ఐదో రోజూ పెరిగిన కేసులు

ABN , First Publish Date - 2021-08-02T07:14:39+05:30 IST

దేశంలో కొత్తగా 41,831 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లు దాటింది.

ఐదో రోజూ పెరిగిన కేసులు

  • కొత్తగా 41,831 మందికి పాజిటివ్‌ 
  • 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన నగరంగా భువనేశ్వర్‌ 


న్యూఢిల్లీ, ఆగస్టు 1 : దేశంలో కొత్తగా 41,831 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.16 కోట్లు దాటింది. మరో 541 మంది ఇన్ఫెక్షన్‌తో మృతిచెందడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 4,24,351కి చేరింది. వరుసగా ఐదో రోజూ కేసులు పెరగడంతో.. యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య 4,10,952కు చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మరింత పెరిగి 3.08 కోట్లకు చేరింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 47.02 కోట్ల టీకా డోసులతో వ్యాక్సినేషన్‌ జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలోని దాదాపు 50 శాతం మంది వయోజనులకు టీకా అందినట్లయిందని తెలిపింది. వీరిలో 39 శాతం మందికి ఒక డోసు, మిగతా 11 శాతం మందికి రెండు డోసులూ అందాయని పేర్కొంది. గత 24 గంటల్లో 60.15 లక్షల డోసులను లబ్ధిదారులకు ఇచ్చినట్లు వివరించింది.


దేశంలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసిన తొలి నగరంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నిలిచింది. అక్కడి 9.07 లక్షల  మంది వయోజనులు అందరికీ టీకా ఇవ్వడం పూర్తయింది. పదేపదే  ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపి.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమ విజయానికి కారకులైన ఆరోగ్య కార్యకర్తలను ప్రశంసించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు. జూలైలో 13 కోట్ల డోసులతో వ్యాక్సినేషన్‌ చేశామని, ఆగస్టులో టీకా కార్యక్రమం వేగవంతం అవుతుందన్నారు.  డెల్టా వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో చైనాలోని 27 నగరాల్లో కోట్లాది కొవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. జపాన్‌ రాజధాని టోక్యోలో 4,058 కొత్త కేసులు నమోదయ్యాయి. 


ఆర్‌-వాల్యూ.. ఆందోళనకరం

ర్‌-వాల్యూ’ అంటే  కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ఒక రోగి నుంచి ఎంతమందికి ప్రబలుతుంది అనే దానికి సూచిక. భారత్‌లో ఇది 0.96 నుంచి 1కి పెరగడాన్ని ఆందోళన రేకెత్తించే పరిణామంగా ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ఈనేపథ్యంలో  కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న రాష్ట్రాల్లో కట్టడి చర్యలను పక్కాగా అమలు చేయాలన్నారు. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. 

Updated Date - 2021-08-02T07:14:39+05:30 IST