Abn logo
Sep 20 2021 @ 00:00AM

మేమంటే..మేము

ఎంపీపీ పదవుల కోసం ఒత్తిళ్లు

ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

రిజర్వేషన్‌ ప్రకారం కాబోయే 

ఎంపీపీలంటూ కొన్నిచోట్ల ప్రచారం

వైసీపీకి కొత్త తలనొప్పులు

అధికార పక్షంలో రంజుగా రాజకీయం

ఆచంటపైనా ప్రత్యేక గురి 


‘ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకునే ఉన్నాం. మాకంటే వీర విధేయులు లేరు. మీకు లోబడి ఉంటాం. ఎంపీపీ పదవి విషయంలో మాకు సాయం అందించండి..మీ ఆశీస్సులు ఉండాలి. ఎన్నటికీ మీకు కట్టుబడే ఉంటాం’.. అంటూ ఎంపీపీ పదవి ఆశిస్తున్న అనేక మంది ఇప్పుడు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదిక్షణలు ప్రారంభించారు. దీంతో అధికార వైసీపీలో రాజకీయం రంజుగా సాగుతోంది..


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) 

 జిల్లా వ్యాప్తంగా ఎంపీపీ పదవులకు రాబోయే మూడు రోజుల్లో ఎంపిక, పదవీ ప్రమాణం జరగ బోతోంది. ఇప్పటికే మండలాధ్యక్ష పదవుల కోసం ఏ స్థాయిలో ఎవరికి కేటాయించవచ్చో రిజర్వేషన్‌ ప్రక్రియ పూర్తయింది. వచ్చిన చిక్కల్లా  అదే రిజర్వేషన్‌ కేటగిరీలో ఒకరి కంటే మించి ఇద్దరు ముగ్గురు ఎంపీటీసీలుగా ఎన్నికైన తరుణంలో ఎంపీపీ పదవి మాకంటే మాకంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. వంగి వంగి దండాలు పెడుతున్నారు. నియోజకవర్గంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని భరోసా ఇస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారు. అధిష్టానమే నిర్ణయిస్తుందంటూ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు చేతులెత్తేయగా మరికొంతమంది ఎమ్మెల్యేలు పదవిని ఆశిస్తున్నవారితో నేరుగా ఇన్‌ఛార్జి మంత్రి పేర్ని నాని ఆశీస్సుల కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి యలమంచిలి నుంచి ఎన్నికైన జడ్పీటీసీ కౌరు శ్రీనివాస్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయింది. సీఎం జగన్‌ ఇంతకుముందే శ్రీనివాస్‌కు ఈ మేరకు హామీ ఇవ్వడం, రిజర్వేషన్లు కూడా కలిసి రావడంతో  ఆయనకు ఈ పదవి దక్కబోతోందని వైసీపీలో బలంగా వినపడుతోంది. 


జడ్పీ చైర్మన్‌ ఎవరు..? 

ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్తగా మరెవరైనా జడ్పీ చైౖర్మన్‌ కాబోతున్నారా..? ఆ మేరకు అధికార పక్షంలో ఏదైనా అంతర్గతంగా ఒక చర్చ జరుగుతోందా..? అన్న అనుమానం మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బీసీ వర్గాలకు చెందిన కౌరు శ్రీనివాస్‌ నాయకత్వం పట్ల సీఎం జగన్‌ ఆది నుంచి సానుకూలతతో ఉన్నారు. ఎన్నికల ముందుగానే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి ఆయన పేరు ఖరారు చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దీనికి అనుగుణంగానే తన సొంత మండలం వీరవాసరంలో పోటీ చేయాలని శ్రీనివాస్‌ భావించినా చివరకు యలమంచిలి మండలం నుంచి జడ్పీటీసీగా రంగంలోకి దిగారు. అక్కడ సామాజిక వర్గాల సమీకరణ కలిసి వచ్చి కౌరు శ్రీనివాస్‌కు భారీగా ఆధిక్యత దక్కింది. దీంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఆయనే జడ్పీచైర్మన్‌ కాబోతున్నారని ఇప్పటికే అధికార పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే పార్టీ అంతర్గత జడ్పీచైర్మన్‌ పేర్ల జాబితాలో కూడా శ్రీనివాస్‌ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండబోవని ముందుగా ప్రకటించిన విధంగానే కౌరు శ్రీనివాస్‌కు జడ్పీ చైర్మన్‌ గిరి అప్పగించ బోతున్నారని అది ఈనెల 25న స్పష్టంగా ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొంత మంది మాత్రం ఇంకా ఈ పదవిపై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాగే వైస్‌ చైౖర్మన్‌ పదవుల విషయంలోనూ ఎవరెవరికి ఛాన్స్‌ ఇవ్వాలనేదానిపై ఇప్పటికే పార్టీలో ఒక స్పష్టత ఉందని మంగళవారం నాటికి వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రాబోతుందని చెబుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పేర్ని నాని, మంత్రులు ఆళ్ళ నాని, తానేటి వనిత, రంగనాథరాజు వంటి సీనియర్లు అంతా ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించబోతున్నారు. 


