నిపుణులపై బురద చల్లొద్దు: రైతులకు సుప్రీంకోర్టు ఉద్బోధ

ABN , First Publish Date - 2021-01-20T20:27:05+05:30 IST

వ్యవసాయ చట్టాలపై స్టే ఇస్తూ రైతు సమస్యల పరిష్కారానికి ఇటీవల తాము ఏర్పాటు చేసిన..

నిపుణులపై బురద చల్లొద్దు: రైతులకు సుప్రీంకోర్టు ఉద్బోధ

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై స్టే ఇస్తూ రైతు సమస్యల పరిష్కారానికి ఇటీవల తాము ఏర్పాటు చేసిన కమిటీని అనర్హమైనదిగా ఎలా అంటారంటూ రైతు సంఘాలను సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారంనాడు గట్టిగా నిలదీసింది. కమిటీ ముందు హాజరు కారాదని రైతు సంఘాలు అనుకుంటే అలాగే చేయొచ్చని, అంతేకానీ నిపుణులపై బురద చల్లొద్దని సూచించింది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా గణతంత్ర దినోత్సవం నాడు రైతులు తలబెట్టిన ట్రాక్టర్ ర్యాలీపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం, ఇదే సమయంలో రైతు సంఘాలపై కీలక వ్యాఖ్యలు చేసింది.


'కమిటీలోని సభ్యులు పక్షపాతం ఉన్నవాళ్లను మీరెలా చెబుతారు? వాళ్లని అనర్హులని ఎలా అంటారు? పక్షపాతంతో వ్యవహరించడానికి వాళ్లకి తీర్పునిచ్చే అధికారం ఉందా?' అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ ముందు హాజరు కారాదనుకుంటే అలాగే చేయవచ్చని, అంతేకానీ వ్యవసాయరంగంలో ఎంతో పేరు, నైపుణ్యం ఉన్న కమిటీ సభ్యులపై మాత్రం బురద చల్లే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. గతంలో వారు తమ అభిప్రాయాలు చెప్పి ఉండొచ్చని, అంతమాత్రాన వారిపై బురద చల్లడం సరికాదని, కమిటీ ముందు హాజరు కారాదనుకుంటే అలాగే చేయవచ్చని పేర్కొంది. వ్యవసాయ చట్టాల అమలుపై స్టే ఇవ్వడంతో పాటు రైతు సమస్యల వినేందుకు కమిటీ ఏర్పాటు చేసినందున ఆందోళన చేస్తున్న రైతులు రోడ్ల దిగ్బంధాలకు స్వస్తి చెప్పాలని సూచించింది. రైతు సంఘాల తరఫున హాజరైన ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం మినహా దేనికీ రైతులు సుముఖంగా లేరని, అప్పుడే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారని కోర్టుకు విన్నవించారు.

Updated Date - 2021-01-20T20:27:05+05:30 IST