టైం స్కేల్‌ ఇచ్చే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-11-27T07:41:10+05:30 IST

టీటీడీ అటవీ కార్మికులకు టైంస్కేల్‌ ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తేల్చి చెప్పారు.

టైం స్కేల్‌ ఇచ్చే వరకు పోరాటం
ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు

టీటీడీ అటవీ కార్మికుల రిలేదీక్షలకు ఏడాది 

తిరుపతిలో భారీ నిరసన


తిరుపతి(కల్చరల్‌), నవంబరు 26: టీటీడీ అటవీ కార్మికులకు టైంస్కేల్‌ ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తేల్చి చెప్పారు. తిరుపతిలోని హరేకృష్ణరోడ్డు మార్గంలో టీటీడీ అటవీశాఖ కార్యాలయం వద్ద వీరు చేపట్టిన రిలే దీక్షలకు శుక్రవారంతో ఏడాదైంది. ఈ సందర్భంగా చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవసేవే మాధవసేవ అంటున్న టీటీడీ అటవీ కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించడంలేదన్నారు. ఢిల్లీలో రైతుల పోరాటంతో ప్రధాని మోదీ దిగొచ్చినా.. ఇక్కడ టీటీడీ అధికారులు మాత్రం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మీరిచ్చిన హామీనే అమలు చేయమని కోరుతున్నారన్నారు. కార్మికులపట్ల ప్రభుత్వం కూడా అనుచితంగా వ్యవహరించిందన్నారు. ఏడాదిపాటు ఆందోళన చేస్తున్నా టీటీడీ, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్‌ నిలదీశారు. జగన్‌లాగే టీటీడీ అధికారులు, పాలక మండలి కూడా మొండిగా తయారయ్యారని మండిపడ్డారు. తనకంటే ధీరుడు లేడని విర్రవీగిన మోదీనే వ్యవసాయ నల్లచట్టాల విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్‌  ఆర్‌సీ మునిక్రిష్ణ, సీఐటీయూ నగర నాయకులు  సుబ్రమణ్యం, మునిరాజా, ఫారెస్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సురేష్‌, ఈశ్వర్‌రెడ్డి, వాసు, మల్లికార్జున, పురుషోత్తం, రమణారెడ్డి, మునిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో 70 సొసైటీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం విశేషం. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ సంఘీభావం తెలిపారు. న్యాయమైన కోర్కెల కోసం  ఏడాదిగా ఆందోళన చేస్తున్నా ధార్మిక సంస్థ అయిన టీటీడీ స్పందించక పోవడం విచారకరమన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించకుంటే మేధావులు సైతం కలిసొస్తారని తెలిపారు. 


జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయరా? 

‘ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి కార్మికుల సర్వీసులనురెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయ్యాక ఆ హామీలను అమలు చేయకపోగా పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేస్తారా?’ అని పలు పక్షాల నాయకులు మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా 92 మందిని పోలీసులు అరెస్టు చేయడంపై వారు మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. అరెస్టు చేసిన నాయకులు, కార్మికులను నగరంలోని సాయంత్రం 5 గంటల వరకు పలు పోలీసు స్టేషన్లలో ఉంచి.. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 

Updated Date - 2021-11-27T07:41:10+05:30 IST