Abn logo
Jun 8 2021 @ 00:00AM

కొవిడ్‌ కాలంలో... పిల్లల్లో జ్వరం ప్రమాదకరం

  

పిల్లల్లో కొవిడ్‌ లక్షణాలు బయటపడినా, పడకపోయినా కరోనా ఇన్‌ఫెక్షన్‌తో కూడిన పరిసరాలకు బహిర్గతమైతే చాలు. ఆ తర్వాత కొన్ని వారాల లోపు జ్వరం కనిపిస్తే, మిగతా కారణాలతో పాటు మల్టీ సిస్టం ఇన్‌ప్లమేటరీ సిండ్రోమ్‌ను కూడా గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలి. చాప కింద నీరులా చప్పుడు లేకుండా పిల్లల ఆరోగ్యాన్ని కుదేలు చేసే ఈ రుగ్మతను ప్రారంభంలోనే గుర్తించి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. 


మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎమ్‌ఐఎస్‌ - సి) అనేది కొవిడ్‌ తదనంతర పరిణామం. అయితే ఈ సిండ్రోమ్‌కు గురవ్వాలంటే కచ్చితంగా కొవిడ్‌ లక్షణాలు బయల్పడవలసిన అవసరం లేదు. కరోనా సోకి ఉన్న వ్యక్తులు, పరిసరాలకు బహిర్గతమైతే చాలు. అంటే... కుటుంబ సభ్యులకు కొవిడ్‌ సోకవచ్చు. లేదా నేరుగా పిల్లలే కొవిడ్‌ బారిన పడవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబసభ్యులు, పిల్లలు కూడా అసింప్టమాటిక్‌గా (లక్షణాలు బయట పడకుండా) ఉండవచ్చు. ఇలా ఏ విధంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు పిల్లలు బహిర్గతమైనా, నాలుగు వారాల లోపు వారిలో ఎమ్‌ఐసి - సి తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ రుగ్మత ప్రధానంగా జ్వరంతో బయల్పడుతుంది. కాబట్టి పిల్లల్లో జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 


జ్వరంతో పాటు భిన్న లక్షణాలు 

సిండ్రోమ్‌ అంటే లక్షణాల కూటమి. ఇది వ్యాధి కాదు. శరీరంలో తలెత్తిన భిన్న అవయవాలకు సంబంధించిన రుగ్మతకు ప్రతిఫలంగా శరీరంలో బయల్పడే లక్షణాల సమూహం ఇది. మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ అంటే... కనీసం రెండు ప్రధాన వ్యవస్థలు రుగ్మతకు గురవుతాయని అర్ధం చేసుకోవాలి. అవి మెదడు, గుండె కావచ్చు. మూత్రపిండాలు, గుండె కావచ్చు. మూత్రపిండాలు, పేగులు కలిపి ఇన్‌ఫ్లమేషన్‌ బారిన పడి ఉండవచ్చు. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ మూడు రకాల లక్షణాలతో బయల్పడుతుంది. 


జ్వరం: పిల్లల్లో తీవ్ర జ్వరం కనిపించవచ్చు. 

కవాసాకి సిండ్రోమ్‌ను పోలినట్టు: గుండె రక్తనాళాలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురయ్యే పరిస్థితి ఇది. ఈ సమస్యతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి భవిష్యత్తులో పిల్లలు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటి కొవిడ్‌ కాలంలో పూర్వం నుంచే ఉన్న ఈ కవాసాకి వ్యాధిని పోలిన లక్షణాలు పిల్లల్లో బయల్పడుతున్నాయి. కళ్లు, నాలుక ఎర్రబడడం, చేతులు, చర్మం మీద ఎర్రని దద్దుర్లు తలెత్తడం, సుమారుగా ఒక వారం తర్వాత వేళ్ల చివర్లలో తోలు ఊడడం, మెడ దగ్గరి లింఫ్‌ గ్రంథుల్లో వాపు లాంటి లక్షణాలు కనిపించవచ్చు.

షాక్‌: రక్తపోటు పడిపోయి, రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం వల్ల ఆక్సిజన్‌ స్థాయిలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుని పిల్లలు షాక్‌కు గురవుతారు. రక్తనాళాల ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల, గుండె పనితీరు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఈ మూడు రకాల లక్షణాలలో ఒకటి లేదా రెండు లక్షణాలు కలిసి ఎమ్‌ఐఎస్‌ - సి రూపంలో బయల్పడవచ్చు. మరీ ముఖ్యంగా కొవిడ్‌ పాండమిక్‌ సమయంలో పిల్లల్లో 24 నుంచి 72 గంటల పాటు ఎలాంటి జ్వరం (38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ లేదా 100.4 డిగ్రీల ఫారిన్‌హీట్‌) కనిపించినా, ఆ జ్వరంతో పాటు చేతులు, కాళ్లు పాలిపోయినట్టు కనిపించినా, నీలంగా మారినా, బిడ్డ శరీరం చల్లబడినా,  బిడ్డ సొమ్మసిల్లినట్టు కనిపించినా, మత్తుగా మారినా, మూర్ఛ వచ్చినా లేదా శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉన్నా, ఛాతీలో నొప్పి అంటున్నా, విపరీతమైన పొట్ట నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయో లేదో పెద్దలు గమనించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను అత్యవసరంగా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. 


