యోగిపై నిర్మల సీతారామన్ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-08-22T02:29:35+05:30 IST

మహిళా సాధికారత కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా

యోగిపై నిర్మల సీతారామన్ ప్రశంసల జల్లు

లక్నో : మహిళా సాధికారత కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళలకు భరోసా కల్పించారన్నారు. తమకు రక్షణ ఉందనే భావం మహిళలకు కలిగేవిధంగా చేసినందుకు యోగిని మెచ్చుకున్నారు. మిషన్ శక్తి 3.0ను శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 


అప్పగించిన పనిని నిజాయితీగా చేయడం మహిళల ప్రత్యేకత అని నిర్మల సీతారామన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను యోగి ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో పంటలను నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని, మహిళా స్వయం సహాయక బృందాలు తాము పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఈ కేంద్రాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తన మంత్రివర్గాన్ని విస్తరించారని, ఈ మంత్రివర్గంలో మొత్తం 11 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 


యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు భద్రత పట్ల భరోసా కల్పించిందన్నారు. మహిళలకు భద్రత కల్పించేందుకు, వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు, శాంతిభద్రతల కోసం కృషి చేస్తున్నందుకు యోగిని అభినందించారు. ఉత్తర ప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో మహిళల పాత్ర స్పష్టంగా కనిపిస్తుందన్నారు. యోగి నేతృత్వంలోని ప్రభుత్వంలో మహిళల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్నారు. బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ప్రతి గ్రామంలోనూ బ్యాంక్ మిత్రలుగా మహిళలను నియమించడం అభినందనీయమని చెప్పారు. 


Updated Date - 2021-08-22T02:29:35+05:30 IST