గృహాల్లో అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లకు పండుగ సందర్భంగా ఇష్టపడతారు. దీనికి అనుగుణంగానే వివిధ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి.   టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మిషన్లు, సెల్‌ఫోన్ల కొనుగోళ్లు పెరిగాయి. 


పండుగల సందడి..చీరల సోయగాలు 

మహిళల  హుందాతనాన్ని  పెంచేవి పట్టు చీరలు. ఈ సారి డిజైనర్‌ చీరలు మార్కెట్‌లో మహిళలను ఆకర్షిస్తున్నాయి. బతుకమ్మ, దసరా కోసం   వ్యాపారులు దుస్తుల నిల్వలు ఏర్పాటు చేశారు. పట్టు చీరల తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటాయి. మార్కెట్లో అసలైన పట్టు వస్త్రాల ఖరీదు భారీగా  కనిపిస్తుంది. రూ.2 వేల నుంచి రూ.లక్షకుపైగా ఉంటాయి. మార్కెట్లో అసలైన పట్టు వస్త్రాల ఖరీదు కనీసం రూ.5 వేల నుంచి మొదలవుతుంది. 


పట్టు వస్త్రాల కొనుగోలుతో జాగ్రత్తలు అవసరం 

 పట్టు వస్త్రాల తయారీలో కొంత మెరుపులు ఉన్నా వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మల్బరీ సిల్క్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో అసలైన పట్టును గుర్తించాలంటే యానిమల్‌ ఫైబర్‌ జుట్టు ఊలు మాదిరిగా ఉంటుంది. దీని దారం పోగులను చివరి భాగంలో కత్తిరించి కాల్చినప్పుడు జుట్టు కాలిన వాసన వస్తుంది. పట్టయితే కాలకుండా వెంటనే ఆగిపోతుంది.  గుండ్రంగా పూసలా మారుతుంది. పట్టు వస్త్రాలకు నీళ్లను ఎక్కువగా పీల్చుకునే, వదిలించుకునే గుణాలు ఉంటాయి. దీంతో నీళ్లలో ఎక్కువ సమయం ఉంచితే రంగు పోతుంది. పట్టు వస్త్రాలను ఉతికి శుభ్రం చేసే సమయంలో గోరు వెచ్చని మంచినీటిని ఉపయోగించాలి. నీళ్లలో బేబీషాంపు వంటివి ఉపయోగించవచ్చు. పట్టు వస్త్రాలను ఎక్కువ  కాలం ఒకేలాగ మడతలు ఉంచవద్దు. మార్చడం మంచిది. 

Updated Date - 2020-10-19T10:19:40+05:30 IST