అప్పుల కుప్ప!

ABN , First Publish Date - 2020-04-08T09:19:03+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఏకంగా రూ.77,000 కోట్లు అప్పు చేసింది.

అప్పుల కుప్ప!

మార్చి 31తో ముగిసిన 

ఆర్థిక ఏడాదిలో 77 వేల కోట్ల అప్పు

బ్యాంకు, బహిరంగ రుణాలు, 

ఉద్యోగుల నిధులు వాడుకున్న వైనం

మొత్తం ఖర్చు రూ.1.87 లక్షల కోట్లు

ఆదాయం రూ.1.10 లక్షల కోట్లు

అయినా బడ్జెట్‌ అంచనాలకు దూరమే


అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఏకంగా రూ.77,000 కోట్లు అప్పు చేసింది. వివిధ కార్పొరేషన్లు, బ్యాంకులు, బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాలు, ప్రభుత్వ ఉద్యోగుల నిధులు కలిపి రూ.77,000 కోట్లను అప్పురూపంలో వినియోగించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వివిధ రూపాల్లో చేసిన ఖర్చు మొత్తం రూ.1.87 లక్షల కోట్లు. వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం రూ.1.10 లక్షల కోట్లు. ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసంగా ఉన్న రూ.77,000 కోట్లను ప్రభుత్వం అప్పు రూపంలో తెచ్చుకుంది.


ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దీనిలో వివిధ కార్పొరేషన్ల ద్వారా  తెచ్చిన మొత్తం రూ.16,000 కోట్లు, బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ బాండ్ల వేలం ద్వారా రూ.45,000 కోట్లు, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న ఉద్యోగుల నిధులు, ఇతర నిధుల నుంచి రూ.16 వేల కోట్లు వినియోగించినట్టు అధికారులు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంకంటే 2019-20లో ఆదాయం దాదాపు రూ.4,000 కోట్లకు పైగా తగ్గినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. అయినప్పటికీ 2019-20లో అప్పులు ఎక్కువ చేయడం వల్ల అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంటే రూ.30,000 కోట్లు అధికంగా ఖర్చు పెట్టగలిగామని తెలిపారు. చివరి త్రైమాసికంలో అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతులివ్వడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని స్వల్పంగా పెంచడంతో అప్పు తెచ్చుకోవడం సాధ్యపడిందని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు.


చివరి త్రైమాసికంలో దాదాపు రూ.15,000 కోట్లు బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పు తీసుకురాగలిగినట్టు పేర్కొన్నారు. ఇంత భారీస్థాయిలో అప్పులు చేసినప్పటికీ ఖర్చు విషయంలో బడ్జెట్‌ అంచనాను చేరుకోలేకపోయామని తెలిపారు. 2019-20 బడ్జెట్‌లో ఖర్చు రూ.2.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు. కానీ, రూ.1.87 లక్షల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేయగలిగింది. వాస్తవిక ఖర్చుకి, బడ్జెట్‌ అంచనాకు రూ.47,000 కోట్ల వ్యత్యాసం ఉంది. 





Updated Date - 2020-04-08T09:19:03+05:30 IST