ఫీ.. వర్రీ

ABN , First Publish Date - 2022-01-25T05:38:06+05:30 IST

రాత్రుళ్లు పెరిగిన చలి తీవ్రత, పగలు ఎండ వేడిమి.. ఇటీవల కురిసిన వర్షాలు.. పగలు, రాత్రిళ్లు దోమల దాడి.. ఈ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా జ్వరాలు ప్రబలాయి.

ఫీ.. వర్రీ

జ్వరమంటే జంకుతోన్న జనం

భయపెడుతున్న యాంటిజెన్‌ టెస్టులు

ప్రబలుతున్న జ్వరాలు.. ప్రతి ఇంటా బాధితులు 

846 కేసులు.. 27.14 శాతానికి చేరిన పాజిటివిటీ


గుంటూరు(ఆంధ్రజ్యోతి), గుంటూరు(జీజీహెచ్‌), జనవరి 24: రాత్రుళ్లు పెరిగిన చలి తీవ్రత, పగలు ఎండ వేడిమి.. ఇటీవల కురిసిన వర్షాలు.. పగలు, రాత్రిళ్లు దోమల దాడి.. ఈ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా జ్వరాలు ప్రబలాయి. జ్వరాలతో పాటు దగ్గు, జలుబు తదితరాలతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ప్రతీ ఇంట జ్వర పీడుతులున్నారు. ఇదే సమయంలో జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కూడా అధికంగా ఉండటం.. జ్వరం వస్తే కరోనా అనే భయంతో జనం జంకుతున్నారు. విద్యాసంస్థల్లో కూడా హాజరు శాతం చాలాతగ్గిపోయింది. జ్వరం, దగ్గు, జలుబులతో ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాధారణ జ్వరమైనా ఆస్పత్రికి వెళ్తే టెస్టులు పేరిట జనం జేబులను గుల్ల చేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఆస్పత్రులకు వెళ్లలేక సొంత వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సాధారణ జ్వరమైతే బయట పడుతుండగా కరోనా అయితే తీవ్రంగా అస్వస్థతకు గురవుతున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ప్రైవేటులో భారం కావడం, ప్రభుత్వంలో ఆలస్యం కావడంతో 80 మంది అనుమానితులు యాంటిజెన్‌ టెస్టులకు వెళ్తున్నారు. రూ.350-600 వరకు ఈ టెస్టులు జిల్లాలోని అన్ని ప్రైవేటు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నారు.  జ్వరం, దగ్గు, జలుబు ఉండి యాంటిజెన్‌ టెస్టులు చేసిన 90 శాతం మందికి కరోనా పాజిటివ్‌గానే వస్తుంది. దీంతో వైద్యులు కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు అంటూ తమ వద్దకు వచ్చే అందరికీ ఈ పరీక్షలు చేపిస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో కరోనా పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. 48 గంటల తరువాత గానీ ఫలితాలు రావడంలేదు. దీంతో బాధితుల్లో ఆందోళన నెలకొంటుంది. పాజిటివ్‌ బాధితులకు సమాచారం వెళ్తుండగా నెగిటివ్‌ వచ్చిన వారు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. దీంతో నెగిటివ్‌ ఉన్న వారు సమాచారం తెలియడంలేదని ఆందోళన చెందుతున్నారు.


ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి..

కరోనా గతంలో లాగా 14 రోజుల వైరస్‌ కాదని, దీని ప్రభావం కేవలం ఐదు రోజులు మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ అంత ప్రభావం లేదంటున్నారు. పాజిటివ్‌ వచ్చినా ఆసుపత్రులలో ఉంచి చికిత్స పొందాల్సిన అవసరం ఎవరికీ ఉండడం లేదన్నారు. కేవలం మందుల ద్వారానే అందరికీ ఐదు రోజుల్లో సాధారణ స్థితి నెలకొంటుందని చెప్తున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అలాగని అశ్రద్ధ చేయవద్దని 99 శాతం కేసుల్లో మూడు రోజుల్లోనే సాధారణ స్థితి నెలకొంటుందని వైద్యులు తేల్చేస్తున్నారు.


కొనసాగుతున్న వైరస్‌ ఉధృతి

కరోనా వైరస్‌ ఉద్ధృతి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నది. పాజిటివ్‌ శాతం రోజురోజుకు పెరిగిపోతుంది. సోమవారం జిల్లాలో 3,117 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 846 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. పాజిటివ్‌ శాతం 27.14గా నమోదైంది. క్రియాశీలక  కేసుల సంఖ్య 7,885కి చేరింది. వారిలో 7,459 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం 410 మంది చికిత్స పొందుతున్నారు. కొద్దిపాటి లక్షణాలున్న 16 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చేరారు. సోమవారం తెనాలిలో ఆరోగ్యం విషమించి ఒకరు చనిపోయారు. కొత్తగా గుంటూరు నగరంలో 420, నరసరావుపేటలో 59, తాడేపల్లిలో 38, తెనాలిలో 38, మంగళగిరిలో 34, చిలకలూరిపేటలో 24, పిడుగురాళ్లలో 23, బాపట్లలో 17, తుళ్లూరులో 13, పెదకాకానిలో 12, ఫిరంగిపురంలో 10, నాదెండ్లలో 10, పొన్నూరు 10, అమరావతిలో 2, అచ్చంపేటలో 1, గుంటూరు రూరల్‌లో 4, క్రోసూరులో 2, మేడికొండూరులో 2, ముప్పాళ్లలో 2, పెదకూరపాడులో 5, ప్రత్తిపాడులో 4, రాజుపాలెంలో 1, సత్తెనపల్లిలో 6, తాడికొండలో 7, వట్టిచెరుకూరులో 5, దాచేపల్లిలో 6, దుర్గిలో 2, గురజాలలో 8, కారంపూడిలో 4, మాచవరంలో 1, మాచర్లలో 3, రెంటచింతలలో 1, వెల్దుర్తిలో 1, బొల్లాపల్లిలో 3, యడ్లపాడులో 1, ఈపూరులో 2, నూజెండ్లలో 2, నకరికల్లులో 6, రొంపిచర్లలో 5, శావల్యాపురంలో 2, వినుకొండలో 7, అమర్తలూరులో 1, భట్టిప్రోలులో 2, చేబ్రోలులో 3, చెరుకుపల్లిలో 4, దుగ్గిరాలలో 5, కాకువనుఉనలో 3, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 4, కొల్లూరులో 5, నగరంలో 1, నిజాంపట్నంలో 1, పిట్టలవానిపాలెంలో 1, రేపల్లెలో 6, చుండూరులో 4, వేమూరులో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య అదనపు అధికారి టీ జయసింహ తెలిపారు.


ఎమ్మెల్యే శంకరరావుకు.. మరో ఏడుగురికి 

పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు ఆయన వ్యక్తి గత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మరో ఆరుగురికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయినట్టు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.   వారం రోజులు కార్యాలయంలో అందుబాటులో ఉండనని, రెండు రోజులుగా తనను కలసిన వారు కరోనా పరీక్షలు చేయించు కోవాలని ఎమ్మెల్యే తెలిపారు. 

 

Updated Date - 2022-01-25T05:38:06+05:30 IST