Abn logo
Sep 20 2021 @ 23:52PM

ఫైనాన్స్‌ వ్యాపారి అదృశ్యం, హత్య

తిరుమల్లేశ్వరరెడ్డి (ఫైల్‌ఫొటో)

ఆలస్యంగా వెలుగులోకి


ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 20 : దొరసానిపల్లెకు చెందిన ఓ ఫైనాన్స్‌ వ్యాపారి శుక్రవారం అదృశ్యం కాగా, మండల పరిధి కొత్తపేట గ్రామంలోని ఓ ఇంటిలో హత్యకు గురై పడి ఉన్నాడు. ఈ ఉదంతం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల మేరకు... 

దొరసానిపల్లెకు చెందిన సోమేశ్వరరెడ్డి జీవనాధారం వ్యవసాయం. ఇతనికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు తిరుమల్లేశ్వరరెడ్డి (35)ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈయన ఈనెల 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం తన బైక్‌లో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. అతని కోసం వాకబు చేసిన కుటుంబసభ్యులు 19వ తేదీ శనివారం రూరల్‌ పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తిరుమల్లేశ్వరరెడ్డి కొత్తపేట గ్రామానికి చెందిన వల్లి అనే వ్యక్తికి ఫైనాన్స్‌ ఇచ్చినట్లు, ఆ డబ్బుల విషయమై వల్లి ఇంటి వద్దకు వెళ్లగా, వారి మధ్య గొడవ జరిగినట్లు సోమేశ్వరరెడ్డికి తెలిసింది. దీంతో అతను కొత్తపేటలోని వల్లి ఇంటికి వెళ్లగా, ఇంట్లో ఎవ్వరూ లేరు. తలుపు వారగా వేసి ఉంది. ఇంట్లో నుంచి వాసన వస్తుండటంతో అతను రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డీఎస్పీ ప్రసాదరావు, సీఐ మధుసూదన్‌గౌడ్‌ ఎస్‌ఐలు శివశంకర్‌, అరుణ్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వల్లి ఇంటిలోని మొదటి గదిలో ఉన్న గోనెసంచిని తెరిచి చూడగా తిరుమల్లేశ్వరరెడ్డి శవం బయటపడింది. హతుని ఒంటిపై బలమైన ఆయుధంతో గాయపరిచిన గాయాలు ఉన్నాయి. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతునికి భార్య రాజరాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇదిలా ఉండగా, తీసుకున్న అప్పు చెల్లించమని అడిగినందుకే తన కుమారుడు తిరుమల్లేశ్వరరెడ్డిని వల్లి, అతని భార్య, రాజు అనే వ్యక్తితో కలిసి హత్య చేశారని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు.