Abn logo
Jul 5 2020 @ 00:29AM

‘న్యాయం’తో పోరాటం!

ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలలో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకుంటాయని సీతారాం ప్రశ్నించడంలో హేతుబద్ధత ఉందా? అంటే లేదనే చెప్పాలి. అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు కాకపోతే ఇంకెవరు జోక్యం చేసుకోగలరు? విధాన నిర్ణయమని చెప్పి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ కళ్లు మూసుకోవాలా? అలా అయితే ప్రజలకు దిక్కెవరు? మళ్లీ ఎన్నికలు జరిగేవరకు ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా భరించాల్సిందేనా? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భిన్నంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అలా కుదరదని చెప్పడానికి తమ్మినేని సీతారాంకు హక్కు గానీ, అధికారం గానీ లేవు.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘‘ఏది?’’ అని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక సామాజికవర్గంపై గుడ్డి ద్వేషంతో అమరావతిలో 90 శాతం పూర్తయిన భవనాలను కూడా పాడుబడేలా చేశారు. ప్రారంభంలో కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్టుగా ఇప్పుడు అదొక ఏడారి అయ్యింది. పందులు తిరుగుతున్నాయి. రైతులు ఇచ్చిన భూములలో నిర్మించిన అసెంబ్లీ భవనంలోనే కూర్చొని సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేశారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులకు కౌలు కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం చంద్రబాబు నిర్మించిన టవర్లను అమ్మకానికి పెట్టి డబ్బు చేసుకోవాలనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారీ నిర్మాణాలు, వేలాదిమంది కార్మికులతో కళకళలాడుతుండే అమరావతిని స్మశానంగా మార్చి ఇప్పుడు టవర్లు అమ్ముతామంటే కొనేవారుంటారా? అమరావతిని చంపేయడం వల్ల ఇప్పటికిప్పుడు నష్టపోతున్నది కొన్ని వేల మంది రైతులే కావొచ్చును గానీ, తాము కోల్పోయింది ఏమిటో ప్రజలు కూడా త్వరలోనే గ్రహిస్తారు.


న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమా? అని ఎవరైనా అడిగితే కచ్చితంగా కాదనే సమాధానమే వస్తుంది. అయితే ఈ వెసులుబాటును ఉపయోగించుకుని న్యాయ వ్యవస్థనే బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకుంటే! అదే జరిగినప్పుడు న్యాయమూర్తులే కాదు సమాజం కూడా నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ తన పరిధిని అతిక్రమిస్తోందనీ, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకుంటోందనీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ఏర్పడిన ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తదుపరి ఎన్నికలలో ప్రజలే ఆ ప్రభుత్వాన్ని ఓడిస్తారనీ, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌ హోదాలో ఉన్న ఆయన చేసిన ఈ విమర్శలను తీవ్రంగా పరిగణించాల్సిందే! మహోన్నతమైన రాజ్యాంగం ఒక్కో వ్యవస్థకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది.


ఆయా వ్యవస్థలు తమ బాధ్యతలను నిష్పక్షపాతంగా, నిర్భీతితో నిర్వహించడానికి వీలుగా ఈ హక్కులు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రంగా పనిచేస్తుందో.. చట్టసభల స్పీకర్లు కూడా అంతే స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా.. ఈ రెండు వ్యవస్థల మధ్య లక్ష్మణ రేఖను రాజ్యాంగంలో గీశారు. రాష్ట్ర శాసనసభకు సంబంధించినంత వరకు స్పీకర్లు తీసుకునే నిర్ణయాలను హైకోర్టులు సాధారణంగా సమీక్షించవు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిని సభకు పిలిపించి శిక్షించే అధికారం కూడా స్పీకర్‌కు ఉంటుంది. ఈ వెసులుబాటునే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఉపయోగించుకుంటోంది. న్యాయ వ్యవస్థను విమర్శించడానికి శాసనసభ స్పీకర్‌ను ఉపయోగించుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మామూలుగా అయితే స్పీకర్లు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థను దూషిస్తూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేసినవారికి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో రాజ్యాంగం కల్పించిన పరిమిత ఇమ్యూనిటీని ఆసరాగా తీసుకుని స్పీకర్‌ను రంగంలోకి దించారని భావించవలసి వస్తోంది. తమ్మినేని సీతారాం చేసిన విమర్శలను ఎవరైనా మంత్రి చేసి ఉంటే హైకోర్టు ఆగ్రహానికి గురికావలసి వచ్చేది. శాసనసభ స్పీకర్‌గా ఉండి ఉండకపోతే తమ్మినేని సీతారాం కూడా కోర్టు ధిక్కారం కింద నోటీసులు అందుకుని ఉండేవారు. అలా అని న్యాయ వ్యవస్థను అదేపనిగా కించపరిచే హక్కు కూడా స్పీకర్‌కు లేదు.


ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలలో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకుంటాయని సీతారాం ప్రశ్నించడంలో హేతుబద్ధత ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఉదాహరణకు ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల జెండాల రంగులు వేయడాన్ని హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. నిబంధనలు అనుమతించని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం అవుతుందా? అమలులో ఉన్న నేషనల్‌ అంబులెన్స్‌ కోడ్‌కు విరుద్ధంగా ఏవో పిచ్చి రంగులు వేస్తే న్యాయస్థానాలు కళ్లు మూసుకోవలసిందేనా? ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రజాహితంతో కూడినవై లేనప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలోనే స్పష్టంచేసింది. ప్రభుత్వాలైనా, న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు కాకపోతే ఇంకెవరు జోక్యం చేసుకోగలరు? విధాన నిర్ణయమని చెప్పి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ కళ్లు మూసుకోవాలా? అలా అయితే ప్రజలకు దిక్కెవరు? మళ్లీ ఎన్నికలు జరిగేవరకు ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా భరించాల్సిందేనా? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భిన్నంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అలా కుదరదని చెప్పడానికి తమ్మినేని సీతారాంకు హక్కు గానీ, అధికారం గానీ లేవు. తనను అక్రమంగా 16 నెలలపాటు జైలులో నిర్బంధించారని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాడు వాపోవడం వల్లనే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. మనం రాచరిక వ్యవస్థలో లేము.


‘‘ప్రజలు ఓట్లు వేశారు. ఇక మా ఇష్టం’’ అని భావిస్తూ ప్రతిపక్షాలకు చెందినవారిని జైళ్లలో నిర్బంధిస్తాం లేదా చంపేస్తాం అని అధికారంలో ఉన్నవాళ్లు అరాచకంగా వ్యవహరిస్తే అందుకు మన రాజ్యాంగం అనుమతించదు. విధాన నిర్ణయం పేరిట చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకునే హక్కు ఏ ప్రభుత్వానికీ ఉండదు. నిజానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభం నుంచి తలబిరుసుతనంతో న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగుతోంది. ఉదాహరణకు పంచాయతీ భవనాలకు రంగుల విషయమై దాఖలైన పిటిషన్‌నే తీసుకుందాం. ఈ రంగుల విషయాన్ని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వానికి తగిన వ్యవధిని న్యాయస్థానం ఇచ్చింది. పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు.. ‘‘ఈ విషయం ఇప్పుడే మా దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం’’ అని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చి వుంటే వివాదం అంతటితో సమసిపోయేది. అలా చేయకపోవడం వల్లనే వివాదం హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 మంది వరకు ఎర్రచందనం స్మగ్లర్లను ఒకే రోజు ఎన్‌కౌంటర్‌ చేశారు. దీనిపై హైకోర్టు విచారించింది. దీంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గి సంఘటనపై విచారణకు కమిటీని నియమిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో వివాదం సమసిపోయింది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలా మొండిగా వ్యవహరించి ఉంటే న్యాయస్థానమే కల్పించుకుని విచారణ కమిషన్‌ వేసి ఉండేది. ఈ సున్నితత్వాన్ని, లౌక్యాన్ని అర్థం చేసుకోకుండా జగన్‌ ప్రభుత్వం పొగరుబోతుతనంతో వ్యవహరించడం వల్లనే తంటా అంతా వస్తోంది. ఈ విషయం అలా ఉంచితే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఏకంగా ఆరోపణలు చేస్తూ అఖిల భారత బీసీ సంఘాల ఫెడరేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హన్స్‌రాజ్‌ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.


