Advertisement
Advertisement
Abn logo
Advertisement

శేషాద్రికి అంతిమ వీడ్కోలు

  • తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో అంత్యక్రియలు
  • నివాళులర్పించిన సుప్రీం సీజే
  • పాడె మోసిన చెవిరెడ్డి, భూమన
  • ఆత్మీయుడిని కోల్పోయా: ఉపరాష్ట్రపతి


తిరుపతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరమభక్తుడు, టీటీడీ ఓఎ్‌సడీ డాలర్‌ శేషాద్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హిందూ సంప్రదాయానుసారం శేషాద్రి కుటుంబం సభ్యులు తుదిక్రియలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవం కోసం ఆదివారం విశాఖకు వచ్చిన శేషాద్రి సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. పార్థివ దేహానికి ఎంబాల్మింగ్‌ చేసిన అనంతరం..తిరుపతిలోని ఆయన నివాసానికి తరలించారు. సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్న శేషాద్రి పార్థివదేహాన్ని సిరిగిరి టవర్స్‌ సెల్లార్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, రిటైర్డ్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం సహా టీటీడీ ఉద్యోగులు, అర్చకులు శేషాద్రి పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శేషాద్రిని కడసారి చూసేందుకు మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చి నివాళులర్పించారు. టీటీడీ యంత్రాంగం దగ్గరుండి శేషాద్రి అంతిమయాత్రను నిర్వహించింది. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కొద్దిసేపు పాడెను మోశారు.  కుటుంబసభ్యుల సమక్షంలో తిరుపతి హరిశ్చంద్రవాటికలో దహన సంస్కారాలు జరిపారు.


నమ్మలేకపోతున్నా:  జస్టిస్‌ ఎన్వీ రమణ

నిత్యం శ్రీవారి సేవలో తరిస్తూ ఆరోగ్యాన్ని కూడా శేషాద్రి విస్మరించారని, ఆయన కోరిక మేరకు శ్రీవారి సేవలో ఉండగానే తుదిశ్వాస విడిచారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆయన రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. శేషాద్రి లేకుండా తిరుమలకు రావడమంటే ఊహించలేనిదన్నారు. పాతికేళ్లుగా ఆయనతో తనకు అనుబంధం ఉందని, శేషాద్రి లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనలేని ఫొటో తిరుమలది కాదనిపించేలా పనిచేశారని, ఈ విషయం ఆయనకు కూడా చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా తమ కుటుంబానికి శేషాద్రి లేకపోవడం తీరనిలోటని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.


శేషాద్రి.. ధన్యజీవి: వెంకయ్యనాయుడు  

‘‘జీవితంలో చివరిరోజు కూడా శ్రీవారి సేవలోనే గడిపిన ధన్యజీవి శేషాద్రి. చాలా తక్కువ మందికి దక్కే అదృష్టమది. చిన్న ఉద్యోగంతో మొదలు పెట్టి శ్రీవారి సేవల్లో కీలక వ్యక్తిగా మారడం వరకు ఎంతో అంకితభావంతో పనిచేశారు.ఎప్పుడు తిరుమల వచ్చినా అధికారులందరూ మారేవారు గానీ, స్వామివారు, శేషాద్రి మాత్రం అక్కడే కనిపించేవారు. ఈ మధ్య మా మనవడు, మనవరాళ్లతో వెళ్లినప్పుడు వారికి ఎన్నో విషయాలను వివరించారు. ఓ ఆత్మీయుణ్ని కోల్పోయాననిపించింది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాళులర్పించారు. డాలర్‌ శేషాద్రికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాళి

డాలర్‌ శేషాద్రి పార్థివ దేహానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాళులర్పించారు.  సిరిగిరి టవర్స్‌ సెల్లార్‌లో ఉంచిన శేషాద్రి పార్ధివదేహాన్ని సందర్శించారు. పార్థివ దేహాన్ని చూస్తూ కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. అనంతరం, శేషాద్రి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.  

Advertisement
Advertisement