ఆస్తి పన్నుపై అమీతుమీ

ABN , First Publish Date - 2021-06-23T05:43:47+05:30 IST

ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను వసూలుపై బుధవారం జరగనున్న మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కార్యవర్గ సాధారణ సమావేశంలో గట్టిగా నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

ఆస్తి పన్నుపై అమీతుమీ

విపక్షాలు సన్నద్ధం

నేడే జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం

136 అంశాలతో అజెండా

ఆస్తిపన్ను పెంపు, చెత్తపై పన్ను అంశాలను చేర్చని అధికారులు

ఈ రెండింటిపై చర్చకు విపక్షాల పట్టు

లేనిపక్షంలో సభను సాగనివ్వకూడదని నిర్ణయం

ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు కానివారు ప్రతిపాదించిన పనులను అజెండాలో చేర్చడంపైనా నిలదీసే అవకాశం

ఎదురుదాడికి వైసీపీ వ్యూహరచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను వసూలుపై బుధవారం జరగనున్న మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కార్యవర్గ సాధారణ సమావేశంలో గట్టిగా నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు అంశాలను అజెండాలో చేర్చకపోవడం పట్ల ఇప్పటికే అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ విషయమై పలుమార్లు మేయర్‌, కమిషనర్లకు వినతిపత్రాలు అందజేశాయి. అయినప్పటికీ సప్లిమెంటరీ అజెండాలో కూడా పొందుపరచకపోవడంతో జీరో అవర్‌లో వీటిపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నాయి. అయితే...అందుకు అధికారపక్షం అంగీకరించే అవకాశం లేకపోవడంతో సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. 


జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించేందుకు 125 అంశాలతో ప్రధాన అజెండా, మరో 11 అంశాలతో సప్లిమెంటరీ అజెండా తయారుచేశారు. వీటి కాపీలను కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు అందజేశారు. అజెండాలో పేర్కొన్న 136 అంశాల్లో ఆస్తిపన్ను సవరణ చట్టం ప్రస్తావనగానీ, చెత్తపై పన్ను అంశంగానీ లేకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు వామపక్షాల కార్పొరేటర్లు తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. సాధారణంగా జీవీఎంసీ పరిధిలో అమలుచేసే ఎలాంటి నిర్ణయాలను అయినా ముందుగా కౌన్సిల్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే జీవీఎంసీకి ఎన్నికల నోటిఫికేషన్‌ ఏర్పడిన తర్వాతే మూల విలువ ఆధారంగా ఆస్తిపన్ను పెంపు అంశంపై ప్రత్యేక అధికారి ఆమోదం పొందినట్టు పేర్కొంటూ జీవీఎంసీ కమిషనర్‌ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్‌ జారీచేశారు. ఏకపక్షంగా ముసాయిదా నోటిఫికేషన్‌ జారీచేయడం మేయర్‌తోపాటు కార్పొరేటర్లను కించపరచడమేనంటూ టీడీపీ, జనసేన, సీపీఎం ఫ్లోర్‌ లీడర్లు పీలా శ్రీనివాసరావు, పీతల మూర్తియాదవ్‌, బి.గంగారావు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సప్లిమెంటరీ అజెండాలోనైనా ఆస్తిపన్ను సవరణ చట్టం, చెత్తపై పన్ను అంశాలను చేర్చాలంటూ మేయర్‌, కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో బుధవారం జరిగే కౌన్సిల్‌లో దీనినే ప్రధాన అజెండాగా చేసుకుని చర్చ జరగాలని పట్టుబట్టాలని విపక్ష ఫ్లోర్‌ లీడర్లు నిర్ణయం తీసుకున్నారు. జీరో అవర్‌తోనే సభను ప్రారంభించాలని మేయర్‌ను కోరడంతోపాటు ఆయా రెండు అంశాలపై ప్రజల వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవలసింది పోయి...పన్నుల భారం మోపడం దారుణమనే విషయాన్ని గట్టిగా చెప్పాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఒకవేళ చర్చకు అనుమతించకపోతే వాకౌట్‌ చేయడానికైనా సిద్ధపడాలని విపక్ష కార్పొరేటర్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అజెండాలో చేర్చని ఆస్తిపన్ను సవరణ చట్టం, చెత్తపై పన్ను అంశాలతో పాటు అజెండాలో చేర్చిన 136 అంశాల్లో కొన్నింటిపై వాడివేడిగానే చర్చ జరిగే అవకాశం ఉంది. వీటిలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కాలపరిమితి ఏడాది పెంపు, జీవీఎంసీ ఎన్నికల ఖర్చులకు బిల్లుల చెల్లింపు, ఇంజనీరింగ్‌ విభాగం నుంచి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆమోదం, అద్దెలు, లీజులకు సంబంధించి అంశాలపై గట్టిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు కానీ వ్యక్తులు ప్రతిపాదించిన పనులను అజెండాలో చేర్చడమే కాకుండా వారి పేర్లు కూడా నమోదుచేయడంపై విపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. 


విపక్ష కార్పొరేటర్ల నుంచి ఆస్తి పన్ను, చెత్త పన్ను అంశాలపై దాడి జరిగే అవకాశం వుందని గుర్తించిన అధికారపక్షం కార్పొరేటర్లు ఎదురుదాడికి వ్యూహరచన రూపొందించారు. వైసీపీ కార్పొరేటర్లంతా సోమవారం సాయంత్రం మేఘాలయ హోటల్‌లో సమావేశమై కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆస్తిపన్ను, చెత్తపన్ను అంశాలపై చర్చ జరిగితే ప్రభుత్వం ఇరుకునపడే ప్రమాదం వున్నందున ఆయా అంశాలపై చర్చ జరగకుండా జాగ్రత్తపడాలని కొంతమంది కార్పొరేటర్లు సూచించినట్టు తెలిసింది. అవసరమైతే విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని మరికొందరు అభిప్రాయపడినట్టు సమాచారం. మొదటి కౌన్సిల్‌ సమావేశంలో పెద్దగా ఇబ్బంది పడే అంశాలు లేనందున సభ సజావుగానే సాగిపోయిందని, ప్రస్తుత సమావేశంలో మాత్రం విపక్షాల నుంచి కొంత ఎదురుదాడి తప్పదని, దీనిని ఎదుర్కొనేందుకు సభ్యులంతా సన్నద్ధం కావాలని పార్టీ పెద్దలు సూచించినట్టు తెలిసింది. సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం వున్నందున...ముందుగానే పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేయాలని అధికారులు కోరినట్టు తెలిసింది.

Updated Date - 2021-06-23T05:43:47+05:30 IST