నిర్మలకు స్థాన చలనం?

ABN , First Publish Date - 2020-10-10T06:15:57+05:30 IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దివంగత నేత

నిర్మలకు స్థాన చలనం?

బిహార్‌ ఎన్నికలు కాగానే కేబినెట్‌ విస్తరణ..

భారీ మార్పులకు ప్రధాని మోదీ సన్నద్ధం

బీజేపీ యువ ఎంపీలకు అందలం

బెంగాల్‌, కేరళకు పెద్ద పీట!


న్యూఢిల్లీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దివంగత నేత రాంవిలాస్‌ పాస్వాన్‌ శాఖలను వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌కు అప్పగించడంతో ఈ వాదను బలం చేకూరుతోంది. నవంబరు 10న బిహార్‌ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే ప్రధాని మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడ్తారని భావిస్తున్నారు. తాజా మార్పుల్లో బీజేపీ ఎంపీలకే ఎక్కువ అవకాశాలుంటాయని, బిహార్‌ ఫలితాలను బట్టి జేడీయూ నేతలకూ స్థానం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధాని చేపట్టే భారీ మార్పుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అదే శాఖలో ఉం టారా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిర్మల సమర్థవంతంగానే పని చేస్తున్నప్పటికీ వ్యాపార,పారిశ్రామిక, ఆర్థిక వర్గాల్లోనూ, మధ్య తరగతి, సామాన్య వర్గాల్లోనూ విశ్వాసాన్నిపొందలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పరిశ్రమలు, వ్యాపార రంగానికి విశ్వాసం కలిగించి జనాదరణ సంపాదించగల ఆర్థిక మంత్రిగా ఎవర్ని నియమించాలన్న దానిపై మోదీ, అమిత్‌ షా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరే వారిలో జ్యోతిరాదిత్య సింధియా, సురేశ్‌ ప్రభుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 


ఒకటికి మించిన శాఖల బరువు

కేంద్రమంత్రివర్గంలో పలువురు మంత్రులు ఇప్పటికే ఒక్కొక్కరు పలు శాఖలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్యం, పరిశ్రమలు, రైల్వే శాఖలను నిర్వహిస్తున్న పీయూష్‌ గోయెల్‌కు రాంవిలాస్‌ పాస్వాన్‌ నిర్వహించిన శాఖను కూడా అప్పగించారు. సృతీఇరానీ జౌళి శాఖతో పాటు మహిళా శిశు అభివృద్ధి శాఖను కూడా నిర్వహిస్తున్నారు. రవిశంకర్‌ ప్రసాద్‌ న్యాయశాఖతో పాటు కమ్యూనికేషన్లు, ఐటీ శాఖల బాధ్యతలను చేపట్టారు.ధర్మేంద్ర ప్రధాన్‌ పెట్రోలియం, సహజ వాయు శాఖతో పాటు ఉక్కు శాఖను కూడా నిర్వహిస్తున్నారు.


గ్రామీణాభివృద్ది మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వ్యవసాయం, పంచాయతీరాజ్‌ శాఖలను కూడా చేపట్టారు హర్షవర్ధన్‌ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలతో పాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు సమాచార ప్రసార శాఖను కూడా అప్పగించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మైనింగ్‌, బొగ్గు శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక్కరికి ఒక శాఖ కంటే ఎక్కువ ఇవ్వకుండా పలువురు బీజేపీ యువ ఎంపీలకు అవకాశం కల్పించడం మంచిదని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా పదవులు కోల్పోయిన వారిలో కొందరికి కేబినెట్‌లో అవకాశం లభించే అవకాశాలున్నాయి. బెంగాల్‌, కేరళ రాష్ట్రాలకు ఈసారి అధిక ప్రాధాన్యం లభించవచ్చని భావిస్తున్నారు.


వైసీపీని చేర్చుకొనే ఆలోచనే లేదు

వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుని కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే ప్రసక్తే లేదని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి స్పష్టం చేశారు. కుటుం బ, అవినీతి పార్టీగా ముద్రపడ్డ వైసీపీని ఎన్డీఏలో ఎలా చేర్చుకుంటామని ప్రశ్నించారు. ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కలుసుకోవడం సాధారణ విషయమని, దానికి రాజకీయ రంగు పులమరాదన్నా రు. బీజేపీ, జనసేన కలిసి పనిచేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాయని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ - టీడీపీలకు సమాన దూరం పాటిస్తామని చెప్పారు. 

Updated Date - 2020-10-10T06:15:57+05:30 IST