Advertisement
Advertisement
Abn logo
Advertisement

కదంతొక్కిన రైతులు

- ఎల్లారెడ్డిపేటలో రాస్తారోకో 

- - యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌

ఎల్లారెడ్డిపేట, డిసెంబరు 3: యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు కదంతొక్కారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనేదాక ఊరుకోబోమని, యాసంగిపై తేల్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సమాఖ్య ఆధ్వర్యంలో  ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం ప్లకార్డులతో భారీ రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సుమారు 1000 మంది రైతులు భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వీడాలన్నారు.  ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలకు దిగుతామని స్పష్టం చేశారు. సుమారు 2 గంటలపాటు ఆందోళన చేపట్టారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు   కొత్త బస్టాండు సమీపంలోని బైపాస్‌ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలను సాగించారు. రైతులు తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ఎదుట బైఠాయించారు.  యాసంగిలో వరి ధాన్యం కొని తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. తమ భూముల్లో వరి మాత్రమే పండుతుందని, వేరే పంటలు ఎలా వేసేదని? ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాలు తమకు వద్దన్నారు. అనంతరం తహసీల్దార్‌ మజీద్‌కు వినతి పత్రం అందజేశారు. 

అంబులెన్స్‌కు దారిచ్చి 

 ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలోని పాత బస్టాండు వద్ద కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టడంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో  సిరిసిల్ల వైపునకు వెళ్లేందుకు అంబులెన్స్‌ రావడంతో  రైతులు దారిచ్చారు. అనంతరం యథావిధిగా రాస్తారోకో కొనసాగించారు. 

Advertisement
Advertisement