ఫీవర్‌ బెల్స్‌

ABN , First Publish Date - 2021-08-21T07:59:33+05:30 IST

కొవిడ్‌తో సతమతం అవుతున్న జిల్లా మీద జ్వరాల దాడి మొదలైంది.

ఫీవర్‌ బెల్స్‌

జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు 

నేడు దోమల దినం


మలేరియా వ్యాప్తికి అనోఫిలిన్‌ అనే ఆడదోమ కారణమని 1897లో ఆగస్టు 20న  బ్రిటన్‌ వైద్య నిపుణుడు  సర్‌ రొనాల్డ్‌ రోజ్‌ కనుగొన్నారు. ఆయన స్మృతిగా ఈ రోజును ప్రపంచ దోమల నివారణా దినంగా జరుపుకొంటున్నారు.


కొవిడ్‌తో సతమతం అవుతున్న జిల్లా మీద జ్వరాల దాడి మొదలైంది. అడపా దడపా వానలు పడుతూనే ఉండడంతో జ్వరాల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా డెంగ్యూ ముప్పు జిల్లాకు పొంచి ఉందని పెరుగుతున్న కేసులు సూచిస్తున్నాయి.  2017, 2019 సంవత్సరాల నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికార యంత్రాంగం తక్షణం అప్రమత్తం కాకపోతే మాత్రం కొవిడ్‌కన్నా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. 


తిరుపతి - ఆంధ్రజ్యోతి: తిరుపతిలో ఎస్వీఆర్‌ రుయా ఆస్పత్రిలో రోజుకి సరాసరి 300 మంది ఓపీకి వస్తుంటే ఇందులో 60(20శాతం) మంది జ్వరంతోనే వస్తున్నారు. స్విమ్స్‌ మీద జ్వరం తొలి దశ రోగుల తాకిడి పెద్దగా లేనప్పటికీ జ్వరం తీవ్రత పెరిగి తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలతో రోజుకు 10 నుంచి 20 మంది వరకు వస్తున్నారు.  ఇక ప్రయివేటు డాక్టర్‌ల దగ్గరకు వస్తున్న రోగుల్లో అత్యధికం జ్వరపీడితులే ఉంటున్నారు. జ్వరాల్లోనూ డెంగ్యూ కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. 2020లో 25 డెంగ్యూ కేసులు నమోదైతే ఈఏడాది ఆగస్టు 17వ తేది వరకే 26 కేసులు నమోదు అయ్యాయి. . అదేవిధంగా మలేరియా కేసులు గత ఏడాది 3 వస్తే ఈఏడాది ఇప్పటివరకు 13 కేసులు నమోదయ్యాయి. ఇక జ్వరం వచ్చిన 50 శాతం మందిలో సాధారణ టైఫాయిడ్‌ ఉన్నట్టు నిర్థారణ అవుతోంది. 


ఇవీ కారణాలు.. 

వానలతో పాటూ జ్వరాలు పెరగడానికి ప్రధానకారణం నీటి నిల్వ. లార్వాలు పెరిగి ఎండకి పిగిలి దోమల వ్యాప్తి జరుగుతుంది. ప్రధానంగా నీరు, దోమలు, గాలి  ద్వారా ఈ సీజన్‌లో ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. నీటి ద్వారా గ్యాస్ట్రోఎంటైటిస్‌, డయేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు వస్తే దోమలు ద్వారా మలేరియా, జపనీస్‌ ఎన్‌సెఫలైటి్‌స, డెంగ్యూ, చుకెన్‌గున్యా వ్యాధులు వస్తాయి. ఇక గాలి ద్వారా స్వైన్‌ ఫ్లూ, వైరల్‌ జ్వరాలు సోకతాయి. 


ఇవి చేస్తున్నారా?

ఫపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. 

సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.

ఇళ్ళ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి. వాటిల్లో క్రిమి సంహార మందు చల్లాలి.

మురుగు నీటి కాలువల్లో రసాయనాలు చల్లాలి.

పట్టణాల్లో ఫాగింగ్‌ చేయాలి.

ఇవి గనుక మీ ఊళ్లో, పట్టణంలో జరగకపోతే మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయాలి. వార్డుల్లో వలంటీర్లు దృష్టికి తీసుకువెళ్లాలి. వారు ఏర్పాటు చేసిన వాట్సాప్‌ వార్డు గ్రూపుల్లో మీ పరిసరాల్లోని పరిస్థితులను ఫొటోలు తీసి పోస్టు చేయాలి. మనకెందుకులే అనుకుంటే మన ఆరోగ్యానికే ప్రమాదం.  


ఫీవర్‌ ఆస్పత్రి ఎప్పుడు?

