సుంకాల పెంపుతో ఆర్థిక మోక్షం

ABN , First Publish Date - 2020-10-27T05:46:20+05:30 IST

జీవనోల్లాసాన్ని ఏ మహమ్మారులూ అడ్డుకోలేవు. 2020 సెప్టెంబర్‌లో 2019 సెప్టెంబర్‌లో కంటే మోటారు సైకిళ్ళ విక్రయాలు 12 శాతం...

సుంకాల పెంపుతో ఆర్థిక మోక్షం

జీవనోల్లాసాన్ని ఏ మహమ్మారులూ అడ్డుకోలేవు. 2020 సెప్టెంబర్‌లో 2019 సెప్టెంబర్‌లో కంటే మోటారు సైకిళ్ళ విక్రయాలు 12 శాతం, చిన్న కారుల అమ్మకాలు 18 శాతం, ట్రాక్టర్ల కొనుగోళ్ళు 75 శాతం పెరిగాయి. కొవిడ్ విపత్తుతో ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కుదేలయిపోయిన దిగాలు పరిస్థితుల్లో, ఆటోమోబైల్ రంగంలో సంభవించిన వ్యాపారోత్సాహం ప్రభుత్వానికి విశేష సంతృప్తి కలిగించి ఉంటుందనడంలో సందేహం లేదు. 


మరి మన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ సజావుగా ముందుకు సాగుతున్నట్టేనా? లేదు. లేదనే ఆర్థిక నిపుణులు గట్టిగా చెబుతున్నారు, కాదు, హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల అంటే స్థూల దేశియోత్పత్తి (జీడీపీ) వృద్ధి 5 శాతం మేరకు సంకోచించనున్నట్టు 2020 జూన్‌లో ఆర్థిక కార్యకలాపాల అధ్యయన సంస్థలు అనేకం అంచనా వేశాయి. అవే సంస్థలు ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి 10 శాతం మేరకు కుదించుకుపోనున్నట్టు స్పష్టం చేస్తున్నాయి! 


మరి నిపుణుల మదింపులు నిజమయితే వాహనాల విక్రయాలు ఎలా పెరుగుతున్నాయి? ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నా అభిప్రాయమేమిటంటే, కొవిడ్ ఉపద్రవం కారణంగా బస్, మెట్రో, సబర్బన్ ట్రైన్ సర్వీస్‌లు అందుబాటులో లేకపోవడంతో పట్టణ, నగర వాసులు ప్రయాణ దురవస్థల నుంచి బయటపడేందుకు మోటార్ సైకిళ్లు, చిన్నకారులను కొనుగోలు చేసుకొంటున్నారు. అలాగే రైతులు కూడా ట్రాక్టర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూలీల కొరత సమస్యను అధిగమించేందుకేనని చెప్పవచ్చు. కార్చిచ్చులా వ్యాపిస్తున్న కొవిడ్ వ్యాధి నుంచి తప్పించుకునేందుకు ఉన్నపళాన సుదూర స్వస్థలాలకు వెళ్ళిపోయిన వలస కార్మికులు తిరిగి తమ ఆతిథేయి రాష్ట్రాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటు నందివ్వకపోవడం వల్లే రైతులకు వ్యవసాయ కూలీల సమస్య ఏర్పడింది. ఏమయితేనేం వాహనాల వాణిజ్యం ఊపందుకుంది. అయితే ఈ ఆశావహ పరిణామాన్ని ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సూచనగా భావించడం పెద్ద పొరపాటు అవుతుంది. 


స్థూల దేశియోత్పత్తి సంకోచిస్తున్న వాస్తవం ప్రభుత్వానికి బాగా తెలుసు. ఈ వైపరీత్యాన్ని నిరోధించేందుకే వినియోగదారులు, వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున రుణాలు అందించేలా బ్యాంకులను ప్రోత్సహించింది. పౌరులు, పారిశ్రామిక వేత్తల చేతుల్లో నగదు నిండుగా ఉంటే మార్కెట్ లో డిమాండ్ ( వినియోగదారు తనకు కావాల్సిన వస్తువులను కొనాలనే కోరికనూ, కొనుగోలు శక్తినీ కలిగి ఉండడమే డిమాండ్) సృష్టి, పెంపుదలకు దోహదం జరుగుతుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. 


