గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో జనవరి 18న తుది ఓటరు జాబితా

ABN , First Publish Date - 2020-09-23T08:43:39+05:30 IST

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ఖాళీ కానున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో.. ఓట రు జాబితా సవరణకు షెడ్యూల్‌ ఖరారైంది.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో  జనవరి 18న తుది ఓటరు జాబితా

అక్టోబరు 1 నుంచి జాబితా సవరణ

ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోవాల్సిందే

నేరుగా లేదా ఈసీ వెబ్‌సైట్‌ ద్వారా!


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ఖాళీ కానున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో.. ఓట రు జాబితా సవరణకు షెడ్యూల్‌ ఖరారైంది. అక్టోబరు 1న ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రారంభం కానుండగా.. 2021 జనవరి 18న తుది జాబితా ప్రకటించనున్నారు. భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) కార్యదర్శి రితేష్‌ సింగ్‌ ఈ మేరకు మంగళవారంనాడు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే షెడ్యూల్‌ను ప్రకటించారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌.రామచంద్రరావు.. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ లోగానే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ఈసీఐ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను వెలువరించింది.


గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా నమోదు కావడానికి నవంబరు 1, 2020ని అర్హత తేదీగా ప్రకటించారు.  పాత ఓటర్లు కూడా కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. గ్రాడ్యుయేట్‌, టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందేనని ఈసీఐ పేర్కొంది. అంటే, గత ఎన్నికల సమయంలో ఓటరుగా నమోదు అయినప్పటికీ ప్రస్తుత ఎన్నికలకు మళ్లీ ఓటరు(డీ నోవో)గా చేరాల్సిందే . దీంతో లక్షలాది మంది కొత్తగా ఓటర్లుగా చేరనున్నారు. దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి ఎక్కడి నుంచైనా గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్న వారు తాము నివాసమున్న ప్రాంతంలోని ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను నేరుగా ఎంఆర్‌ఓ/మునిసిపల్‌ కమిషనర్‌/జోనల్‌ కమిషనర్‌లకు అందించవచ్చు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేయవచ్చు. 


అదనపు ఎన్నికల అధికారులుగా  జీహెచ్‌ఎంసీ పరిధి కలెక్టర్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిఽధిలోకి వచ్చే జిల్లాల కలెక్టర్లను అదనపు ఎన్నికల అధికారులుగా ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి,  మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణలో వీరు అదనపు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తారు. 

Updated Date - 2020-09-23T08:43:39+05:30 IST