ఈ ఫిర్యాదు చేసిన హన్స్‌రాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌ ఉన్నారు. ఈయనకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కమిషన్‌ పర్యవేక్షక పదవిని కట్టబెట్టింది. ఎన్నికలకు ముందు ఇదే జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌.. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా పరోక్ష ప్రచారం చేశారు. ఇప్పుడాయన సారథ్యంలోని ఫెడరేషన్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు హన్స్‌రాజ్‌ పేరిట ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మరణానికి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతారహిత ధోరణే కారణమన్న ఆరోపణ ఇందులో ఒకటి. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఈ వ్యవహారంలో ఎవరినైనా తప్పుబట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్నే తప్పుబట్టాలి. ఎందుకంటే రాజశేఖర్‌ కరోనా వైరస్‌తో చనిపోయారని గానీ, ఆయనకు వైరస్‌ సోకిందని గానీ ప్రభుత్వం ప్రకటించలేదు. ఆయన మరణం తర్వాత విషయం తెలుసుకున్న ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు కార్యకలాపాలను సస్పెండ్‌ చేశారు. ఢిల్లీలో ఉండే హన్స్‌రాజ్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయవలసిన అవసరం ఏంటి? అని ప్రశ్న వేసుకుంటే.. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారో అర్థమవుతుంది. హన్స్‌రాజ్‌ చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలలో బీసీలకు సంబంధించినవి ఒక్కటి కూడా లేదు. హైకోర్టు తీర్పుల వల్ల ప్రభావితులైన వారిలో హన్స్‌రాజ్‌ లేరే? అయినా ఆయన ఫిర్యాదు చేశారంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉండి ఉంటారో అర్థంచేసుకోవడం అంత కష్టం ఏమీ కాదు! న్యాయవాదులలోనే రెండు రకాల వారుంటారు. సివిల్‌ కేసులు వగైరా వాదించే న్యాయవాదులు మెరిట్స్‌ ఆధారంగా కేసులు వాదిస్తారు. క్రిమినల్‌ కేసులు వాదించేవారు రెండో కేటగిరి. ఈ కేటగిరీకి చెందిన న్యాయవాదులు తమ క్లయింట్లను కాపాడటం కోసం న్యాయశాస్త్రంలోని లొసుగుల ఆధారంగా కేసులు వాదిస్తారు.


