రూ.150 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-09-22T06:23:38+05:30 IST

అధికారిక బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా అక్రమ సొమ్ము దర్జాగా చేతులు మారుతోంది. లక్స్‌ లీక్స్‌, స్విస్‌ లీక్స్‌, పనామా పేపర్స్‌, పారడైజ్‌ పేపర్స్‌ గతంలో ఈ విషయాన్ని బట్టబయలు చేశాయి. ఇందుకు సంబంధించి తాజాగా మరో వ్యవహారం వెలుగుచూసింది...

రూ.150 లక్షల కోట్లు

1999-2017 మధ్యలో బ్యాంక్‌ల ద్వారా చేతులు మారిన అక్రమ సొమ్ము  

జాబితాలో హెచ్‌ఎస్‌బీసీ, డాయిష్‌ సహా పలు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజాలు 

భారత బ్యాంక్‌ల ద్వారానూ లావాదేవీలు

ఫిన్‌సెన్‌ ఫైల్స్‌ను బయటపెట్టిన ఐసీఐజే 


అధికారిక బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా అక్రమ సొమ్ము దర్జాగా చేతులు మారుతోంది. లక్స్‌ లీక్స్‌, స్విస్‌ లీక్స్‌, పనామా పేపర్స్‌, పారడైజ్‌ పేపర్స్‌ గతంలో ఈ విషయాన్ని బట్టబయలు చేశాయి. ఇందుకు సంబంధించి తాజాగా మరో వ్యవహారం వెలుగుచూసింది. అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇదే అతిపెద్ద డేటా లీక్‌ అని విశ్లేషకులంటున్నారు. 



న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలి్‌స్ట్స (ఐసీఐజే) తాజా దర్యాప్తులో మరో ఆర్థిక అక్రమాల వ్యవహారం బయటపడింది. 1997-2017 మధ్యకాలంలో ప్రపంచ దేశాల్లోని పలు బ్యాంక్‌ల ద్వారా 2 లక్షల కోట్ల డాలర్లకు (దాదాపు రూ.150 లక్షల కోట్లు) పైగా చట్ట విరుద్ధ సొమ్ము చేతులు మారినట్లుగా తెలిసింది. హెచ్‌ఎ్‌సబీసీ, డాయిష్‌ బ్యాంక్‌, జేపీ మోర్గాన్‌ సహా పలు అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజాల ద్వారా ఈ లావాదేవీలు జరిగనట్లు ఐసీఐజే దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు, భారత బ్యాంక్‌ల ద్వారానూ పలు లావాదేవీలు  జరిగాయిట. ఐసీఐజేలో 88 దేశాలకు చెందిన 110 వార్తా సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.   అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫైనాన్షియల్‌ క్రైమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నెట్‌వర్క్‌ (ఫిన్‌సెన్‌)కు బ్యాంక్‌లు రిపోర్టు చేసిన అనుమానాస్పద కార్యకలాపాల (సస్పీషియస్‌ యాక్టివిటీ రిపోర్ట్‌) ఫైల్స్‌ను విశ్లేషించడం ద్వారా ఐసీఐజే ఈ విషయాన్ని బయటపెట్టింది. 2,657 ఫిన్‌సెన్‌ ఫైల్స్‌ను చేజిక్కించుకున్న బజ్‌ఫీడ్‌ అనే న్యూస్‌ వెబ్‌సైట్‌.. ఐసీఐజేతో పంచుకుంది. 


ఫిన్‌సెన్‌ గురించి.. 

అమెరికా ట్రెజరీ శాఖలో ఆర్థిక మోసాలు, అక్రమ లావాదేవీలపై నిఘా వేసే విభాగమే ఫిన్‌సెన్‌. మనీలాండరింగ్‌, తీవ్రవాదం, డ్రగ్స్‌కు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక మోసాలకు సంబంధించి అమెరికన్‌ డాలర్లలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను బ్యాంక్‌లు ఫిన్‌సెన్‌కు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. లావాదేవీలు అమెరికాకు అవతల జరిగినా సరే, బ్యాంక్‌లు ఫిన్‌సెన్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే, ఈ లావాదేవీలను తప్పు జరిగిందనడానికి ఆధారంగా భావించలేం. 


భారత్‌కూ లింకు!

ఫిన్‌సెన్‌కు రిపోర్ట్‌ చేసిన వాటిలో పలు లావాదేవీలు భారత బ్యాంక్‌ల ద్వారానూ జరిగినట్టు ఐసీఐజే దర్యాప్తులో వెల్లడైంది. ఎస్‌బీఐ సహా దేశంలోని పలు బ్యాంక్‌ల  (ప్రభుత్వ, ప్రైవేట్‌, విదేశీ) ద్వారా 406 లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఫిన్‌సెన్‌కు మన బ్యాంక్‌లు రిపోర్ట్‌ చేసిన ప్రకా రం.. 2000-17 మధ్యకాలంలో విదేశాల నుంచి భారత బ్యాంకింగ్‌ శాఖలకు బదిలీ అయిన అనుమానాస్పద సొమ్ము 48,21,81,226 డాలర్లు. మన కరెన్సీలో రూ. 3,616 కోట్ల పైమాటే. భారత బ్యాంక్‌ల నుంచి విదేశాలకు బదిలీ చేసిన సొమ్ము 40,62,78,962 డాలర్లు. మన కరెన్సీలో రూ. 3,047 కోట్ల పైమాటే.




ఏయే బ్యాంక్‌ల ద్వారా.. 

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీం ద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌, స్టాన్‌చార్డ్‌ భారత విభాగం, అలహాబాద్‌ బ్యాంక్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, డాయిష్‌ బ్యాంక్‌ భారత విభాగం, యూకో బ్యాంక్‌, కర్ణాటక బ్యాంక్‌, ఆర్‌బీఎస్‌, ఆంధ్రా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌.

Updated Date - 2020-09-22T06:23:38+05:30 IST