ఉమ్మడి ఆంధ్రలో హైదరాబాద్‌లో ఫీవర్‌ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం మనకంటూ ఓ ఫీవర్‌ ఆస్పత్రి లేదు. తిరుపతిలో ఫీవర్‌ ఆస్పత్రి ఏర్పాటు  అవసరం చాలా ఉంది.  తిరుపతికి ఎక్కడెక్కడనుంచో వచ్చే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచీ భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు.  రకరకాల బ్యాక్టీరియా, వైర్‌సలు తిరుపతిని తాకే అవకాశాలుంటాయి.  ఫీవర్‌ ఆస్పత్రి ఉంటే అన్ని రకాల జ్వరాలకు కారణమైన బ్యాక్టీరియా, వైర్‌సలను అధ్యయనం చేసే ల్యాబ్‌ అందుబాటులోకి వస్తుంది. తద్వారా చికిత్స సులభతరం అవుతుందనేది వైద్యుల అభిప్రాయం.


అవగాహన కల్పిస్తున్నాం  

వాతావరణంలో విపరీత మార్పులు కారణంగా జ్వరాలు పెరుగుతున్న మాట నిజమే. కమిషనరు గిరీష అదేశాల మేరకు ఎప్పటికప్పుడు వార్డుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జాగ్రత్తలు చెబుతున్నాం. నగరంలో సరాసరి ప్రస్తుతం 6 డెంగ్యూ కేసులు వస్తున్నాయి. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది.


రెండు రోజులు తగ్గకపోతే ఆస్పత్రికి వెళ్లాలి

ఈ సీజన్‌లో జలుబు, దగ్గుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా సైనసైటిస్‌, టాన్సిలైటిస్‌ ఉన్న రోగుల్లో సీజనల్‌ వైర్‌సలు చేరుతుంటాయి. రెండు, మూడు రోజులకు మించి దగ్గు తగ్గక పోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, స్టిరాయిడ్స్‌ వాడే వారు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (సీఓపీడీ), సీజనల్‌ ఫ్లూ (స్వైన్‌ ఫ్లూ)లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే తగు చికిత్స చేసుకోవాలి. గొంతు నొప్పి ఉన్నవారు గోరు వెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం, ముక్కు, నోరు శుభ్రంగా పెట్టుకోవడం చేయాలి. 


జ్వరమే కదా అనుకోవద్దు

జ్వరమే కదా ఒక మందు బిళ్ల వేసుకుంటే పోతుందని నిర్లక్ష్యం చేయవద్దు. లక్షణాలను బట్టి తగిన పరీక్షలు, వైద్యం చేసుకోవాలి. జ్వరం వచ్చిన 48 గంటల వరకు సాధారణ చికిత్స అందిస్తారు. రెండు రోజులు గడిచిన తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. కనుగుడ్లు పగిలినట్టు ఉంటే డెంగ్యూ జ్వర లక్షణంగా అనుమానించవచ్చు. ఇక తీవ్రమైన చలి, జ్వరం, కొద్దిపాటి దగ్గు, జలుబు ఉంటే మలేరియాగా ప్రాథమికంగా గుర్తించి రక్తపరీక్షల అనంతరం నిర్ధారణకు వస్తాం. ఇక ముక్కుల నుంచి జలుబు నీరు కారుతుంటే స్వైన్‌ఫ్లూ లక్షణంగా చెప్పవచ్చు.  చిన్నపిల్లలు, గర్భిణులు, షుగర్‌ వ్యాధి ఉన్న వృద్ధులకు తీవ్ర జ్వరం (హై ఫీవర్‌) వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కూల్‌ కెళ్లే పిల్లల్లో ఒకరికి వైరల్‌ ఫీవర్‌ వస్తే పక్కనవారికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భిణులకు 102, 103 ఫారెన్‌ హీట్స్‌కు వెళితే గర్భస్త శిశువు మృతిచెందే అవకాశం ఉంటుంది. అందువల్ల గర్భిణుల ఉష్ణోగ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం వస్తే బయట తిరగకుండా వైద్యుడు సూచించిన మేరకు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు పాటించడం వలన చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. చేతులను శుభ్రంగా పెట్టుకోవడం, దగ్గేటప్పుడు మందంగల గుడ్డను అడ్డుపెట్టుకోవడం చేయాలి. 


డెంగ్యూ తీవ్రత ఇలా ఉంది

సంవత్సరం    డెంగ్యూ      మలేరియా 

2017             421           74      

2018               44            44

2019              327                8

2020               25                 3

2021               26              13

(ఆగస్టు 17వరకు)  

(వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం)

Updated Date - 2021-08-21T07:59:33+05:30 IST