ఆస్పత్రులకు జరిమానా

ABN , First Publish Date - 2021-06-22T05:14:17+05:30 IST

కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలుచేసిన ఆస్పత్రులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ కొరడా ఝలిపించింది.

ఆస్పత్రులకు జరిమానా

కొవిడ్‌ బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారని ఫిర్యాదులు

నగర పరిధిలోని మూడింటికి రూ.17 లక్షలు

బాధితులకు రూ.13.61 లక్షల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా డీడీసీ ఆదేశం


విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలుచేసిన ఆస్పత్రులపై జిల్లా క్రమశిక్షణ కమిటీ కొరడా ఝలిపించింది. జరిమానా విధించడంతోపాటు బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్‌ బాధితుడి నుంచి భారీ మొత్తంలో ఫీజు వసూలుచేసిన పినాకిల్‌ ఆస్పత్రికి రూ.10 లక్షలు జరిమానా విధించడంతోపాటు రోగికి మరో పది లక్షల రూపాయలు నష్ట పరిహారాన్ని చెల్లించాలని యాజమాన్యాన్ని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. సోమవారం జరిగిన డిస్ర్టిక్‌ డిసిప్లినరీ కమిటీ (డీడీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పినాకిల్‌ ఆస్పత్రి యాజమాన్యం వైరస్‌ బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించకుండా దాచిపెట్టడంతోపాటు ఒక రోగి వద్ద నుంచి భారీగా ఫీజులు వసూలుచేసినట్టు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించిన కమిటీ వాస్తవమేనని నిర్ధారణ కావడంతో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఇదేవిధంగా  ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి రూ.4.39 లక్షల జరిమానా విధించారు. కొవిడ్‌ నోటిఫైడ్‌ ఆస్పత్రి కాకుండా, ఆరోగ్యశ్రీ  లబ్ధిదారుడు అయినప్పటికీ ఉచితంగా వైద్య సేవలు అందించకుండా భారీగా ఫీజులు వసూలుచేసినందుకు ఆదిత్య ఆస్పత్రికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించడంతోపాటు రోగికి రూ.3.61 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది. రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆస్పత్రులు వ్యవహరించాలని ఈ సందర్భంగా అరుణ్‌బాబు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన డీడీసీ సమావేశంలో ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


మరో 160 కరోనా కేసులు


విశాఖపట్నం, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం మరో 160 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం 1,47,527 అయ్యాయి. ఇందులో 1,42,874 మంది కోలుకోగా, మరో 3,643 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందడంతో మరణాల సంఖ్య 1010కు చేరింది. 


2 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు...

జిల్లాలో మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 267కు చేరింది. వీరిలో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 22 మంది మృతిచెందగా, మరో 107 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

Updated Date - 2021-06-22T05:14:17+05:30 IST