‘కరోనా’తో ముడి సరుకులకు కొరతే! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ABN , First Publish Date - 2020-02-28T07:35:08+05:30 IST

చైనాపై కరోనా ప్రభావం దీర్ఘకాలంపాటు కొనసాగితే దేశీయ పరిశ్రమలకు ముడి సరుకుల కొరత ఏర్పడవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గురువారం గువాహటిలో ‘బడ్జెట్‌ 2020-21’పై ఏర్పాటు చేసిన...

‘కరోనా’తో ముడి సరుకులకు కొరతే! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

గువాహటి: చైనాపై కరోనా ప్రభావం దీర్ఘకాలంపాటు కొనసాగితే దేశీయ పరిశ్రమలకు ముడి సరుకుల కొరత ఏర్పడవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గురువారం గువాహటిలో ‘బడ్జెట్‌ 2020-21’పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై మంత్రి స్పందిస్తూ..‘‘వచ్చే రెండు నెలల్లో పరిస్థితులు మెరుగుపడకపోతే, ముడి సరుకులకు కొరత ఏర్పడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడంతోపాటు పరిశ్రమలకు అవసరమైన సాయం చేసేందుకు కసరత్తు జరుగుతోంది’’ అని అన్నారు. దేశంలోని కీలక రంగాలకు అవసరమైన ముడి సరుకులను చైనా నుంచి విమానాల ద్వారా తెప్పించడంతోపాటు అవసరమైతే ఇతర దేశాల నుంచీ సేకరించే ఆలోచనలో ఉన్నామని బుధవారం ఓ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

ఆయా డిపార్ట్‌మెంట్ల స్థాయిలో వీటిపై కసరత్తు జరుగుతోందని, ఏ రంగానికి ఎలాంటి సా యం అవసరం అన్న విషయంపై అన్ని డిపార్ట్‌మెంట్లతో సమీక్ష జరుపుతామని మంత్రి అన్నారు. 


ఇన్వెస్టర్లపై ప్రభావం లేదు..

సీఏఏను వ్యతిరేకిస్తూ ఆయా నగరాల్లో జరుగుతున్న ర్యాలీలు, ఢిల్లీ జరుగుతున్న హింసాకాండతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ మధ్య సౌదీ అరేబియాలో పర్యటించిన సందర్భంగా తాను పలువురు ఇన్వెస్టర్లతో భేటీ కావడం జరిగిందని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి కనబర్చారని అన్నారు. 


‘తయారీ’కి తంటాలే.. 

చైనాతోపాటు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ భారత ఆర్థిక పునరుద్ధరణకు అడ్డంకిగా మారవచ్చని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ హెచ్చరించింది. చైనా దిగుమతులపై ఆధారపడి ఉన్న కంపెనీలకు సరఫరా అవాంతరాలు ఎదుర్కోవాల్సి రావచ్చని, ఈ పరిణామంతో వస్తు ధరలు ఎగబాకవచ్చని అంటోంది. వైర్‌సను అదుపులోకి తేవడం జాప్యమై, చైనా నుంచి సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోని పక్షంలో భారత తయారీ రంగానికి చెందిన చాలా కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోవచ్చని తాజా నివేదికలో పేర్కొంది. 


మైక్రోసాఫ్ట్‌ రాబడికీ గండి

కరోనా వైరస్‌  తమ ఆదాయంపైనా ప్రభా వం చూపుతోందని ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అంటోంది. కరోనా దెబ్బకు విండోస్‌ సాఫ్ట్‌వేర్‌, సర్ఫేస్‌ డివైజ్‌ల విక్రయాలు తగ్గేటట్లున్నాయన్న మైక్రోసాఫ్ట్‌.. ప్రస్తుత త్రైమాసిక ఆదాయ అంచనాల్లో కోత పెట్టింది. 


ప్రపంచ జీడీపీ 0.3 శాతం డౌన్‌

చైనాలో కరోనా వైరస్‌ విజృంభణతో ప్రపంచ జీడీపీ వృద్ధికి 0.3 శాతం లేదా 25,000 కోట్ల డాలర్ల మేర గండి పడవచ్చని దేశీయ పారిశ్రామిక మండలి ‘పీహెచ్‌డీసీసీఐ’ అంటోంది. కరోనా ప్రభావంతో కేవలం చైనా ఎగుమతులే కాకుండా ఇతర దేశాల ఎగుమతులూ క్షీణించే ప్రమాదం ఉందని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ డీకే అగర్వాల్‌ అన్నారు. వస్తు ఎగుమతుల కోసం అవసరమైన ముడి సరుకులు, ఇతర ఉత్పత్తుల కోసం ప్రపంచంలోని పలు కంపెనీలు ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతుండటం ఇందుకు కారణమన్నారు.

Updated Date - 2020-02-28T07:35:08+05:30 IST