గృహ నిర్మాణంతో ఆర్థిక భరోసా

ABN , First Publish Date - 2021-06-15T04:58:41+05:30 IST

గృహ నిర్మాణంతో ఆర్థిక భరోసా దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సీహెచ్‌ శ్రీరంగనాథ్‌రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణంపై జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పెద్దఎత్తున 30.60లక్షల ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నాం. మొదటి దశలో 15.30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. ఇళ్లు నిర్మిస్తే బిల్లులు రాదు అనే సంశయం అవసరం లేదు. ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశాం. గతంలో ఉన్న బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తున్నా’మని మంత్రి తెలిపారు.

గృహ నిర్మాణంతో ఆర్థిక భరోసా
సమావేశంలో మాట్లాడుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ్‌రాజు

 జిల్లాలో తొలిదశలో 90,716 ఇళ్లు

 దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే అర్హులకు పట్టాలు 

 గృహనిర్మాణ శాఖ మంత్రి సీహెచ్‌ శ్రీరంగనాథ్‌రాజు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 14)

గృహ నిర్మాణంతో ఆర్థిక భరోసా దక్కుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి సీహెచ్‌ శ్రీరంగనాథ్‌రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణంపై జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పెద్దఎత్తున 30.60లక్షల ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నాం. మొదటి దశలో 15.30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. ఇంతపెద్ద కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతం. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా 17వేల జగనన్న కాలనీలు నిర్మిస్తున్నాం. ప్రతి కాలనీలో భూగర్భ డ్రైనేజీ విధానం, విద్యుత్తు, ఏపీ ఫైబర్‌, పాఠశాలలు, పార్కులు, పార్కింగ్‌ స్థలాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కాలనీలలో ఇళ్ల నిర్మాణం ఒకేసారి ప్రారంభించి ఒకేసారి పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 20 నుంచి 25 గృహాలను ఒక క్లస్టర్‌గా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి కాలనీకి ఒక మండల స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమిస్తాం. ఇళ్లు నిర్మిస్తే బిల్లులు రాదు అనే సంశయం అవసరం లేదు.  ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేశాం. గతంలో ఉన్న బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తున్నా’మని మంత్రి తెలిపారు.  

 

 90 రోజుల్లోగా పట్టాలు జారీ....

‘సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా అర్హులకు పట్టాలు జారీ చేస్తాం.  జిల్లాలో తొలిదశలో 90,716 గృహాలకు  శంకుసప్థాన చేశాం’ అని మంత్రి శ్రీరంగనాథ్‌రాజు తెలిపారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు.  విద్యుత్‌ కనెక్షన్లు త్వరగా ఏర్పాటు చేస్తే నిర్మాణాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ‘ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు వస్తే.. నిర్మాణ సామగ్రిని సరసమైన ధరలకే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. నిర్మాణాలు చేపడితే సొంత గ్రామంలోనే మరింత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. బిల్లులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమవుతాయి. రాష్ట్రస్థాయిలో గృహ నిర్మాణాల్లో సిక్కోలు ముందుండాలి’ అని మంత్రి ఆకాంక్షించారు. 

- ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. గత కలెక్టర్‌ నివాస్‌ బాగా పనిచేశారని కొనియాడారు. ప్రస్తుత కలెక్టర్‌  శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మరింత బాగా పనిచేస్తారని ఆకాంక్షించారు.   

- మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమం విజయవంతంగా చేపట్టాలని  సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు నిర్మించడమన్నద చారిత్రకమన్నారు. గృహ నిర్మాణంలో జిల్లాను రాష్ట్రస్థాయిలో తొలిస్థానంలో నిలపాలని ఆయన కోరారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ హిమాంశుకౌశిక్‌లు  జిల్లాలో గృహ నిర్మాణాల వివరాలు వెల్లడించారు.  సమావేశంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, హౌసింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరత్‌గుప్తా, జేసీలు సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-15T04:58:41+05:30 IST