కొన్ని సందర్భాలలో న్యాయవాదుల కంటే నేరాలు చేయడంలో ఆరితేరినవారు కోర్టులో తమ తరఫున వాదించేవారికి సలహాలు, సూచనలు కూడా చేస్తుంటారు. కొత్తగా ప్రాక్టీస్‌ మొదలెట్టిన డాక్టర్‌ కంటే.. పాత రోగి బెటర్‌ అంటారే అలాగన్న మాట! అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ అండ్‌ కోకు న్యాయశాస్త్రంలోని లొసుగులపై పూర్తి అవగాహన ఏర్పడి ఉంటుంది. కాలికి వేస్తే మెడకు.. మెడకు వేస్తే కాలికి తగులుకునేలా రకరకాల పిటిషన్లు దాఖలు చేస్తూ దశాబ్దం గడుస్తున్నా కేసులు విచారణకు రాకుండా అడ్డుకోగల నైపుణ్యాన్ని జగన్‌ అండ్‌ కో సొంతం చేసుకోగలిగింది. పలు అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. న్యాయ వ్యవస్థలోని లొసుగులను అవపోసన పట్టారు కనుకే ఇప్పుడాయన న్యాయ వ్యవస్థతో ఢీకొనడానికై తమ్మినేని సీతారాం, హన్స్‌రాజ్‌ వంటి వారిని ఎంచుకుని ఉంటారన్న అభిప్రాయం ఉంది. న్యాయ వ్యవస్థ ఆదేశించడం ఏంటి? నేను పాటించడం ఏంటి? అని జగన్‌రెడ్డి భావిస్తున్నట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కొన్ని సందర్భాలలో భావిస్తుంటారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో సమస్య పరిష్కారానికి వీలుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీని నియమించాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. దీంతో అప్పటివరకు ఆర్టీసీకి ఎండీని నియమించడం కోసం కొంత కసరత్తు చేసిన కేసీఆర్‌.. ‘హైకోర్టు చెబితే నేను ఎండీని నియమించాలా?’ అన్నట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థకు పూర్తిస్థాయి ఎండీని నియమించలేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పెడ ధోరణులు కొందరికి అభ్యంతరకరంగా ఉంటున్నప్పటికీ ‘‘మా వాడు మొండివాడు.. ఎవరినీ లెక్కచేయడు’’ అని వారిని అభిమానించేవాళ్లు మురిసిపోవడం కూడా జరుగుతోంది. న్యాయ వ్యవస్థను లెక్క చేయకపోవడం, బ్లాక్‌మెయిలింగ్‌ చేయడానికి ప్రయత్నించడం అంటే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది. న్యాయ వ్యవస్థపై దాడి ఇదే మొదలు కాదు కనుక తనను తాను రక్షించుకునే శక్తిసామర్థ్యాలు, అధికారం ఆ వ్యవస్థకు ఉన్నాయి.


 మరణ శాసనం!

ఇక రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనబాట పట్టి 200 రోజులు అయింది. భూములు ఇచ్చినప్పుడు త్యాగమూర్తులుగా కొనియాడబడిన రైతులకు ఇప్పుడు కులం ముద్ర వేయడంతోపాటు స్వార్థపరులుగా దూషించడం జరుగుతోంది. అమరావతిని రాజధానిగా నాడు అంగీకరించిన ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్న జగన్‌ ప్రభుత్వం ఏడాది గడచినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘‘ఏది?’’ అని ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక సామాజికవర్గంపై గుడ్డిద్వేషంతో అమరావతిలో 90 శాతం పూర్తయిన భవనాలను కూడా పాడుబడేలా చేశారు. ప్రారంభంలో కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్టుగా ఇప్పుడు అదొక ఏడారి అయ్యింది. పందులు తిరుగుతున్నాయి. రైతులు ఇచ్చిన భూములలో నిర్మించిన అసెంబ్లీ భవనంలోనే కూర్చొని సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేశారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులకు కౌలు కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం చంద్రబాబు నిర్మించిన టవర్లను అమ్మకానికి పెట్టి డబ్బు చేసుకోవాలనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారీ నిర్మాణాలు, వేలాదిమంది కార్మికులతో కళకళలాడుతుండే అమరావతిని స్మశానంగా మార్చి ఇప్పుడు టవర్లు అమ్ముతామంటే కొనేవారుంటారా? 200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా, మూడు రాజధానులే అంటూ రాష్ట్ర గవర్నర్‌తో కూడా చెప్పించారు.