ప్రభుత్వ విశ్వాసం ఒక ప్రామాణిక ఆర్థిక సూత్రం. అయితే వ్యాపార దిగ్గజాలు, వినియోగదారులు తీసుకునే రుణాల మధ్య ఒక మౌలిక వ్యత్యాసం ఉంది. మదుపుదారులు తాము తీసుకున్న రుణాలతో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తారు లేదా దుకాణాలను ప్రారంభిస్తారు లేదా ట్రక్కులను కొనుగోలు చేస్తారు. ఈ మదుపుల నుంచి వ్యాపారస్తులకే గాక దేశానికీ అదనపు ఆదాయం సమకూరుతుంది. రుణగ్రహీత తనకు లభించిన ఆదాయం నుంచి వడ్డీతో పాటు అసలు మొత్తంలో కొంత భాగాన్ని బ్యాంకుకు చెల్లిస్తాడు. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు బ్యాంకు నుంచి పది లక్షల రూపాయల రుణం తీసుకుంటాడు. ఆ సొమ్ముతో అతడు చేసిన మదుపుల నుంచి మూడు లక్షల రూపాయల రాబడి లభిస్తుంది. ఈ అదనపు ఆదాయంలో ఒక లక్షను వడ్డీ చెల్లించేందుకు, మరో లక్ష రూపాయలు అసలు (ప్రిన్సిపల్)ను చెల్లిస్తాడు. అతనికి ఇంకా ఆ అదనపు ఆదాయంలో 1 లక్ష రూపాయలు మిగులుతుంది. ఆ లక్ష రూపాయలను తదుపరి సంవత్సరంలో కొత్తగా మదుపు చేస్తాడు. ఇప్పుడు అతని మొత్తం మదుపు పది లక్షల రూపాయల నుంచి 11 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఈ కొత్త మదుపూ మరింత అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుంది. 


వినియోగదారు తీసుకునే రుణంతో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రుణం నుంచి అదనపు ఆదాయం రాదు. ఒక ఫ్రిజ్‌ను కొనుగోలు చేసినందు వల్ల కొత్త రాబడి వస్తుందా? రాదు. ఉదాహరణకు ఒక గృహిణి ఒక బ్యాంకు నుంచి పది లక్షల రూపాయల రుణం తీసుకొంటుంది. ఆ సొమ్మునుంచి ఒక లక్షను వడ్డీ కింద, మరో లక్ష రూపాయలు అసలు మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించేందుకు వినియోగిస్తుంది. ఫలితంగా ఆమెకు అందుబాటులో ఉన్న నగదు రెండు లక్షలు తగ్గిపోతుంది. మరుసటి సంవత్సరం కొత్త కొనుగోళ్ళకు ఆమె వద్ద 8 లక్షల రూపాయలు మాత్రమే ఉంటుంది. పదిలక్షల రుణంపై వడ్డీని చెల్లించడంతో పాటు అసలును కూడా ఆమె చెల్లించవలసివుంటుంది. ఆర్థిక వ్యవస్థ కులేలయిపోయిన కారణంగా ఇప్పటికే ఎంతో మంది ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో వినియోగ రుణాన్ని తీసుకోవడం ద్వారా ఆదాయంలో తగ్గుదలకు వారు ఇష్టపడరు. ఇటువంటి రుణాల పంపిణీ వల్ల ఆర్థిక వ్యవస్థకు తక్షణ లబ్ధి సమకూరుతుందనడంలో సందేహం లేదు. ప్రేరక ద్రవ్యాల (స్టెరాయిడ్స్) వల్ల ఆవు తప్పకుండా ఎక్కువ పాలును ఇస్తుంది. అయితే ఆ స్టెరాయిడ్స్ ఆవు ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి. అలాగే వినియోగ రుణాలు లబ్ధిదారులకు తక్షణ ప్రయోజనాలను నెరవేర్చినా దీర్ఘకాలంలో అవి వారికి తీవ్ర సమస్యలుగా పరిణమిస్తాయి.


