లాక్కుని.. గుట్టుగా అమ్మేస్తారు.. ఫైనాన్స్‌ కంపెనీల వ్యవహారం

ABN , First Publish Date - 2020-06-30T21:10:15+05:30 IST

ఆటోఫైనాన్స్‌ కంపెనీలు సీజ్‌ చేసిన వాహనాలను తిరిగి విక్రయించేప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రవాణాశాఖ కార్యాలయంలో

లాక్కుని.. గుట్టుగా అమ్మేస్తారు.. ఫైనాన్స్‌ కంపెనీల వ్యవహారం

నిబంధనలకు విరుద్ధంగా ఆటోఫైనాన్స్‌ కంపెనీల వ్యవహారం

సీజ్‌ చేసిన వాహనాలకు అనుమతులు లేకుండానే విక్రయాలు

రవాణాశాఖకు సమాచారం ఇవ్వకుండానే కొనసాగుతున్న తంతు

రిజిస్ర్టేషన్‌ సమయంలో కొనుగోలుదారులకు ఇక్కట్లు

అలాంటి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి : డీటీవో


 సిద్దిపేట (ఆంధ్రజ్యోతి): ఆటోఫైనాన్స్‌ కంపెనీలు సీజ్‌ చేసిన వాహనాలను తిరిగి విక్రయించేప్పుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రవాణాశాఖ కార్యాలయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాహనాలను అమ్ముతున్నారు. వాహనం కొనుగోలుదారుడి పేరుపై మారే విధానం గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 


సిద్దిపేట జిల్లాలోని పలు ఆటోఫైనాన్స్‌ కంపెనీలు బైక్‌లు, ఆటోలు, ఇతరత్రా వాహనాలను కొనుక్కోవడానికి రుణాలిస్తాయి. రుణగ్రహీతలు వరుసగా 5 కిస్తీలు చెల్లించకపోతే ఆయా ఫైనాన్స్‌లకు చెందిన మనుషులు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. అలా వాహనాన్ని తీసుకొచ్చినపుడు నిబంధన ప్రకారం రవాణాశాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలి. వారు పంపిన వివరాలు ఆధారంగా సదరు రుణగ్రహీతకు అధికారులు నోటీసు పంపిస్తారు. అయినా కూడా కిస్తీలు చెల్లించకపోతే వాహనాన్ని ఫైనాన్స్‌ కంపెనీ పేరిట మార్పుచేస్తారు. ఆ తర్వాత ఫైనాన్స్‌ వారు సదరు వాహనాన్ని తిరిగి అమ్ముకోవడానికి వీలుంటుంది. అలా అమ్మే ముందు పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సిద్దిపేట జిల్లాలోని చాలా ఫైనాన్స్‌ కంపెనీలు ఈ నిబంధనలను పాటించకుండా వాహనాలను సీజ్‌ చేసి గుట్టుగా తక్కువ ధరకు అమ్మేస్తున్నాయి. 


వాహనంతో పాటు ‘నో ఆబ్జెక్షన్‌’ సర్టిఫికెట్‌ మాత్రమే ఇస్తున్నారు. తాము ఇచ్చిన రుణం తిరిగొస్తేచాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాహనం కొన్న వారి పేరిట రవాణాశాఖ కార్యాలయంలో మార్పు కావడం లేదు. అనేక మంది వాహనాలను అదేవిధంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వాహనం మొదట రుణం తీసుకున్న వారి పేరిటనే కొనసాగుతున్నది. వాహన యజమాని పేరు మార్పు కావాలంటే సమస్యలు ఎదురవుతున్నాయి. ఫైనాన్స్‌ కంపెనీల వద్ద వాహనాలు కొనేప్పుటడు కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా సందర్భంలో వాహనం చోరీకి గురైనా, ప్రమాదం జరిగినా, మరేదైనా కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. 


రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేదంటున్నారు: జ్ఞానసాగర్‌, సిద్దిపేట

సిద్దిపేటలోని ఆటోఫైనాన్స్‌ కంపెనీల వద్ద బైక్‌ కొందామని వెళ్లాను. ‘‘వాహనం కోసం కొటేషన్‌ వేయండి కానీ రిజిస్ట్రేషన్‌తో సంబంధంలేదన్నారు’’. అసలు ఎఫ్‌ఆర్‌సీ కానీ ఏ పేపర్లు  కూడా ఇవ్వలేమని చెప్పారు. రవాణాశాఖ బ్రోకర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. పేరొందిన 3ఫైనాన్స్‌ కంపెనీల వద్దకు వెళ్తే ఇదే జవాబు వచ్చింది. ఏదైనా సమస్య ఉత్పన్నమైనపుడు పోలీసు విచారణ జరిగితే కేసు అవుతుందని భావించి భయపడ్డాను. 


ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం: రామేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట డీటీవో

ఆటోఫైనాన్స్‌ కంపెనీలు వాహనాన్ని సీజ్‌చేస్తే రాతపూర్వకంగా రవాణాశాఖ కార్యాలయంలో తెలియజేయాలి. వాహనం సీజ్‌ చేస్తే సదరు కంపెనీ పేరిట మారిన తర్వాతనే అమ్ముకునే అధికారముంటుంది. అందుకు విరుద్ధంగా అమ్మే వాహనాలను ఎవరూ కొనొద్దు. తక్కువ ధరకు వస్తుందని కొంటే భవిష్యత్తులో ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్‌, తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి వాహనాల విషయంలో ప్రత్యేకంగా ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2020-06-30T21:10:15+05:30 IST