పైసల్లేనిదే కదలని ఫైళ్లు!

ABN , First Publish Date - 2022-01-17T06:23:49+05:30 IST

జిల్లా పరిషత్‌లో అడ్డగోలుగా డెప్యుటేషన్లు, మ్యూచువల్‌ బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పైసల్లేనిదే కదలని ఫైళ్లు!

‘మనీ’ మ్యూచువల్‌ బదిలీలు

జడ్పీలో 21 మంది దరఖాస్తు

నలుగురు మాత్రమే బదిలీ

ఇతర జిల్లాల్లో సజావుగా ప్రక్రియ

జిల్లాలో బదిలీలను శాసించిన డబ్బు

గుట్టుగా 14 మందికి కారుణ్య నియామకాలు

అనంతపురం విద్య, జనవరి 16 : జిల్లా పరిషత్‌లో అడ్డగోలుగా డెప్యుటేషన్లు, మ్యూచువల్‌ బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులు కొట్టనిదే...ఫైళ్లు కదలదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఇతర జిల్లాలో మ్యూచువల్‌ బదిలీలు సజావుగా సాగిస్తే...ఇక్కడ మాత్రం పైసల బేరం కుదరలేదన్న నెపంతో చాలా దరఖాస్తులను పక్కన పెట్టేశారన్న ఆరోపణలున్నాయి.  రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షలు వసూలు చేసి పలువురు ఉద్యోగుల డెప్యుటేషన్లు వేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా జడ్పీలో అక్రమ డెప్యుటేషన్లు, పరసర్పర బదిలీల్లో బాగానే కలెక్షన్లు చేసినట్లు  బహిరంగంగా వినిపిస్తోంది.  గుట్టుగా 14 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలిచ్చారు. ఈ విషయంలో సైతం భారీగా లక్షలు చేతులు మారాయన్న విమర్శలు వస్తున్నాయి.


అడ్డగోలుగా వ్యవహారాలు

జడ్పీలో అడ్డగోలుగా వ్యవహారాలు సాగుతున్నాయి. ప్రభుత్వం పరస్పర బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే జడ్పీలో కొందరు అధికారులు, పాలకులు వాటిని సజావుగా సాగకుండా ఆపేశారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పరస్పర బదిలీలకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 21 మంది మ్యూచువల్‌ బదిలీలకు దరఖాస్తు చేశారు. అయితే కేవలం 4 దరఖాస్తులను మాత్రం ఓకే చేసి మిగిలిన వాటిని పక్కన పెట్టేశారన్నా విమర్శలు వస్తున్నాయి. కొన్నింటికి గేట్లు ఎత్తి... మిగిలిన వాటిని తిరస్కరించడం వెనుక భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. 

 

శాసిస్తున్న కరెన్సీ కట్టలు..

జడ్పీలో కరెన్నీ కట్టలు అన్నింటినీ శాసిస్తున్నట్లు ఉద్యోగవర్గాల్లో చర్చ నడుస్తోంది. లక్షలు కొడి తే...ఎవరైనా అడిగిన చోటుకు  కోరితే బదిలీ, డెప్యుటేషన్లు, వాటిని మించి కారుణ్య నియామకాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయంగా జరగాల్సిన పరస్పర బదిలీల్లో చాలా మంది ఉద్యోగులకు మొండిచేయి చూపారన్న ఆరోపణలున్నాయి. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని 20 శాతం హెచ్‌ఆర్‌ఏ సాకుగా చూపి వాటిని బదిలీ చేయకుండా నిలిపేశారన్న విమర్శలు వస్తున్నాయి.  ఇటీవల బీసీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ జడ్పీకి చెందిన సీనియర్‌ అసిస్టెంట్‌ను మరో శాఖకు  డెప్యుటేషన్‌ వేశారు. ఇందులో రూ. 2 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల కింద 14 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టింగ్‌లు ఇచ్చారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గుట్టుగా చక్రం తిప్పారు. దీనివెనుక కొందరు ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. కారుణ్య నియామకాల్లో సైతం భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  ఉన్నతాధికారులకు మినహా కింది స్థాయి సిబ్బందికి సైతం తెలియకుండా పోస్టుల భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కారుణ్య నియామకాల్లో లక్షలపైనే బేరాలు సాగినట్లు ఆరోపణలున్నాయి. అందువల్లే ఈ నెల 13వ తేదీ సెలవు దినమైనా....చకచకా పావులు కదిపి...నియామకాలు చేపట్టినట్లు బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.


వసూళ్ల వెనుక ఉన్నదెవరు....!

 జడ్పీలో ఇటీవలి కాలంలో మ్యుచువల్‌ ట్రాన్స్‌ఫర్‌ వెనుక ఉన్న శక్తులు బయటపడటం లేదు. ఉన్నతాఽధికారుల కనుసన్నల్లో జరిగిందా...లేక పాలకులే వెనకుండి నడిపించారా అన్నది స్పష్టం కావడం లేదు. ఉన్నతాధి కారుల అనుమతి లేనిదే బదిలీలు, డెప్యుటేషన్లు, నియా మకాలు సాగడంలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ పాలకులు గొప్పలు చెబుతున్నారే కానీ జడ్పీలో మాత్రం కరెన్సీ కట్టలు పాలన సాగిస్తున్నాయన్న విమర్శలు వినిపి స్తున్నాయి. పైౖసా ఇవ్వనిదే పని కావడం లేదు, ఫైళ్లు కదలడం లేదు. మరి ఈ అవినీతిపై జడ్పీ పాలక వర్గం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Updated Date - 2022-01-17T06:23:49+05:30 IST