కూతురి పెళ్లయిన ఆరు రోజులకే అల్లుడు తమ కులం వాడు కాదని తెలిసి..

ABN , First Publish Date - 2020-05-23T18:10:02+05:30 IST

మండలంలోని గురందొరపాలెంలో ఇసారపు చిరంజీవి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అతని భార్యే ఈ హత్య చేసినట్టు అంగీకరించి రూరల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయింది.

కూతురి పెళ్లయిన ఆరు రోజులకే అల్లుడు తమ కులం వాడు కాదని తెలిసి..

గురందొరపాలెం హత్య కేసులో భార్యే నిందితురాలు

భర్తను తానే హత్య చేసినట్టు అంగీకరించిన సన్యాసమ్మ

పోలీసుల సమక్షంలో లొంగుబాటు


నర్సీపట్నం టౌన్‌ (ఆంధ్రజ్యోతి): మండలంలోని గురందొరపాలెంలో ఇసారపు చిరంజీవి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అతని భార్యే ఈ హత్య చేసినట్టు అంగీకరించి రూరల్‌ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఇందుకు సంబంధించి డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ అప్పనాయుడు శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురందొరపాలేనికి చెందిన చిరంజీవి (48), సన్యాసమ్మలకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రాజ్యలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహం జరిపారు. చిన్న కుమార్తె పూర్ణశ్రావణిని మాకవరపాలెం మండలం పైడిపాలకు చెందిన అట్లూరి చంటిబాబుకి ఇచ్చి ఈ నెల 3వ తేదీన వివాహం చేశారు. వివాహమైన ఆరు రోజులకు పెళ్లి కొడుకు తమ సామాజిక వర్గానికి చెందినవాడు కాదని వీరికి తెలిసింది. ఈ నెల 11న పెళ్లి కొడుకు బంధువులను పిలిచి దగ్గర బంధువుల ఇంట్లో పంచాయితీ పెట్టి, కులం విషయంపై నిలదీశారు. గొడవలు పడకుండా సర్దుకుపోవాలని పెద్దలు సర్దిచెప్పారు. ఆ మర్నాడు నుంచి చిరంజీవికి, సన్యాసమ్మకు ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. గ్రామంలో పరువు పోతుందని, చిన్న అల్లుడ్ని ఇంటికి రావద్దని చెప్పాలని భార్య సన్యాసమ్మతో చిరంజీవి అన్నాడు.


15న హత్యకు గురైన చిరంజీవి

చిరంజీవి ఈనెల 15వ తేదీ  మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్రామానికి దూరంగా ఉన్న పాకలో పశువులకు మేత వేయడానికి వెళ్లాడు. కొద్ది సేపటికే భార్య సన్యాసమ్మ కూరగాయల కత్తి తీసుకొని అక్కడికి వెళ్లగా, పాకలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుకుసుకున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. దాంతో సన్యాసమ్మ కత్తితో భర్త  మెడమీద నరికి, కడుపులో పొడిచి హత్య చేసినట్టు చెప్పారు. ఆ తరువాత కత్తిని పాక వద్దే విడిచిపెట్టి, తన భర్తను ఎవరో హత్య చేశారని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులు

ఈ ఘటనపై పోలీసులు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరీని విచారించారు. ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తిని పాక వద్ద గుర్తించి, అక్కడికి అది ఎలా వచ్చిందన్న కోణంలో చిరంజీవి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దీంతో అసలు గుట్టు రట్టయింది. శుక్రవారం వీఆర్వోను వెంటపెట్టుకొని వచ్చి సన్యాసమ్మ పోలీసుల ఎదుట లొంగిపోయింది. భర్తను తానే హత్య చేశానని అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

Updated Date - 2020-05-23T18:10:02+05:30 IST