అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యం: మాస్క్ పెట్టుకుంటున్న‌వారి శాతం అత్య‌ల్పం!

ABN , First Publish Date - 2021-06-24T11:48:05+05:30 IST

కోవిడ్ -19 దుష్ఫ్ర‌భావాల‌ను చూసిన‌ప్ప‌టికీ...

అడుగ‌డుగునా నిర్ల‌క్ష్యం: మాస్క్ పెట్టుకుంటున్న‌వారి శాతం అత్య‌ల్పం!

న్యూఢిల్లీ: కోవిడ్ -19 దుష్ఫ్ర‌భావాల‌ను చూసిన‌ప్ప‌టికీ చాలామంది  మాస్క్‌లు ధ‌రించేందుకు మొగ్గు చూప‌డం లేదు. దీనికి సంబంధించిన నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లోక‌ల్‌ సర్కిల్ నిర్వహించిన ఒక సర్వేలో టీకా కేంద్రాల్లో కూడా మాస్కులు పెట్టుకుంటున్న‌వారి  శాతం చాలా త‌క్కువ‌ని తేలింది.  కోవిడ్ -19 సెకెండ్ వేవ్ ప్ర‌భావం ప్రపంచంలోని అన్ని దేశాల‌క‌న్నా మ‌న దేశంలో అత్య‌ధికంగా ఉన్న‌ప్ప‌టికీ, మాస్కులు ధ‌రించేవారి సంఖ్య అత్య‌ల్పంగా ఉండ‌టం విశేషం. ఈ సర్వేలో దేశంలోని 312 జిల్లాలకు చెందిన‌ సుమారు 33 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 32 శాతం మంది తాము ఇటీవ‌ల వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే మాస్క్ పెట్టుకున్నామ‌ని తెలిపారు. 


ఈ కార‌ణంగానే టీకాలు వేయించుకున్న త‌ర్వాత కూడా చాలామంది క‌రోనా బారిన‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే టీకా కేంద్రాల నుంచి సూపర్ స్ప్రెడర్స్ త‌యాయ్యే ప్ర‌మాద‌ముంద‌ని నిపుణులు చెబుతున్నారు.  టీకా కేంద్రాలు సూపర్‌స్ప్రెడర్‌లుగా మారకుండా చూసేందుకు వైద్యాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచించింది. టీకా కేంద్రాలలోనైనా ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రిస్తున్నారా? లేదా అని తెలుసుకునేందుకు ఈ స‌ర్వే నిర్వ‌హించారు.  దీనితో పాటు మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేయ‌డంపై ప్ర‌జ‌లు ఏవిధంగా స్పందిస్తున్నారో ఈ స‌ర్వే ద్వారా నిర్వాహ‌కులు తెలుసుకోవాల‌నుకున్నారు. ఈ స‌ర్వే ప్ర‌కారం దేశంలోని 44 శాతం మంది మాత్రమే మాస్కులు పెట్టుకుంటున్నారు. ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిలో  91 శాతం మంది మాస్కులు త‌ప్ప‌నిస‌రి చేసిన ప్ర‌భుత్వాల‌కు మ‌ద్ద‌తు నివ్వ‌గా, ఎనిమిది శాతం మంది మాస్కుల నిబంధ‌న‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. 

Updated Date - 2021-06-24T11:48:05+05:30 IST