కరోనా కేసుల నిర్వహణలో నిర్లక్ష్యం..ఆసుపత్రిపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-04-10T13:36:28+05:30 IST

కరోనా వైరస్‌ మృతదేహం, కేసుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం, నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు ....

కరోనా కేసుల నిర్వహణలో నిర్లక్ష్యం..ఆసుపత్రిపై పోలీసు కేసు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మృతదేహం, కేసుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం, నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీ పంజాబ్ బాగ్‌లోని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో ఓ రోగి కరోనా వైరస్ తో మరణించారు. అతని మృతదేహాన్ని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వారి బంధువులకు అప్పగించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ తో మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఏప్రిల్ 4వతేదీన మరణించారు. దీంతో అతని మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా వారి బంధువులకు అప్పగించారు. బంధువులు సామాజిక దూరం పాటించకుండా ఎక్కువ మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో మృతుడి కుమారుడికి కూడా కరోనా వైరస్ సోకింది.


72 ఏళ్ల మరో మహిళా కరోనా రోగిని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో చేర్చుకున్నారు. కరోనా రోగికి ఆరోగ్యకార్యకర్తలు సామాజిక దూరం పాటించాలనే నిబంధనను ఆసుపత్రిలో అమలు చేయలేదు. దీంతో ఆరోగ్యకార్యకర్తలకు కూడా కరోనా సోకింది. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లనే కరోనా ప్రబలిందని జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తులో తేలింది. దీంతో మహారాజా అగ్రసేన్ ఆసుపత్రి యాజమాన్యం, పరిపాలనాధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-04-10T13:36:28+05:30 IST