ఈ పరీక్షలతో గుర్తించవచ్చు 

ఆర్‌టి పిసిఆర్‌ పాజిటివ్‌ వచ్చినా, రక్తపరీక్షలలో యాంటీబాడీలు పాజిటివ్‌ వచ్చినా, గత కొన్ని వారాల సమయంలో కరోనా వైరస్‌కు బహిర్గతమైనట్టు తెలిసినా, డాక్టర్లు దీని గురించి ఆలోచిస్తారు. తదుపరి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌ టెస్ట్‌లు (సిఆర్‌పిఈస్‌ఆర్‌, సెర్రిటిన్‌, ఎల్‌డిహెచ్‌, డీ డైమర్‌ మొదలైన పరీక్షలు) అవసరపడతాయి. ఈ పరీక్షల ఫలితాలు ఎక్కువగా ఉండి, వేరే ఇన్‌ఫెక్షన్‌ ఏదీ లేదని తెలిస్తే, అప్పుడు ఎమ్‌ఐఎస్‌ను 90ు నిర్థారించుకుని, అందుకు చికిత్స మొదలుపెట్టవలసి ఉంటుంది. అలాగే రక్తం గడ్డకట్టే తత్వాన్ని, గుండె పనితీరును కూడా పరీక్షించి, మార్పులు ఉంటే అందుకు తగిన చికిత్సను అందించవలసి ఉంటుంది. అలాగే పేగుకు సోకిందో, లేదో తెలుసుకోవడం కోసం పొట్ట స్కాన్‌ కూడా చేయవలసిరావచ్చు. ఎక్స్‌ రేలు, సిటిలు కూడా అవసరాన్ని బట్టి చేయవలసి ఉంటుంది. కొవిడ్‌ బారిన పడడం లేదా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు బహిర్గతమవడం... ఇలా ఎమ్‌ఐఎస్‌కు అసలు కారణాన్ని పరీక్షలతో నిర్ధారించి, తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. 


చికిత్స ఇలా...

ఐవి ఇమ్యునోగ్లోబులిన్‌తో వ్యాధి తీవ్రమవకుండా అడ్డుకోవచ్చు. అలాగే స్టిరాయిడ్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. గుండె రక్తనాళాలు వాచినా, రక్తం చిక్కబడే తత్వం హెచ్చుతగ్గులకు లోనైనట్టు కనిపించినా యాస్ర్పిన్‌, లో మాలిక్యులార్‌ హెపారిన్‌ మొదలైన మందులు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే పిల్లలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్‌తో పాటు ఐవి ఫ్లూయిడ్స్‌, గుండె సక్రమ పనితీరుకు ఐయనోట్రోప్స్‌ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా పిల్లల్లో చోటుచేసుకునే ఆరోగ్య పరిస్థితికి తగిన చికిత్స అందించవలసి ఉంటుంది. 


పెద్దల అప్రమత్తత అవసరం

కుటుంబంలో ఎవరికైనా కొవిడ్‌ వచ్చి తగ్గినా, ఎవరికీ రాకపోయినా... పిల్లల్లో జ్వరం కనిపించినప్పుడు మాత్రం అది కొవిడ్‌కు సంబంధించినది కాదులే అనుకుని పెద్దలు నిర్లిప్తంగా ఉండిపోకూడదు. కొవిడ్‌ సోకిన కొందర్లో లక్షణాలు బయల్పడవు. కాబట్టి అలాంటి అసింప్టమాటిక్‌ వ్యక్తుల ద్వారా కూడా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు పిల్లలు బహిర్గతమవుతారు. దాంతో పిల్లలు సింప్టమాటిక్‌ లేదా అసింప్టమాటిక్‌... ఇలా రెండు రకాలుగా కొవిడ్‌కు గురవుతారు. అంటే కొవిడ్‌ నేరుగా సోకి, దాని తదనంతర పరిణామంగా. లేదా కొవిడ్‌కు బహిర్గతం కావడం మూలంగా అప్పటి నుంచి నాలుగు వారాల లోపు పిల్లలు ఎమ్‌ఐఎస్‌ - సి బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొవిడ్‌ కాలంలో పిల్లల్లో జ్వరం, దాంతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తే ఎమ్‌ఐఎస్‌ - సిగా అనుమానించి, ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. 
ప్రసవానికి ముందు కొవిడ్‌ బారిన పడే మహిళలు ఉంటారు. ఆ తర్వాత వారికి పుట్టిన పసికందులు మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పుట్టిన కొన్ని వారాల్లో కూడా ఈ సమస్య బయల్పడవచ్చు. పసికందుల్లో ఎమ్‌ఐఎస్‌ లక్షణాలు పూర్తిగా కనిపించకపోవచ్చు. కాబట్టి (జ్వరం ఉన్నా, లేకపోయినా) పిల్లల్లో చురుకుదనం లోపించినా, పాలు సక్రమంగా తాగకపోయినా, శరీరం మీద ఎర్రని మచ్చలు కనిపించినా, శ్వాస వేగంగా లేదా కష్టంగా తీసుకుంటున్నా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి.


మయోకార్డైటిస్‌

తీవ్ర జ్వరంతో పాటు గుండె కండరాలు సక్రమంగా పనిచేయకపోవడం (మయోకార్డైటిస్‌) అనే సమస్య కొంతమంది పిల్లల్లో కనిపిస్తుంది. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. తీవ్ర జ్వరం వల్ల వేర్వేరు అవయవాలు ఫెయిల్‌ అవడం కూడా జరగవచ్చు. మెనింగ్జయిటిస్‌ రూపంలో కూడా ఎమ్‌ఐఎస్‌ - సి బయల్పడవచ్చు. కొంతమంది పిల్లల్లో అపెండిసైటిస్‌ లక్షణాలు కూడా కనిపించవచ్చు. 


- డాక్టర్‌ శివరంజని సంతోష్‌

చీఫ్‌ కన్సల్టెంట్‌ పిడియాట్రీషియన్‌,

మాగ్నా సెంటర్స్‌,

ఫిల్మ్‌ నగర్‌, హైదరాబాద్‌.