పండగల కాలం

ABN , First Publish Date - 2021-09-08T05:51:22+05:30 IST

పాఠశాలలు తెరవడం, ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడం గురించి చర్చ ముగిసి, స్వచ్ఛంద ప్రాతిపదిక మీద విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు....

పండగల కాలం

పాఠశాలలు తెరవడం, ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడం గురించి చర్చ ముగిసి, స్వచ్ఛంద ప్రాతిపదిక మీద విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. కొవిడ్ స్థితిగతుల కారణంగా ‘నీట్’ ప్రవేశ పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. బెంగాల్‌లో ఉప ఎన్నికను దాని అనివార్యత రీత్యా అంగీకరించిన ఎన్నికల కమిషన్ తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికను మాత్రం వాయిదా వేసింది. కొవిడ్ మూడో ఉప్పెన వస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థలు తమను తాము కట్టుదిట్టం చేసుకుంటున్నాయి. ఇంతకీ, మహమ్మారి పరిస్థితి ఏమిటి? తిరిగి సాధారణ వాతావరణం నెలకొంటున్నదా? ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయా? లేక, అటూ ఇటూ కాకుండా సందిగ్ధత నెలకొన్నదా?


కొవిడ్ విషయంలో నిశ్చింతగా ఉండగలిగే పరిస్థితి రాలేదన్నమాటలో ఎటువంటి సందేహం లేదు. కానీ, పరిస్థితిపై అంచనాలే రకరకాలుగా ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాలలో వ్యాధి వ్యాప్తి కొత్త వేగం పుంజుకుంటున్నది. కొన్ని రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుండగా, తక్కిన చోట్ల సాధారణ జనజీవనం కనిపిస్తున్నది. వ్యాధివ్యాప్తి లెక్కలు ఎట్లా ఉన్నా, జాగ్రత్తలు పాటిస్తున్నవారు పాక్షికంగానే కనిపిస్తున్నారు. ఎక్కువగా జనసమ్మర్దానికి ఆస్కారం ఉన్న మత, సాంస్కృతిక కార్యక్రమాలలో, రాజకీయ సభల్లో యాత్రల్లో జనం విపరీతంగా కనిపిస్తున్నారు. అజాగ్రత్తగా ఉన్నా, వ్యాప్తి కొన్ని చోట్ల కనిపించడం లేదంటే అందుకు కారణం, స్థానికంగా ఉన్న మూకుమ్మడి నిరోధక శక్తిగానీ, టీకాకరణ అధికంగా జరిగి ఉండడం కానీ, కొన్ని శ్రేణుల ప్రజలలో సోకడం తక్కువగా ఉండడం కానీ అయి ఉండవచ్చు. 


ఇప్పుడిక పండుగల కాలం వస్తున్నది. శుక్రవారం నాడు వినాయక చవితితో గణపతి నవరాత్రులు ప్రారంభమవుతాయి. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడానికి ఆస్కారం ఉన్న పండుగ ఇది. త్వరలో బతకమ్మ, విజయదశమి, ఆ తరువాత దీపావళి పండుగలు రానున్నాయి. అన్ని పండుగలకు ప్రభుత్వ నియంత్రణ అవసరం ఉండదుకానీ, నిమజ్జనం వంటి కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి జోక్యం అవసరం అవుతుంది. ఈ సందర్భంగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పిన మాటలను ఇక్కడ చెప్పుకోవాలి. ‘‘పండుగల కంటె ప్రజల ప్రాణాలు ముఖ్యం’’ అన్నారాయన. మహారాష్ట్రలో ఇప్పుడు రోజువారీ కేసుల నమోదు 5వేల దరిదాపుల్లో ఉన్నది. కానీ, కేరళలో రోజుకు 30 వేల కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో అయితే, రోజుకు లక్ష కేసుల దాకా వస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ వ్యాప్తి ఉన్నా, తక్కిన ప్రపంచం సురక్షితం కాదు. దక్షిణాఫ్రికాలో ప్రమాదకరమైన కొత్త రకాల కొవిడ్ పుట్టుకువస్తున్నదట. తెలంగాణలో మొత్తం మీద బలహీనపడింది కానీ, అటవీ ప్రాంతాల్లో వ్యాప్తి ఆందోళన కరంగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో మందగించింది కానీ, పూర్తిగా వెనుకపట్టు పట్టలేదు. ఈ సమయంలో అజాగ్రత్తగా పండుగలు జరుపుకోవడం అవసరమా? 


కొవిడ్-19 స్వభావ రీత్యా ఉన్న ప్రమాదంతో పాటు, దానిని ఎదుర్కొనడంలో ఉన్న పరిమితులు కూడా సమస్యకు తోడవుతున్నాయి. రెండు డోసుల టీకాలు వేసుకున్న వారి సంఖ్య మన దేశంలో స్వల్పం.  రెండు డోసులు వేసుకున్న వారిలో కూడా కరోనా సోకడం తరచు వింటున్నందున, ఒకే ఒక్క డోసు వేసుకున్న వారికి రక్షణ అంతంత మాత్రమే. టీకాల ఉత్పత్తి వేగం, మన అవసరం మధ్య నిష్పత్తి పొసగకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మధ్య దేశంలో ఒక్కరోజునే రికార్డు స్థాయిలో కోటీ పాతిక లక్షల డోసుల టీకా వేసినప్పటికీ, అది పూర్తి టీకాకరణ వ్యాప్తి శాతాన్ని పెద్దగా పెంచలేదు. టీకాకరణ పాక్షికంగా ఉన్నప్పుడు, కొత్త రకం కొవిడ్‌లు ఉనికిలోకి రావడం, జనంలో నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతాయి. ఈ విషవలయాన్ని ఛేదించడం పూర్తి టీకాకరణ, పూర్తి మూకుమ్మడి నిరోధకశక్తి వల్లనే సాధ్యపడుతుంది. వచ్చే సంవత్సరం ఆరంభంలో కానీ, అటువంటి సామర్థ్యాన్ని మనం పొందలేము. అప్పటిలోగా, కొవిడ్‌కు కొత్త కోరలు మొలిస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. అందువల్లనే, ఈ సంవత్సరం కూడా తగిన జాగ్రత్తలతోనే జీవనాన్ని సాగించాలి. తప్పదు. విసిగిపోయో, పంతానికి పోయో పాటించవలసిన జాగ్రత్తలను గాలికి వదలడం మంచిది కాదు. 


పండుగలు జరుపుకోవలసిందే. ఎట్లా, ప్రమాదరహితంగా జరుపుకోగలమో ఎవరికి వారు ఆలోచించవలసి ఉన్నది. మన నిర్లక్ష్యం మనకే కాదు, ఇతరులకు కూడా చేటు చేస్తుంది. అట్లాగే, ఇతరుల అలక్ష్యం మనకు హాని చేస్తుంది. పరస్పరత ఇక్కడ ముఖ్యం. కాబట్టి, అధికారులు సంకల్పించే విధివిధానాలకు అందరూ సహకరించాలి. అట్లాగే, ఎక్కువమందితో దగ్గరగా మెలగవలసి వచ్చేవారందరూ బాధ్యతగా టీకాలు తీసుకోవాలి. గణేశ్ మండపాల బాధ్యులు, కార్యకర్తలు, పూజారులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

Updated Date - 2021-09-08T05:51:22+05:30 IST