మండలాధ్యక్షులం మేమంటే మేమే 

జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 మండలాల్లోనూ మండలాధ్యక్ష పదవికోసం అధికార వైసీపీలో అతి పెద్ద డిమాండ్‌ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆయా మండలాల్లో ప్రాదేశిక నియమావళి ప్రకారం ఎంపీపీ పదవి ఏ సామాజిక వర్గానికి కేటాయించాలో కూడా రిజర్వు చేశారు. వీరిలో అత్యధికులు మహిళా ఎంపీటీసీలు ఉండబోతున్నారు. ఎమ్మెల్యేలు తమ సానుకూలురుకే మండలాధ్యక్ష పదవి కట్టబెట్టేలా ఇప్పటికే భరోసా ఇచ్చేశారు. అయితే అనేక మండలాల్లో ఏదైతే ఎంపీపీ పదవికి రిజర్వుడు సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గం నుంచి ఇద్దరు కంటే మించి ఎంపీ టీసీలు గెలుపొందారు.  ఇద్దరు, ముగ్గురు ఎంపీపీ పదవి కోసం ఇప్పుడు బరిలో ఉంటే ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలనేదానిపై చిక్కుముడి విప్పలేక ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఇలాంటి మండలాల్లో సమస్యను తేలికగా పరిష్కరించేందుకు మండల ఉపాధ్యక్ష పదవులతో కొందరిని సంతృప్తి పరచాలని భావిస్తున్నారు. అయితే అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో వారికే ఎంపీపీ పీఠం దక్కబోతోందని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ పదవుల విషయంలో నేరుగా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టకుండా రిజర్వేషన్‌ దామాషా ప్రకారం అధిష్టానమే ఒక జాబితా రూపొందించి ఆ మేరకు జిల్లాలకు పంపబోతోందని మరో ప్రచారం. అయితే వివాదం లేనిచోట మాత్రం ఎమ్మెల్యేల సిఫార్సులకు అధిష్ఠానం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు, కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల్లో ఈ విషయంలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ఇప్పటికే జాగ్రత్త పడ్డారు. రంగనాఽథరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో విపక్ష కూటమి విజయం సాదించడంతో వైసీపీ ఖంగుతింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆచంటను వైసీపీ ఖాతాలో వేసుకునేందుకు ఇప్పటికే సర్వశక్తులు వడ్డేందుకు వీలుగా పావులు కదుపు తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ కూడా తగు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీలో ప్రచారం సాగు తోంది. ఈనెల 24న మండలాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. నేడు, రేపు అందరితో చర్చించిన మీద ఏ మండలానికి ఎవరు మండలాధ్యక్షులు కాబోతున్నారో ఒక స్పష్టత తెచ్చేందుకు మంత్రులు కూడా చర్చలకు పదును పెట్టారు. 


 ఎందుకిలా జరిగింది ? 

వీరవాసరం వైసీపీలో అంతర్మథనం 

వీరవాసరం, సెప్టెంబరు 20 : వీరవాసరం జడ్పీటీసీ స్థానాన్ని జనసేన, అధిక ఎంపీటీసీ స్థానాలను టీడీపీ, జనసేనలు సంయుక్తంగా కైవసం చేసుకోవడం వైసీపీలో అంతర్మథనం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో అధిక సర్పంచ్‌లను చేజిక్కించుకున్నా పరిషత్‌ ఎన్నికల్లో ఓటమిపై జీర్ణించుకోలేకపోతున్నారు. నాయకుల్లోని వర్గ విభేదాలు, పార్టీలో పాతతరం నాయకులకున్నా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం, గ్రామాల్లోని సామాజిక వర్గ విభేదాలు ఓటమికి కారణమని చెబుతున్నారు. కొందరు పార్టీ నేతలే క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. జడ్పీటీసీ అభ్యర్థి స్వగ్రామంలోని రెండు ఎంపీటీసీ స్థానాలు టీడీపీ, జనసేన విజయం సాధించటం అక్కడే అభ్యర్థికి పట్టు లేకపోతే ఇక మండలంలో ఎలా ఉంటుందనే విమర్శలు వచ్చాయి. దీనికితోడు గ్రామ ఉప సర్పంచ్‌ల ఎంపికలోను పలు గ్రామాల్లో తలెత్తిన విభేదాలు పార్టీకి మైనస్‌గా మారాయి. మత్స్యపురి, దూసనపూడిలో జరిగిన వైసీపీ జనసేన ఘర్షణలు, మడుగు పోలవరం, నవుడూరు పంచాయతీల్లో తలెత్తిన సామాజిక వర్గాల అసమానతలు జడ్పీటీసీ ఓటమికి కారణంగానూ భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన కష్టపడి పనిచేయడంతో వాటికి గెలుపు దక్కింది.