జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-24T06:02:19+05:30 IST

జ్వర సర్వేను పకడ్బందీగానిర్వహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
వైద్య సిబ్బంది నుంచి జ్వర సర్వే వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 - కలెక్టర్‌  ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌ రూరల్‌, జనవరి 23: జ్వర సర్వేను పకడ్బందీగానిర్వహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని చింతకుంట, కరీంనగర్‌లోని రేకుర్తి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో  ఇంటింటి జ్వర సర్వేను అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలన్నారు. కొవిడ్‌ మొదటి, రెండో డోసు వాక్సినేషన్లు తీసుకున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, జ్వరంతో బాధపడుతున్న వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌ ఔషధ కిట్లు అందించాలని సర్వే బృందాలను ఆదేశించారు. లక్షణాలు ఉన్న వారు తప్పని సరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్‌ వస్తే మందులు వాడాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మున్సిపల్‌, స్వశక్తి, మహిళా సంఘ సభ్యులు ఆర్‌పీలు సమన్వయంగా సర్వేను సక్రమంగా నిర్వహించాలన్నారు. సర్వే చేపట్టి మూడు రోజులవుతుందని, మరో రెండు రోజుల్లో సర్వేను పూర్తి చేయాలన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల  వయస్సువారందరికి కొవాగ్జిన్‌ వాక్సిన్‌ అందించాలన్నారు. కొవిడ్‌ మూడో దశ ఒమిక్రాన్‌ ప్రాణాంతకం కాకున్నప్పటికి ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువేరియా, నగర పాలక సంస్థ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, వైద్య సిబ్బంది, సర్వే బృందం  సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:02:19+05:30 IST