ఇంటింటా జ్వరం!

ABN , First Publish Date - 2022-01-26T04:31:54+05:30 IST

జిల్లాలో ఏ ఇంట్లో చూసినా.. ఎవరో ఒకరికి

ఇంటింటా జ్వరం!
పరిగిలో ఫీవర్‌ సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది(ఫైల్‌)

  • జిల్లాలో ఐదు రోజులపాటు సాగిన ఫీవర్‌ సర్వే
  • ఇంటింటి సర్వే, ఓపీ రిపోర్టు ప్రకారం 10,315 మందికి జ్వర లక్షణాలు 
  • 2,75,685 ఇళ్ల సర్వేలో 8,100 మందికి జ్వర లక్షణాలు గుర్తింపు
  • ఆసుపత్రుల్లో ఓపీ రిపోర్టు ప్రకారం 9,593 మందికి పరీక్షలు, 2,215 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తింపు


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జనవరి 25 : జిల్లాలో  ఏ ఇంట్లో చూసినా.. ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు ఏదో ఒక లక్షణం ఉంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు స్వల్పంగా ఇబ్బంది పడుతుంటే.. ఇంకొందరు తీవ్రంగా అవస్థ పడుతున్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా.. కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వర సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైద్య బృందాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. థర్డ్‌వేవ్‌ మొదలైన తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో కనిపిస్తోంది. ఇంటింటికీ ఆరోగ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత జ్వర సర్వే జిల్లాలో 5 రోజులపాటు సాగింది. 678 వైద్య బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సర్వేలో భాగస్వామ్యమయ్యారు. రోజుకూ 50వేల కుటుంబాల్లో సర్వే చేపట్టారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి అక్కడికక్కడే కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. 


10,315 మందికి జ్వర లక్షణాల గుర్తింపు

జిల్లాలో ఐదు రోజులపాటు ఫీవర్‌సర్వేను నిర్వహించారు. 2,75, 685ఇళ్లు సర్వేచేయగా అందులో 8,100మందికి జ్వర లక్షణాలున్నట్లు గుర్తించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన వారిలో ఓపీ రికార్డు ప్రకారం 9,593 మందికి పరీక్షించగా... 2,215 మందికి జ్వర లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 10,315 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారందరికీ కిట్లు అందించారు.


కొనసాగనున్న ఫీవర్‌ సర్వే

జిల్లాలో 8 లక్షల కుటుంబాలు ఉంటాయని అధికారుల అంచనా. ఇప్పటివరకు 2,75,685 ఇళ్లల్లో మాత్రమే సర్వే పూర్తయింది. ఇంకా చేపట్టాల్సిన ఇళ్లు చాలా ఉన్నాయి. మిగతా ఇళ్లలో కూడా సర్వే పూర్తి చేస్తామని వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 


తూతూ మంత్రంగా..

ఫీవర్‌ సర్వే తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. జిల్లాలో ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం ఉందా? ఉంటే ఈ మందులు వేసుకోండి అంటూ వెళ్లిపోతున్నారు. ఇచ్చిన మందులు ఏ టైంలో వేసుకోవాలి.? ఎలా వేసుకోవాలనే విషయాలను చెప్పటం లేదంటున్నారు. చాలా ప్రాంతాల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ గన్‌ ఇవ్వలేదు. టెంపరేచర్‌ కూడా చెక్‌ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. 


చాలావరకు ఫీవర్‌ కేసులు తగ్గాయి

జిల్లాలో ఫీవర్‌ సర్వే ఎంతో చురుగ్గా కొనసాగుతుంది. రోజుకూ 50 వేల గృహాలకు పైగా సర్వే పూర్తి చేస్తున్నారు. జ్వరం లక్షణాలు ఉన్న వారందరికీ ఐసోలేషన్‌ కిట్స్‌ అంది స్తున్నాం. మందులు వేసుకున్న వారిలో చాలావరకు జ్వరం తగ్గింది. ఐదు రోజులపాటు ఫీవర్‌ సర్వే విజయవంతంగా సాగింది. సర్వేను యథావిధిగా కొనసాగిస్తాం. 

- డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యాధికారి


8 రోజులు.. 10,237 పాజిటివ్‌లు

జిల్లాలో ఎనిమిది రోజుల్లోనే 10,237 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోజుకు వేయికి పైగా కేసులు వస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 5,186 కేసులు నమోదు కాగా, నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 5,051 కేసులు నమోదయ్యాయి. మంగళవారం జిల్లాలో 1,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో పట్టణ ప్రాంతంలో 734 కేసులు, గ్రామీణ ప్రాంతంలో 711 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


కొవిడ్‌ పరీక్షల వివరాలు

శాంపిల్‌ కలెక్షన్‌ (ఆర్‌టీపీసీఆర్‌) 1,20,012

శాంపిల్‌ కలెక్షన్‌(ర్యాపిడ్‌) 11,90,320

మొత్తం శాంపిల్‌ కలెక్షన్‌ 13,00,705

ఇప్పటివరకు నమోదైన ఒమైక్రాన్‌ కేసులు 21

-------------------------------------------------------------------------

జిల్లాలోని పాజిటివ్‌ కేసుల వివరాలు

తేది జీహెచ్‌ఎంసీ నాన్‌ జీహెచ్‌ఎంసీ మొత్తం కేసులు

18 591 594 1,185

19 470 446 916

20 747 775 1,522

21 701 721 1,422

22 807 800 1,607

23 294 287 581

24 842 717 1,559

25 734 711 1,445

మొత్తం 5,186 5,051 10,237

----------------------------------------------------------------

జిల్లాలో ఫీవర్‌ సర్వే వివరాలు

తేది సర్వే చేసిన జ్వర లక్షణాల ఓపీ జ్వర లక్షణాల

      ఇళ్లు   గుర్తింపు రిపోర్ట్‌    గుర్తింపు

21 36,492 589 6,033 158

22 51,338 1,208 807 509

23 58,632 1,965 588 259

24 67,802 2,262 1,146 695

25 61,421 2,076 1,019 594

మొత్తం 2,75,685 8,100 9,593 2,215


 


Updated Date - 2022-01-26T04:31:54+05:30 IST