Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 03:27AM

పని ఇవ్వకుంటే అధికారికి ఫైన్‌..!

  • ఆ నిధులతో కూలీకి నిరుద్యోగ భృతి
  • ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు
  • ఇకపై గ్రామం యూనిట్‌గా పనులకు చర్యలు
  • నేటి నుంచి ఎన్‌ఐసీలో ఉపాధి వివరాల నమోదు


హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులకు కేంద్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి పని కావాలని కోరితే.. ఆ కూలీకి వారం రోజుల్లో ఉపాధి కల్పించాలి. అధికారులు నిర్లక్ష్యం చేసినా.. పని కల్పించకపోయినా.. జరిమానా తప్పదు. దాని నుంచి ఆ కూలీకి నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిర్వహణ కోసం ప్రవేశపెట్టిన కొత్త సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి పనులు గుర్తించడం, మార్పులు చేర్పుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించిన కేంద్రం.. ఇకపై పూర్తిస్థాయిలో అజమాయిషీ చేసేందుకు సాంకేతికపరమైన మార్పులు చేపట్టింది.


ఉపాధి హామీ కింద చేపట్టిన అన్ని పనులపై నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షణ చేయనుంది. అందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా ఉపాధి పనుల నిర్వహణను గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధీనంలోని ఎన్‌ఐసీ(నేషనల్‌ ఇన్ఫర్మేటివ్‌ సెంటర్‌) ద్వారా కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రాగా్‌స(రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సమాచారం) సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి పనుల నిర్వహణ చేసుకుంటూ పోయేది. ఈ పనులు కేంద్రం పరిధిలోని ఎన్‌ఐసీకి కనిపించవు. చివరి దశలో మాత్రమే రాగాన్‌ నుంచి ఎన్‌ఐసీకి ఆ వివరాలను మళ్లిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేస్తూ కేంద్రం దేశం మొత్తాన్నీ ఒకే సాఫ్ట్‌వేర్‌ కిందకు తీసుకువచ్చింది. 


గ్రామం యూనిట్‌గా..

కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త విధానం ప్రకారం.. ఇక నుంచి గ్రామం యూనిట్‌గా మాత్రమే ఉపాధి పనులు జరగనున్నాయి. ముందుగా గ్రామంలో 100 రోజుల్లో ఎలాంటి పనులు చేపట్టాల్సి ఉంటుందో గ్రామ సభ ద్వారా తీర్మానించి, క్షేత్రస్థాయిలోకి వెళ్లి నిర్ధారించుకోవాలి. అలాంటి పనులనే రోజూ కూలీలతో పూర్తి చేయాలి. కూలీలు చేయగలిగే పనులనే మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద నిర్వహించాల్సి ఉంటుంది. వారి అంగీకారంతోనే అలాంటి పనులు మంజూరు చేయాలి. వారికి ఇష్టం లేకుంటే మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఈ ప్రక్రియతో ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు వేదికలు, సేంద్రియ ఎరువుల తయారీ షెడ్లు, పొలాల్లో కల్లాలు, వైకుంఠధామాల నిర్మాణం వంటి పనులకు గండి పడనుంది. కాగా, ఇన్నాళ్లు ఒక గ్రామంలో కూలీలు తక్కువ మంది పనిచేసినా జిల్లా యూనిట్‌గా ఉండటంతో సంఖ్యను ఎక్కువగా చూపేవారు. ఇప్పుడు గ్రామం యూనిట్‌గానే ఉపాధి పనులకు ఆస్కారం కల్పించనున్నారు. 


నేటి నుంచి ఎన్‌ఐసీలో నమోదు..

మన రాష్ట్రంలో రాగాస్‌ ద్వారా కాకుండా శనివారం నుంచి కేంద్రం నిర్ణయించిన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి పనుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. మన రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభిస్తున్నప్పటికీ.. దీనిపై అవగాహన రావాల్సి ఉందని, పిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు సంబంధిత విభాగాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు రాగాస్‌ ద్వారా మంజూరు చేసిన ఉపాధి పనులు, వాటికి సంబంధించి బిల్లులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కూలీలకు అందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థకు కేంద్రం గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఇటీవలి కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు భారీగా డిమాండ్‌ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో కూలీలకు నష్టం కలగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Advertisement
Advertisement