అమరావతిని చంపేయడం వల్ల ఇప్పటికిప్పుడు నష్టపోతున్నది కొన్ని వేల మంది రైతులే కావొచ్చును గానీ, తాము కోల్పోయింది ఏమిటో ప్రజలు కూడా త్వరలోనే గ్రహిస్తారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాటల్లో చెప్పాలంటే.. అమరావతి స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడం విధానపరమైన నిర్ణయమే! ఈ నిర్ణయాన్ని న్యాయస్థానాలు అడ్డుకోలేకపోవచ్చును గానీ.. విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ప్రజల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలిగితే జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో ఒప్పందం చేసుకున్న సమయంలో అక్కడ ఏమేమి వస్తాయి, ఎలా అభివృద్ధి చెందుతుందన్నది వివరిస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కుదరదు అంటే న్యాయస్థానాలు కళ్లకు గంతలు కట్టుకుని ఉండిపోవు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నష్టపోయే రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంటుంది. ఆ అధికారం లేదని చెప్పే హక్కు తమ్మినేని సీతారాంకు గానీ, మరొకరికి గానీ లేదు. అమరావతిని శాసనసభ సమావేశాలకే పరిమితం చేయడం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది కనుక బాధితులైన రైతులు న్యాయస్థానం తలుపులు తట్టకుండా ఎందుకు ఉంటారు? న్యాయశాస్త్రం తెలిసినవారు చెప్పినదాన్ని బట్టి అమరావతి రైతులకు సముచిత న్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాలను విశాఖకు తరలించలేదు. రాజధాని కోసం సమీకరించిన భూములు ఇప్పుడు వ్యవసాయానికి కూడా పనికిరావు. ఈ కారణంగా రైతులందరికీ కలిపి కొన్నివేల కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించవలసి ఉంటుంది. అంతటి ఆర్థిక స్థోమత జగన్‌ ప్రభుత్వానికి లేదనే చెప్పవచ్చు.


కోర్టు ఆదేశాలను లెక్క చేయకూడదు అనుకుంటే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అయినా ఇదంతా తేలడానికి ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. అప్పటివరకు మూడు రాజధానులు కాదు కదా, ఒక్క రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్‌ బిక్కుబిక్కుమంటూ ఉండిపోతుంది. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభలో చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కనుక జగన్‌రెడ్డిపై నైతిక బాధ్యత కూడా ఉంటుంది. అయినా ఒక కులంపై కోపంతో బంగారు బాతు వంటి అమరావతిని చంపుకోవడం వివేకం ఎలా అవుతుంది? ఇటు అమరావతి, అటు విశాఖ, కర్నూలు కూడా అభివృద్ధి చెందని పక్షంలో అందుకు సమాధానం చెప్పవలసింది జగన్‌రెడ్డి మాత్రమే! ‘చారాన కోడికి బారాన మసాలా..’ అన్నట్టుగా పాత పథకాలకు కొత్త రంగులు వేసి వాయిదాలలో నిధులు విడుదల చేయడాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటూ భారీ ప్రకటనలు జారీ చేస్తూ జగన్‌ అండ్‌ కో అంతా పచ్చగా ఉందని భావించుకోవచ్చు గాక! ఏదో ఒకరోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. సమాజాన్ని సన్నజనం– దొడ్డజనంగా విభజించి ఓటు బ్యాంకును అభివృద్ధి చేసుకుంటున్నామని ఇప్పటికి సంబరాలు చేసుకుంటూ ఉండవచ్చు గానీ... అన్ని రోజులు ఒకేలా ఉండవు! రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నప్పటికీ రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధర్మం, న్యాయం రైతులవైపే ఉంది. వారికి న్యాయం చేయడానికి ఈ దేశంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఒకరు కాకపోతే మరొకరు వారికి రక్షణగా నిలబడతారు. రాజధాని తరలింపు అన్న పదం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నోటి వెంట వెలువడిన నాడే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మరణ శాసనం రాసినట్టు అయ్యింది. ప్రజలలో ఇప్పటికైనా చైతన్యం రాని పక్షంలో దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సమయం పట్టదు. జరగాల్సిందంతా జరిగాక ఎంత వగచినా ప్రయోజనం ఉండదు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంటూ కలవరించిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు నోరు మెదపడం లేదు. అమరావతిని అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, దాన్ని కూడా కాలదన్నుకుంటున్న ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని తెలంగాణకు చెందిన మం త్రులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో కూడా ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడే జగన్‌రెడ్డి నేల మీదకు దిగివస్తారు. అంతవరకు రైతులకు కనీసం నైతిక మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత! అమరావతి రైతుల రోదన, వేదన వృథా పోవని ఆశిద్దాం. చరిత్ర సృష్టించవలసిన పాలకులు చరిత్రహీనులుగా మారే నిర్ణయాలు తీసుకోవడం మహా విషాదం!

ఆర్కే

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement