15వేల మంది రాజీనామా..!

ABN , First Publish Date - 2021-11-25T16:01:00+05:30 IST

రెండు రెట్ల అధిక వేతనం.. అనుకూలమైన పని విధానం, ఒత్తిడి లేకపోవడం, వృద్ధికి అవకాశం.. విదేశాల్లో స్థిరపడే అవకాశం.. సగటు ఐటీ ఉద్యోగి ఇంతకన్నా కోరుకునేదేముంటుంది.. అందుకే స్వదేశీ కంపెనీలు ఎన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నా..

15వేల మంది రాజీనామా..!

ఐటీ ఉద్యోగి.. విదేశీ బాట

కంపెనీలను వీడుతున్న సీనియర్లు

3 నెలల్లో 15వేల మంది రాజీనామా

విదేశాల్లో మంచి అవకాశాలే కారణం


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రెండు రెట్ల అధిక వేతనం.. అనుకూలమైన పని విధానం, ఒత్తిడి లేకపోవడం, వృద్ధికి అవకాశం.. విదేశాల్లో స్థిరపడే అవకాశం.. సగటు ఐటీ ఉద్యోగి ఇంతకన్నా కోరుకునేదేముంటుంది.. అందుకే స్వదేశీ కంపెనీలు ఎన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నా ససేమిరా అంటున్నారు. కొవిడ్‌ అనంతరం ఐటీ రంగం వేగం పుంజుకోవడం, భారత ఐటీ నిపుణులకు విదేశాలు ఎర్ర తివాచీ పరుస్తుండడంతో ఏళ్ల తరబడి కంపెనీకి విధేయులుగా ఉన్న వారు సైతం ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 6.5లక్షల వరకూ ఉండగా.. ప్రముఖ కంపెనీల్లోనే గత మూడు నెలల్లో 15 వేల మందికిపైగా సీనియర్లు ఉద్యోగాలు వదులుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  


కొవిడ్‌ తర్వాత పెరిగిన డిమాండ్‌

గత ఏడాది ఆరంభంలో కరోనా కల్లోలంతో ఐటీ రంగం కూడా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంది. విదేశాల్లో కొన్ని నెలలపాటు లాక్‌డౌన్‌ విధించడంతో అనేక పెద్ద సంస్థలు మూతపడ్డాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా భారీ ఐటీ ప్రాజెక్టులపై పడింది. కంపెనీల ఆదాయం తగ్గిపోవడంతో గత ఏడాది కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో అప్పటికే ఉన్న సిబ్బందిపై పని భారం భారీగా పెరిగింది. కొవిడ్‌ అనంతరం ఐటీ రంగం వేగం పుంజుకోవడం, విదేశాల్లోని ప్రభుత్వాలు ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తుండడంతో భారత ఐటీ నిపుణులకు బాగా కలిసొచ్చింది. అందుకే అధిక సంఖ్యలో సీనియర్‌ ఉద్యోగులు కంపెనీలను వీడుతున్నారు. ఏటా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల ఖాళీల శాతం 5-10 వరకు ఉంటుంది. కానీ, ఈ సారి టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, మైండ్‌ ట్రీ, యాక్సెంచర్‌తోపాటు అన్ని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలను వీడిన వారు 10-20% వరకు ఉండగా.. వీరిలోనూ సీనియర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏడాదికి రూ.12-25 లక్షల ప్యాకేజీలు పొందుతున్న మేనేజర్‌, టీం లీడర్‌ స్థాయి ఉద్యోగులే ఎక్కువగా రాజీనామా చేస్తున్నారు. వేతనాలు పెంచుతామని, బోన్‌సలు, పదోన్నతులు ఇస్తామని చెబుతున్నా.. ఉద్యోగులు ఆగడం లేదు.  


కెనడా, యూకేలో భారీ అవకాశాలు

కొవిడ్‌ అనంతరం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఐవోటీ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, బ్లాక్‌ చైన్‌, రోబోటిక్స్‌, ఏఆర్‌వీఆర్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీకి డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌ నిపుణులను ఆకర్షించేందుకు వివిధ దేశాలు భారీ ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఇందులో యూకే, కెనడా ముందు వరుసలో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యూకేలో కొత్త ఐటీ ఉద్యోగాల సంఖ్య 10% పెరిగిందని, గత జూలైలో 93వేల ఖాళీలను భర్తీ చేయాలని ఐటీ కంపెనీలు నిర్ణయించాయని ఓ ప్రముఖ సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యం గా బ్లాక్‌చైన్‌ సంబంధిత రంగాల్లో 75%, క్వాంటం కంప్యూటింగ్‌ అనుబంధ రంగాల్లో 150% కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయని ఆ సంస్థ వివరించింది.


కొవిడ్‌ అనంతరం కెనడా ఐటీ కంపెనీలు సైతం భారతీయ నిపుణులపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఐటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, క్వాలిటీ అస్యురెన్స్‌ అనలిస్ట్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్లకు అక్కడ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. భారత నిపుణులకు కెనడాలో ప్రారంభ వేతనమే రూ.30లక్షలు ఉండగా.. గరిష్ఠంగా రూ.75లక్షల వరకు కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. అలాగే, యూకేలో ప్రారంభ వేతనం రూ.50లక్షల వరకూ ఉంటోంది. దీంతో భారత ఐటీ నిపుణులు అనివార్యంగా విదేశాల బాట పడుతున్నారు.

Updated Date - 2021-11-25T16:01:00+05:30 IST