పోరాటమే ఆయన ఊపిరి

ABN , First Publish Date - 2022-01-29T09:03:10+05:30 IST

పుట్టుకా, మరణం ప్రకృతి ధర్మాలే. కానీ ఆ రెండింటి మధ్యా నూరేళ్లకు పైగా తన జీవితాన్ని విప్లవాత్మకంగా మలుచుకుని ఆ విప్లవ స్ఫూర్తిని భావితరాలకు అందించిపోయిన బండ్రు నరసింహులు ఆదర్శజీవి...

పోరాటమే ఆయన ఊపిరి

పుట్టుకా, మరణం ప్రకృతి ధర్మాలే. కానీ ఆ రెండింటి మధ్యా నూరేళ్లకు పైగా తన జీవితాన్ని విప్లవాత్మకంగా మలుచుకుని ఆ విప్లవ స్ఫూర్తిని భావితరాలకు అందించిపోయిన బండ్రు నరసింహులు ఆదర్శజీవి. 1914–18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో బుడిబుడి అడుగులు వేసిన గుర్తులు తల్లి బండ్రు కొమరమ్మ చెప్పిన ఆనవాళ్లే ఆధారంగా అక్టోబర్‌ 2, 1915గా ఆయన జన్మదినం నిర్ధారించబడింది. నిండా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తికాకుండానే భర్త బండ్రు బుచ్చిరాములను కోల్పోయిన కొమరమ్మ తన భూమిని కాజేయడానికి ప్రయత్నించిన షావుకారి నారాయణతో 7 సంవత్సరాలు భువనగిరి కోర్టులో పోరాడి విజయం సాధించడమే బాల నర్సింహులుకు తొలి ప్రేరణ. నైజాం హైదరాబాద్‌ రాష్ట్రంలో వేలాది ఎకరాల జాగీర్దార్లు, దేశముఖ్‌లు, గడీల కేంద్రంగా సాగిన భూస్వాములు, పటేల్‌, పట్వారీలు వడ్డీలు, నాగులతో పీడించే షావుకార్ల పంచముఖ దోపిడీ ప్రజల్లో తిరుగుబాటుకు కారణంగా ఉండేది. దున్నేవారికి భూమి–రాజ్యాధికారం లక్ష్యంగా 1946–51 వరకు సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో బండ్రు నరసింహులు లాంటి ఎంతోమంది మట్టిబిడ్డలు వీర యోధులుగా తీర్చిదిద్దబడ్డారు. అయితే అంతటితోనే ఆగకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరితేరిన యోధుడిగా నక్సల్బరిని స్వాగతించి నక్సలైట్‌గా మారాడు. శ్రీకాకుళం–గోదావరిలోయ–కరీంనగర్‌–నల్లగొండ రైతాంగ పోరాటాలకు ప్రతీకగా నిలబడి 12 సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవించాడు. శరీరంలో తూటాలు దిగి నెలల తరబడి సాగిన చిత్రహింసలో చావు అంచుదాకా పోయిరావడం, రహస్య జీవితంలో తిండీ తిప్పలు లేక అల్లాడి శరీరం చిక్కిపోవడం వంటి పరిణామాల మధ్య కూడా క్రమశిక్షణాయుత జీవితం, నిరంతర వ్యాయామంతో ఆయన సుదీర్ఘకాలం జీవించాడు. చివరిదాకా విప్లవ కార్యాచరణ, విప్లవ రాజకీయ ప్రచారంతో మూడు తరాలను మెప్పిస్తూ, భావితరాలను ఆలోచింపజేస్తూనే వెళ్ళాడు. అందుకే బండ్రు స్ఫూర్తి అజరామరం.


