పోడు హక్కు తేలేనా!

ABN , First Publish Date - 2021-10-23T07:48:30+05:30 IST

పోడు సమస్యకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అడవులు ఎక్కువగా ఉన్న 13 జిల్లాల్లో సమగ్ర సర్వే చేపట్టడమే కాకుండా అధికారులతో సమాచార సేకరణకు ఉన్నతస్థాయి కమిటీని వేసింది.

పోడు హక్కు తేలేనా!

  • నేడు సమీక్షించనున్న ముఖ్యమంత్రి..
  • 13 జిల్లాల్లో పర్యటించిన అధికారుల కమిటీ
  • పోడు హక్కు ఎంతవరకు కల్పించగలం?
  • జిల్లా స్థాయి అధికారులతో కమిటీ సమీక్ష
  • 3.3 లక్షల ఎకరాలకు సాధ్యమేనని అంచనా
  • 7.3 లక్షల ఎకరాల్లో ఖాళీ చేయించాల్సిందే
  • సీఎం సమీక్ష సమావేశంలో తుది నిర్ణయం


భూపాలపల్లి, హైదరాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పోడు సమస్యకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అడవులు ఎక్కువగా ఉన్న 13 జిల్లాల్లో సమగ్ర సర్వే చేపట్టడమే కాకుండా అధికారులతో సమాచార సేకరణకు  ఉన్నతస్థాయి కమిటీని వేసింది. కమిటీలో అటవీ శాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తూ, హరితహారం ఓఎ్‌సడీ ప్రియాంక వర్గీస్‌ తదితరులు ఉన్నారు. కమిటీ ఈ నెల 20న కొత్తగూడెం, ఖమ్మం, నల్లొండ జిల్లాలో పర్యటించింది. 21న ఆదిలాబాద్‌, కొమురంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయంలో ఆరు జిల్లాల కలెక్టర్లు, డీఎ్‌ఫవోలు, ఆర్డీవోలు, ఐటీడీఏ అధికారులతో సమీక్షించారు. చివరి రోజైన 22వ తేదీన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం మధ్యాహ్నం ములుగు జిల్లా కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హల్‌లో నాలుగు జిల్లాల కలెక్టర్లు, డీఎ్‌ఫవోలు, ఆర్డీవోలు, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోడుతీరు, అడవుల్లో హరితహారం, అడవుల సంరక్షణపై జిల్లా అధికారుల నుంచి సమాచారం సేకరించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.


శుక్రవారం వరకు సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు అందించనున్నారు. పోడు సమస్య పరిష్కారంతో పాటు, కొత్త పోడు కట్టడి, హరితహారం, అటవీ సంరక్షణకు చర్యలు, అక్రమ పోడుదారుల తరలింపు అంశాలను నివేదించనున్నారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్లర్లు, అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో ఇదే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.


ముఖ్యమంత్రి హామీ నెరవేరేనా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014 వరకు పోడు చేసుకున్న గిరిజన రైతులందరికీ సాగుహక్కు పత్రాలు ఇప్పిస్తానని ఎన్నికల హామీ ఇచ్చారు. నిజానికి అటవీ హక్కుల చట్టాన్ని మార్చకుండా ఈ హామీని నెరవేర్చడం సాధ్యమయ్యే పని కాదు. ఇది కేసీఆర్‌ చేతిలో లేని వ్యవహారం. తాజాగా అటవీ భూముల్లో సాగుహక్కు కల్పించనున్న పోడు రైతులకు రైతుబంధు కూడా ఇస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం హామీలను ఎంతవరకు నెరవేర్చగలమో తేల్చేందుకు మొత్తం అధికార యంత్రాంగం రంగంలో దిగింది. 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చినపుడు దాని అమలులో భాగంగా 2006-07లో పోడు రైతుల నుంచి ఐటీడీఏ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 2005 డిసెంబరు 13 లోపు పోడు రైతు అధీనంలో పది ఎకరాల్లోపు భూమి ఉంటే సాగు హక్కు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. సుమారు 2,07,403 మంది పోడు రైతుల నుంచి దరఖాస్తులు రాగా, వీరిలో సుమారు 94,774 మంది పోడు రైతులకు వారి అధీనంలో ఉన్న 3,03,970 ఎకరాలపై సాగు హక్కులు జారీ చేశారు. 3,427 పోడు రైతుల సంఘాల నుంచి దరఖాస్తులు రాగా, 721 సంఘాలలోని సభ్యులను అర్హులుగా గుర్తించి 4,54,054 ఎకరాలపై సాగు హక్కులు కల్పించారు. మరో 89,956 మందిని అనర్హులుగా ప్రకటించారు.




21,952 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. దరఖాస్తులు తిరస్కరించిన విషయాన్ని అధికారంగా ప్రకటించాలి. మొత్తం దరఖాస్తులను పరిష్కరించి, అర్హులైన అందరు పోడు రైతులకు సాగు హక్కు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వలేదు. ఈలోగా 2006 తర్వాత మరో 7.3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొత్తగా పోడు పేరిట ఆక్రమించారని అధికారుల సర్వేలో తేలింది. 2006-07లో స్వీకరించిన దరఖాస్తుల విషయంలో సరిగా వ్యవహరించలేదు కాబట్టి అప్పటి కోటాలోనే తాజాగా దరఖాస్తులు స్వీకరించి సీఎం హామీని నెరవేర్చే యోచనలో అధికారులు ఉన్నట్లు భావిస్తున్నారు. శాటిలైట్‌ మ్యాపుల ద్వారా ఎప్పుడు పోడు చేశారన్నది నిర్ధారించి, 2005 డిసెంబరు 13 లోపు పోడు చేసిన గిరిజన  రైతులకు ఉన్నచోటే సాగు హక్కులు కల్పించి, ఆ తర్వాత పోడు చేసిన గిరిజన రైతులకు అడవి బయట ప్రభుత్వ భూముల్లో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. వీరందరికీ రైతుబంధు ఇస్తారు. ఇక పోడు బాట పట్టిన గిరిజనేతరులకు ఎలాంటి లబ్ధి చేకూర్చాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు. కాబట్టి వారికి ఎలాంటి ఊరట ఉండబోదని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది పోడు రైతులకు 3.30 లక్షల ఎకరాల భూములపై సాగు హక్కులు కల్పించడమో లేదా ప్రభుత్వ భూమిలో పునరావాసం కల్పించడమో చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ అంకె మరింత పెరిగే అవకాశం ఉంది.


రాష్ట్రంలో 7.31 లక్షల అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ నివేదికను తయారు చేసింది. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2,15,469.80 ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 94,193.98 ఎకరాలు, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 93,801 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 66,102.57 ఎకరాలు, ములుగు జిల్లాలో 62,211.26 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 27,957 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణకు గురైన అటవీ భూములను స్వాధీనం చేసుకునే వ్యూహంపై సీఎం సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-10-23T07:48:30+05:30 IST