జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:09:29+05:30 IST

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
సర్వే జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌

కామారెడ్డి టౌన్‌/ఎల్లారెడ్డి/దోమకొండ/తాడ్వాయి/నిజాంసాగర్‌/మద్నూర్‌, జనవరి 21: కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో జరుగుతున్న సర్వేను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే బృందం ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎవరికైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకోవాలని తెలిపారు. స్వల్ప లక్షణాలున్న వారికి హోం ఐసోలేషన్‌ కిట్లను అంద జేయాలని సూచించారు. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారిని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ఖచ్చితంగా బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని తెలిపారు. కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జ్వర సర్వే జరుగుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, మెప్మా పీడీ శ్రీధర్‌రెడ్డి, వైద్యాధికారి సుజాయత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయిలో సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

తాడ్వాయి : మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో శుక్రవారం జ్వర సర్వేను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలని తెలిపారు. ఎంత మంది జ్వరాలతో బాధపడుతున్నారనే వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ప్రతీ ఒక్కరి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, వైద్యాధికారి రవీందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి వసంత, ఎంపీవో ఎస్‌సీబారాణి, సర్పంచ్‌ భూషణం, కార్యదర్శి సంగీత తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. మొత్తం 2,375 కుటుంబాలకు సర్వే చేశామని మత్తమాల్‌ పీహెచ్‌సీ వైద్యుడు వెంకటస్వామి తెలిపారు. దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి భాగ్యలక్ష్మీ ముత్యంపేట, చింతమాన్‌పల్లిలో సర్వే తీరును పరిశీలించారు. నిజాంసాగర్‌ మండలంలోని 27 గ్రామాల్లో జ్వర సర్వేను అంగన్‌వాడీ, ఆశ వర్కర్లచే నిర్వహించారు. మద్నూర్‌ మండలంలోని హండెకేలూర్‌, మండల కేంద్రంలో జ్వరసర్వే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది దస్తీరాం, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:09:29+05:30 IST