బండ్రు నర్సింహులుకు భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్‌ మహాసభలను జరుపుకుంటున్న 1925 నాటికి పదేళ్ల వయసులో తల్లి కొమరమ్మ పోరాట తెగువ మాత్రమే తెలుసు. కొలనుపాక అనేది నవాబ్‌ తురాబ్‌ జయాగ్‌ జాగీరు గ్రామం. దీనికి ప్రత్యేక తాసిల్దార్‌ పేష్కార్‌, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు రజాకార్లు, పోలీసుల క్యాంపు ఉండేది. ఒకరకంగా యుద్ధ ప్రభువులుగా సాయుధమై ఉన్న వాళ్లతో నిరాయుధంగా పోరాడటమనేది ఊహించుకోవడమే కష్టం. ఈ ప్రాంతపు బహుజన వీరుడు సర్వాయి పాపన్న నుంచి బండ్రు నర్సింహులు దాకా ఇది నిరూపించబడ్డ సత్యం. ఆరుట్ల సోదరులు జరిపిన కొలనుపాక జాగీర్‌ వ్యతిరేక పోరాటమే బండ్రును 1944 మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు నడిపించింది. అటు నుంచే ఉద్యమం బాట పట్టినప్పటికీ ఆయన పోరాట జీవితమంతా కొలనుపాక, ఆలేరు, రాజంపేట, కొండపాక, కడవెండి ప్రాంతాల చుట్టూ సాగింది. 1947 నవంబర్‌ 2న చలో కొలనుపాక పిలుపుతో ఆలేరు నుంచి బయలుదేరిన వేలాది మందిపై పోలీసులు కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టనబెట్టుకున్నారు. ఆ వీరుల స్థూపమే నేటికి ఆయన ఇంటిముందు నెలవై ఉంది.


ఇప్పటికీ జానపదుల నోట నానుతున్న కుర్రారం రామిరెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకున్న ఘటనకు బండ్రు నాయకత్వం వహించారు. రైతు గెరిల్లాగా దాడుల్లో ఆరితేరిన బండ్రు, లింగారెడ్డిపల్లి క్యాంపుపై దాడిలో గాయపడి చికిత్స పొందాడు. కొద్దికాలానికే తన దళంపై కొలనుపాకలో జరిగిన దాడిలో ఆగస్టు 12, 1948లో అరెస్టయ్యాడు. నెలల తరబడి జనగాం క్యాంపుల్లో హింసను అనుభవించి నల్లగొండ జైలుకెళ్లినా పోరాటం ఆపలేదు. ఖైదీలను హింసిస్తున్న కలెక్టర్‌నైనా వదలలేదు. అక్కడా చావుదెబ్బలు తప్పలేదు.


1952 సాధారణ ఎన్నికల తర్వాత విడుదలైనా ఆయన పోరాట ప్రయాణం ఆగలేదు. 1964లో డీఐఆర్‌ కింద, 1969లో హైదరాబాద్‌ కుట్ర కేసులో, 1974లో రైల్వే సమ్మెలో, 1975 అత్యవసర పరిస్థితి కాలంలో అలాగే భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పలుమార్లు అరెస్టయ్యాడు. చిత్రహింసల కొలిమిలో కాగి పదునెక్కాడు. 1967లో సిపిఎం ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1984లో మిర్యాలగూడ పార్లమెంట్‌ సభ్యుడిగా సిపిఐ (ఎంఎల్‌) నుంచి పోటీ చేసినా సాయుధ పోరాటమే భారతదేశం విముక్తికి  మార్గమని విశ్వసించి కొనసాగాడు. 1992లో సిపిఐ (ఎం-ఎల్‌) జనశక్తి నిర్మాణంలో భాగమై చివరి దాకా అదే పార్టీలో కొనసాగాడు. ప్రజా విమోచన ప్రధాన సంపాదకులుగా బాధ్యత తీసుకుని గొప్ప  చదువరిగా ఉంటూ పత్రికను ప్రజల పక్షపాతంతో నడపడానికి దోహదపడ్డాడు. చివరకు తన శరీరం కూడా ప్రజలకి ఉపయోగపడాలని, తన ‘నూరేళ్ళ పండుగ నూటొక్క పాట’ కార్యక్రమం సందర్భంగా పార్థివ దేహం ఆసుపత్రికివ్వాలని నిర్ణయం తీసుకుని అమలుపరిచాడు.


పోరాటమే ఊపిరిగా బతికిన బండ్రు నర్సింహులుకు వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను.

అమర్‌

(రేపు ఆలేరులో బండ్రు నర్సింహులు సంస్మరణ సభ)

Updated Date - 2022-01-29T09:03:10+05:30 IST