మార్కెట్‌లో డిమాండ్ పెంచేందుకు మరో పద్ధతి ఉంది. ప్రభుత్వమే భారీ రుణం తీసుకుని, అందులో కొంత సొమ్మును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలలో జమ చేయడమే ఆ తరుణోపాయం. ఈ ఆకస్మిక ద్రవ్యలాభంతో తమకు కావలసిన వస్తువులను చేసుకోనివారు ఎవరు ఉంటారు? మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదలకు ప్రభుత్వ వితరణ తప్పకుండా తోడ్పడుతుంది. దిగుమతులపై సుంకాల వసూళ్ళ ద్వారా ప్రభుత్వానికి లభించే ఆదాయం వాటా సర్కార్ మొత్తం రాబడిలో క్రమంగా తగ్గిపోతోంది. ఆరేళ్ళ క్రితం 18 శాతంగా ఉన్న ఈ ఆదాయ వాటా ఇప్పుడు 12 శాతానికి తగ్గిపోయింది. సుంకాలను తగ్గించడం ద్వారా దిగుమతులను ప్రభుత్వం ఇతోధికంగా పెంచుతోంది! 


ఈ సందర్భంగా మనం ఒక వాస్తవాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) లో భాగస్వామిగా ఉన్న మన దేశం సగటు దిగుమతి సుంకాలను 48 శాతానికి మించి పెంచకూడదనే షరతుకు నిబద్ధమయింది. అయితే ఇప్పుడు మనం వసూలు చేస్తున్న సగటు దిగుమతి సుంకాల రేటు 20 శాతం కంటే తక్కువే! మరి దిగుమతి సుంకాలను పెంచడం వల్ల మన ప్రయోజనాలకు హాని జరుగుతుందా? జరగదు. డబ్ల్యుటిఓ నుంచి ఎటువంటి ఆక్షేపణలు, అభ్యంతరాలు రావు. ప్రపంచ దేశాల నుంచి ఎటువంటి అవరోధాలు ఉండబోవు. కనుక మనం దిగుమతి సుంకాలను పెంచి తీరాలి. ఇప్పుడున్న సగటు రేటును 20 నుంచి 40 శాతానికి అవశ్యం పెంచాలి. 


దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి ఇటీవల వరకు 170 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుండేది. దిగుమతి సుంకాలను రెట్టింపు చేయడం వల్ల జరిగేదేమిటి? నిస్సందేహంగా దిగుమతులు తగ్గుతాయి. తత్ఫలితంగా దిగుమతి సుంకాల తో లభించే ఆదాయం రెట్టింపు కంటే తక్కువగా ఉంటుంది. దిగుమతి సుంకాలను 20 నుంచి 40 శాతానికి పెంచడం వల్ల అదనంగా మరో 170 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించక పోవచ్చు గానీ, నా అంచనా ప్రకారం 150 లక్షల కోట్ల రూపాయల కొత్త రాబడి తప్పక లభిస్తుంది. దిగుమతి సుంకాల పెంపు వల్ల లభించే ఈ అదనపు ఆదాయాన్ని దేశ ప్రజలకు సమస్థాయిలో పంపిణీ చేయాలి. 135 కోట్ల మంది పౌరులకు ఏటా రూ.1100 చొప్పున లేదా ఒక్కో కుటుంబానికి రూ.5500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఈ డబ్బుతో వారు తమకు అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటారు. ఈ క్రమంలో మార్కెట్‌లో డిమాండ్ పెరగకుండా ఉంటుందా? డిమాండ్ పెరిగినప్పుడు ఉత్పత్తి పెరగాలి కదా. ఉత్పత్తి పెరిగినప్పుడు కొత్త ఉద్యోగాల సృష్టి అనివార్యం. ఈ సానుకూల పరిస్థితుల్లో ఆర్థికం మళ్ళీ ఉరకలు వేయడం ఖాయం. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-10-27T05:46:20+05:30 IST