భగభగ..మండుతున్న ఎండలు

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

భానుడు భగభగకు జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు ఎండ, వడగాలుల

భగభగ..మండుతున్న ఎండలు

వడగాలి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

నిప్పులకొలిమిలా కోల్‌బెల్ట్‌ ప్రాంతాలు 

వారంరోజులుగా 40నుంచి 45డిగ్రీలకు ఉష్ణోగ్రత


ఖమ్మం/కొత్తగూడెం, మే 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : భానుడు భగభగకు జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు ఎండ, వడగాలుల తీవ్రత పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. సోమవారం ఖమ్మం, భద్రారది జిల్లాల్లో వారంరోజులుగా 45డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రత సోమవారం కాస్త తగ్గి 42డిగ్రీలు నమోదైనా వడగాలి, ఉక్కపోత మాత్రం తగ్గలేదు. ఫలితంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే జనం బయటకు వచ్చే పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కనోనా భయంతో బయటకు రాని జనం.. లాక్‌డౌన్‌ సడలింపుతో బయటకు వస్తున్నా మధ్యాహ్నం మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నా ఆటు కరోనా భయంతోపాటు ఇటు వడగాలుల భయంతో బస్సుల్లో మధ్యాహ్నం ప్రయాణం చేయడంలేదు. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు కూడా మాస్కులు పెట్టుకోవడం, భానుడి భయానికి కండువాలు చుట్టుకోవడం, నెత్తిమీద వేసుకోవడం చేస్తున్నారు. కొబ్బరి బొండాలు, శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. 


సింగరేణి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి  బొగ్గుగనుల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గనుల ప్రాంతాల్లో రోజూ సుమారు 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రత తాళలేక కార్మికులు భారీసంఖ్యలో విధులకు గైర్హాజరవుతున్నారు. సింగరేణి యాజమాన్యం ఇప్పటికే వేసవి కాలంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం, బొగ్గు గనులున్న భద్రాద్రి జిల్లాలో ఎండ, వడగాలి తీవ్రత తీవ్రంగా ఉంది. 

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST