నిర్మలగారి పొరపాటు

ABN , First Publish Date - 2021-04-03T05:44:09+05:30 IST

మూడువిషయాలు ఇక్కడ గమనించాలి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకున్నట్టు అది పొరపాటున జరిగిందేమీ కాదు. ఎప్పటినుంచో కార్పొరేట్ రంగం ప్రభుత్వ నిర్వహణలోని పొదుపు ఖాతాల వడ్డీరేట్లను కూడా తగ్గించాలని....

నిర్మలగారి పొరపాటు

మూడువిషయాలు ఇక్కడ గమనించాలి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకున్నట్టు అది పొరపాటున జరిగిందేమీ కాదు. ఎప్పటినుంచో కార్పొరేట్ రంగం ప్రభుత్వ నిర్వహణలోని పొదుపు ఖాతాల వడ్డీరేట్లను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నది. సంస్కరణల విషయంలో దృఢంగా, నిర్దాక్షిణ్యంగా ఉండడానికి వెనుకాడని కేంద్రప్రభుత్వానికి ఇది ప్రియమైన విధానమే. రెండో విషయం.. ఎన్నికలలో ఎట్లాగైనా గెలుపు సాధించడానికి సామాజిక వ్యాకరణాన్ని, అంకగణితాన్ని, మిత్రలాభ మిత్రభేదాలను, రకరకాల గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించేవారు కూడా ఈ దేశ మౌలిక వాస్తవికత గురించి అవగాహన లేకుండా తప్పులో కాలేస్తారు.


చిన్నమొత్తాల పొదుపులో దేశం మొత్తం మీదనే బెంగాల్ రాష్ట్రం ముందున్నదన్న సంగతి అదే పనిగా వంగశాస్త్రాన్ని అభ్యసిస్తున్న అభినవ చాణక్యులకు తెలియదు, తెలిస్తే, ఇంకా మూడు విడతల పోలింగ్ మిగిలి ఉండగా, ఒక విడత పోలింగ్ రోజున వడ్డీరేట్లకోత ప్రకటన వచ్చి ఉండేది కాదు. మూడో విషయం- ఎన్నికలలో లాభం జరుగుతుందన్నా, కాదు, నష్టం జరుగుతుందన్నా, నాలుక కరచుకోవడానికి, అడుగు వెనక్కి వేయడానికి నిర్మల గారి పార్టీ పెద్దలు సిద్ధంగా ఉంటారు, కాకపోతే, చిన్న అధోజ్ఞాపిక ఉంటుంది. వచ్చే జూన్ వరకు మాత్రమే ఈ ఉపసంహరణ కావచ్చు. 


తమిళనటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సమయం, సందర్భం గురించి గురువారం నాడు వివాదం చెలరేగింది. బుధవారం రాత్రి చిన్నమొత్తాల పొదుపు వడ్డీ రేట్ల మీద వేటు పడింది. బెంగాల్‌లో, అస్సాంలో గురువారం ఒక విడత పోలింగ్ ఉంది కదా, వడ్డీరేట్ల కోత వల్ల జరిగే నష్టాన్ని ఎవరో పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు, వెంటనే అసంకల్పితంగా జరిగిన పొరపాటు అంటూ నిర్మల గారి ట్వీట్. ఇప్పుడు ఆలోచించవలసిన అంశం- ఎన్నికల హడావిడి తరువాత కూడా ఈ ‘ఉపసంహరణ’ కొనసాగుతుందా, లేదా ఆ నిర్ణయం అమలులోకి వస్తుందా? బుధవారం వచ్చిన ప్రకటనలో 2021-–22 ఆర్థికసంవత్సరంలోని మొదటి త్రైమాసికానికి మాత్రమే ఈ తగ్గుదలను ప్రకటించారు. ఇప్పుడు వెనక్కు తీసుకోవడం కూడా ఆ త్రైమాసికానికే కావచ్చు. అనంతర త్రైమాసికానికి ఎటువంటి ఎన్నికలు లేకపోతే, వడ్డీరేట్ల కోత తప్పదన్నమాటే. 


బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి ఉపకరణాలకు చెల్లించే వడ్డీ రేట్లను 2021 ఏప్రిల్-–జూన్ త్రైమాసికానికి 1.1 శాతం దాకా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతటి తగ్గింపు మునుపెన్నడూ జరగనిది. ఈ ఖాతాలు, డిపాజిట్లు అన్నీ మధ్యతరగతి, దిగువ తరగతుల వారికి భద్రతను, ఆదాయాన్ని అందించేవి. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది, ప్రభుత్వ సెక్యూరిటీల వడ్డీ రేట్లతో ఈ పొదుపు మొత్తాల వడ్డీ రేట్లు కూడా ముడిపడి ఉంటాయి. 2016 నుంచి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పొదుపు మొత్తాల వడ్డీరేట్లను సవరిస్తూనో, యథాతథంగానో ప్రకటిస్తూ వస్తున్నది.


ఈ తరహా ఆర్థిక ఉపకరణాలను నిర్వహించడం వల్ల తమకు నష్టం వస్తున్నదని, రుణాలు ఆశించేవారికి తగ్గురేట్లలో ఇవ్వలేకపోతున్నామని బ్యాంకింగ్ పరిశ్రమ ఎప్పటినుంచో చెబుతోంది. ఈ తరహా పొదుపుమొత్తాల నుంచి ప్రభుత్వానికి సమకూరే నిధులు తక్కువేమీకావు. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎదుర్కొన్న ద్రవ్యలోటులో 26 శాతం చిన్నతరహా పొదుపు మొత్తాల ద్వారానే భర్తీ అయింది. అయితే, ప్రభుత్వం ఆ పద్ధతిలో నిధులు సమకూర్చుకోవడం ఖరీదైన వ్యవహారమని నిపుణులు అంటారు. మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్లు పెరుగుతాయి, తగ్గుతాయి, అది సహజం- అని సంస్కరణ వాదులు అంటారు కానీ, ప్రజలు అటువంటి మార్కెట్ నిర్ణాయకతని విశ్వసిస్తారా, మార్కెట్ కూడా ప్రజల అవసరాలకు, పరిమితులకు సున్నితంగా స్పందిస్తుందా- అన్నవి ప్రశ్నలు.


ప్రభుత్వ సెక్యూరిటీల వడ్డీరేట్లు మార్కెట్ ఆధారితంగా స్పందిస్తాయని చెబుతారు కానీ, రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల ట్రేడింగ్‌ను పూర్తిగా తన అదుపులో నిర్వహిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ, నిపుణులు ఎట్లా భావించినప్పటికీ, అసంఖ్యాకులైన ప్రజలు పొదుపు అవకాశాలను దూరం చేస్తే సమ్మతించరని ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే తెలియజెబుతోంది. ఓటర్లు కానే కాదు, పొదుపరులు, మదుపరులుగా కూడా ప్రజలు ఇటువంటి నిర్ణయాన్ని హర్షించరు. ప్రభుత్వ పథకాల నుంచి, ఖాతాల నుంచి పొదుపు మొత్తాలను ప్రజలు ఉపసంహరించుకుంటే, మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. పొదుపు ఖాతాలు ప్రభుత్వానికి కూడా అత్యావశ్యకమైనవే అని గుర్తించాలి. 


అయితే జూదం వంటి పెట్టుబడులు పెట్టడం, లేదంటే ఖర్చు పెట్టడం తప్ప జాగ్రత్తపరులైన మధ్య, స్వల్పాదాయ వర్గాలకు మరో అవకాశం లేకుండా చేయడం మంచిది కాదు. అట్లాగని, పొదుపు మొత్తాల వల్ల అధిక వడ్డీ ప్రయోజనాలను అందుకుంటున్నవారంతా పేదలూ మధ్యతరగతి మాత్రమే అని కాదు. అధికాదాయవర్గాలు, సంపన్నులు అధిక వడ్డీ రాబడిని, పన్ను రాయితీలను ఎక్కువగా అనుభవిస్తూ ఉండవచ్చు. అటువంటి అతివ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవచ్చును కానీ, మొత్తంగా పొదుపునే ఖరీదు చేస్తే ఎట్లా?

Updated Date - 2021-04-03T05:44:09+05:30 IST