రఘురామకు ముగిసిన పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-19T09:18:35+05:30 IST

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో తొలి రోజు వైద్య పరీక్షలు ముగిశాయి.

రఘురామకు ముగిసిన పరీక్షలు

  • తొలిరోజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం చికిత్స.. 
  • ల్యాబ్‌కు రక్తనమూనాలు
  • తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఆర్మీ ఆస్పత్రిలోనే ఎంపీ


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో తొలి రోజు వైద్య పరీక్షలు ముగిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు ఆయన్ను సోమవారం రాత్రి 11 గంటలకు తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలోని వీఐపీ స్పెషల్‌ రూమ్‌లో ముగ్గురు ఆర్మీ వైద్య అధికారుల బృందం నేతృత్వంలో ఎంపీకి చికిత్స, అవసరమైన వైద్య పరీక్షలు చేపట్టారు. కస్టడీలో తనపై దాడి జరిగిందని రఘురామరాజు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. కుడి కాలికి తీవ్రమైన వాపు ఉండడంతో నొప్పి తగ్గించడానికి, అంతర్గత గాయాల నొప్పి తగ్గించడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సేకరించిన రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు సమాచారం. ఇంకోవైపు.. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం తెలంగాణ హైకోర్టు తమ రిజిస్ట్రార్‌ నాగార్జునను జ్యుడీషియల్‌ అధికారిగా నియమించింది. ఆయన సమక్షంలోనే ఆర్మీ వైద్యులు ఎంపీకి చికిత్స అందించారు. 


మంగళవారం మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరీక్షలు, వైద్య చికిత్స కొనసాగాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్‌ చేస్తున్నారు. చికిత్స సందర్భంగా ఆయన మాటలను కూడా రికార్డు చేస్తున్నారు. పరీక్షలు ముగిశాక వివరాలను ఆర్మీ ఆస్పత్రి అధికారులు హైకోర్టు రిజిస్ర్టార్‌ ద్వారా ఈ నెల 21న సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందజేయనున్నారు. కాగా, ఎంపీకి అందిస్తున్న వైద్యం, చేస్తున్న పరీక్షలపై ఆర్మీ ఆస్పత్రి వర్గాలు అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. ప్రస్తుతం రఘురామరాజు మెడికల్‌ కేర్‌లో ఉన్నారని, సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆయన ఇక్కడే ఉంటారని చెప్పారు. కాగా, రఘురామరాజు ఆరోగ్యం, ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్స గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం వైద్య పరీక్షలు జరుగుతున్న సమయంలో తండ్రిని కలిసేందుకు ఎంపీ కుమారుడు భరత్‌ అక్కడకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నందున ఎవరూ కలవడానికి వీలు లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేయడంతో భరత్‌ వెనుదిరిగారు.

Updated Date - 2021-05-19T09:18:35+05:30 IST