May 3 2021 @ 14:37PM

సీసీసీ: మాట మీద ఎంతమంది నిలబడ్డారు?

గతేడాది కరోనాతో ఏర్పడిన లాక్‌డౌన్‌ కారణంగా అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా నిలిచిపోయింది. 24 శాఖల్లోని కార్మికులు పని లేకుండా ఇంటికే పరిమితం కావడంతో వారికి ఇల్లు గడవడం కూడా కష్టమైన విషయం తెలిసిందే! ఆయా శాఖల పెద్దలు కొంతవరకూ కార్మికులకు నిత్యావసన వస్తువులు అందజేసి ఆదుకున్నారు. అదే తరుణంలో ఇండస్ట్రీలో పేద కార్మికుల కష్టాలు తెలుసుకున్న చిరంజీవి.. తోటి నట, నిర్మాతలు, దర్శకులతో మాట్లాడి.. మొదట తను కోటి రూపాయలు విరాళంతో కరోనా క్రైసిస్‌ ఛారిటీ(సీసీసీ) ఏర్పాటు చేశారు. ఆయన పిలుపుతో ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ప్రముఖులంతా తమ శక్తి మేరకు డొనేషన్స్‌ ప్రకటించారు. కొందరు వెంటనే సీసీసీ ఖాతాలో ప్రకటించిన మొత్తాన్ని జమచేశారు. 


దాంతో సీసీసీ సభ్యులు నాణ్యమైన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. మెహర్‌ బాబా ట్రస్ట్‌ వలంటీర్స్‌ చేత ప్యాకింగ్‌ చేయించి దాదాపు పదిహేను వేల కుటుంబాలకు, సినిమా జర్నలిస్ట్‌లకు ఓ క్రమంలో రెండుసార్లు నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. సినీ కార్మికులు అందుకున్న ఒక్కో కిట్‌ ఖరీదు రూ. 2600. దీనితో సినిమా పరిశ్రమలో కార్మికులంతా ఆనందించారు. ఇలా రెండుసార్లు సీసీసీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాక కూడా సీసీసీ ఖాతాలో జమ అయిన మొత్తంలో ఇంకా కొంత బ్యాలెన్స్‌ ఉండడంతో చిరంజీవి, సభ్యులు మరో బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉదృతం అవుతున్న నేపథ్యంలో 24 శాఖల్లో 45 ఏళ్లు దాటిన కార్మికుల కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్‌ ఇప్పించాలని నిర్ణయించారు. ఇటీవల ఆ ఆలోచన కార్యరూపం దాల్చింది. విడతల వారీగా ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్‌ వేయించారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడిసిన్స్‌కి రాయితీ కూడా ప్రకటించారు. ఈ తరుణంలో ఓ సంచలన వార్త ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. 


గొప్ప కోసం ప్రకటించారా? 

చిరంజీవి పిలుపు మేరకు ఎంతోమంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. అందులో ఎంతమంది మాట మీద నిలబడ్డారు? ఇదీ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో వైరల్‌ అవుతున్న వార్త. చాలామంది అప్పటికప్పుడే సీసీసీ ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం ఇప్పటికీ ప్రకటించిన విరాళం సీసీసీ అందజేయలేదని సమాచారం. ఇందులో ఎక్కువశాతం యువ హీరోలు, చెప్పుకోదగ్గ నిర్మాతలూ ఉన్నారని వినికిడి. అయితే అందులో కొందరి పేర్లు అనధికారంగా బయటకు వచ్చాయి. సీసీసీ మాత్రం పరిశ్రమ, ఆ నిర్వాకం చేసిన ప్రముఖులు పరువు, మర్యాదలు పోకూడదని ఈ విషయాన్ని ఇప్పటివరకూ బయటకు రానివ్వలేదు. సీసీసీ మాత్రం తన సేవా కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తుంది. ‘గొప్పకు మేం అంత ఇస్తాం.. ఇది చేస్తాం’ అని ప్రకటించి మాట నిలబెట్టుకోలేని ఆ ప్రముఖులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు గొప్పలకు పోవడం ఎందుకో అని గుసగుసలాడుకుంటున్నారు.