Abn logo
Sep 25 2021 @ 01:00AM

కదంతొక్కిన స్కీం వర్కర్లు

చోడవరం: కొత్తూరు జంక్షన్‌లో మానవహారం చేస్తున్న కార్మికులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనలు

సమస్యలపై ర్యాలీలు, మానవహారాలు


చోడవరం/బుచ్చెయ్యపేట/రోలుగుంట, సెప్టెంబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ స్కీం వర్కర్లు శుక్రవారం కదంతొక్కారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నియోజకవర్గం పరిధిలో చోడవరం, బుచ్చెయ్యపేట, రోలుగుంట మండలాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, జీవిత బీమా అందించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సదుపాయాలు కల్పించాలని, రిటైర్మెంట్‌ ప్రయోజనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని  నినాదాలు చేశారు. రైతుల పాలిట ఉరితాళ్లుగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాల్లో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, మధ్యాహ్న భోజన పథకం, కార్మిక సంఘాల నాయకులు గూనూరు వరలక్ష్మి, ఎస్‌.అరుణ, కె.స్వరూరాణి, పి.సాంబశివరావు, పి.వరలక్ష్మి, అప్పలరాజు, కె.కృష్ణవేణి, రమణమ్మ పాల్గొన్నారు.