సమరయోధులు బోరుబోరు!

ABN , First Publish Date - 2021-01-13T06:00:47+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధులను ప్రభుత్వం గుర్తించింది. వారికి రెండెకరాల చొప్పున భూమిని కేటాయించి సత్కరించింది.

సమరయోధులు బోరుబోరు!
స్వాతంత్య్ర సమరయోధులకు భూమి కేటాయిస్తూ రెవెన్యూ అధికారులు జారీ చేసిన ధ్రువపత్రం

1997లో ప్రభుత్వమిచ్చిన భూమిపై రియల్టర్ల కన్ను

18 మందికి చెందిన 36 ఎకరాలు కబ్జా

న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు


సంగారెడ్డి రూరల్‌, జనవరి 12 : స్వాతంత్య్ర సమరయోధులను ప్రభుత్వం గుర్తించింది. వారికి రెండెకరాల చొప్పున భూమిని కేటాయించి సత్కరించింది. కానీ కొందరు కబ్జాదారులు ఆ భూమిని స్వాధీనంలోకి తీసుకున్నారు.18 మందికి చెందిన 36 ఎకరాలను కబ్జా చేసి, ఎవరైనా భూమిలో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయండి మొర్రో అంటూ వారు అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. సోమవారం ప్రజావాణిలో మరోమారు వారు అర్జీని సమర్పించి బోరున విలపించారు. 



స్వాతంత్ర సమరయోధులకు ఆసరాగా ఉండాలన్న లక్ష్యంతో 1997లో అప్పటి ప్రభుత్వం రామచంద్రాపురం మండలం కొల్లూర్‌ పరిధిలోని సర్వేనంబర్‌ 191లో 18 మందికి రెండెకరాల చొప్పున 36 ఎకరాలు కేటాయించి పట్టా సర్టిఫికెట్లను అందజేసింది. కొంతకాలంగా కొల్లూరు పరిధిలో భూముల ధరలు అమాంతం పెరగడంతో కొందరు భూవ్యాపారులు, స్థానిక నాయకులు కలిసి ఈ భూమిని ఆక్రమించుకున్నారు. సమరయోధులను, వారి వారసులను తమ భూముల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. తమ భూమిని ఎలాగైనా రక్షించుకోవాలని వారు అధికారుల చుట్టూ తిరిగారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా తమకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరున్నరేళ్లు గడిచినా వీరి సమస్యను ఎవరూ పరిష్కరించలేదు. 2016లో అప్పటి సంయుక్త కలెక్టర్‌ వెంకట్రామారెడ్డిని సంప్రదించి పరిష్కారం చూపాలని వేడుకున్నారు. ఆయన అన్ని ధ్రువపత్రాలను పరిశీలించి సమరయోధులకు ఆ భూమిపై యాజమాన్య హక్కులను పునరుద్ధరించారు. అయినా తమ భూముల్లోకి వెళ్లలేకపోతున్నామని వారు బోరున విలపించారు. పలుమార్లు అర్జీలు సమర్పించిన వీరిలో కొందరు  సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి డీఆర్వో రాధికా రమణికి వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ హన్మంతరావు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 




ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతాం

నాడు దేశం కోసం పోరాడాను, నేడు సమస్యను పరిష్కరించాలని పోరాడుతున్నాను. ప్రస్తుతం నాకు 95 ఏళ్లు.  ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటా. కార్యాలయాలకు తిరుగుతున్నందుకు నాకు బాధ లేదు. నన్ను చూసైనా అధికారులకు కనికరం కలగడం లేదని బాధేస్తుంది. 

 - మల్లమ్మ, స్వాతంత్య్ర సమరయోధురాలు, టేక్మాల్‌


 న్యాయం చేయండి

కొందరు మాకు ప్రభుత్వం కేటాయించిన భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టు తిరుగుతున్నాం. మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయండి. 

 - చల్లవీర్‌ సంగప్ప, స్వాతంత్య్రసమరయోధుడు, టేక్మాల్‌


Updated Date - 2021-01-13T06:00:47+05:30 IST