కరోనా ఎఫెక్ట్: భారత్‌లో జరగాల్సిన ప్రపంచకప్ వాయిదా

ABN , First Publish Date - 2020-04-04T16:49:59+05:30 IST

కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇదే

కరోనా ఎఫెక్ట్: భారత్‌లో జరగాల్సిన ప్రపంచకప్ వాయిదా

కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది నవంబర్‌లో భారత్ వేదికగా జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ కూడా వాయిదాపడింది. 16 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మ టోర్నమెంట్ కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నేవీ ముంబై వేదికలుగా ఈ ఏడాది నవంబర్ 2 నుంచి 21వ తేదీల వరకూ జరగాల్సి ఉంది. భారత్ ఈ ఏడాదే తొలిసారిగా అండర్-17 ఫుట్‌బాల్ ఈ ప్రపంచకప్‌లో పాల్గొంటోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పనామా వేదికగా జరిగే మహిళల అండర్-20 ప్రపంచకప్‌తో పాటు ఈ టోర్నమెంట్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు ఫిఫా-కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్ ప్రకటనని విడుదల చేసింది. అయితే టోర్నమెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో వర్కింగ్ గ్రూప్ క్లారిటీ ఇవ్వలేదు. 


‘‘వాయిదాపడిన ఫైనల్ మహిళల ఫిఫా టోర్నమెంట్లు మళ్లీ నిర్వహించేందుకు తగిన తేదీన తేదీలు ఎంపిక చేసేందుకు ఒక సబ్-వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాము’’ అని వర్కింగ్ గ్రూప్ ప్రకటనలో తెలిపింది. టోర్నమెంట్‌ల నిర్వహణపై వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని జూన్ 2020 నుంచి జరగాల్సిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఇటువంటి కష్ట సమయంలో మిగితా అన్నిటికంటే.. ఆరోగ్యం ముఖ్యం. జూన్ 2020 నుంచి జరగాల్సిన అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లు వాయిదా వేశాము. ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో పెట్టుకొని 2022లో జరగాల్సిన ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్ మ్యాచ్‌ల గురించి కూడా కాన్ఫెడరేషన్లతో చర్చలు జరుపుతాము’’ అని వర్కింగ్ గ్రూప్ స్పష్టం చేసింది.

Updated Date - 2020-04-04T16:49:59+05:30 IST