విద్వేష వ్యాఖ్యల వీడియో వైరల్: సిద్ధూ సలహాదారుడు ముస్తఫాపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2022-01-23T22:58:46+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సలహాదారు, మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు...

విద్వేష వ్యాఖ్యల వీడియో వైరల్: సిద్ధూ సలహాదారుడు ముస్తఫాపై ఎఫ్ఐఆర్

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సలహాదారు, మాజీ డీజీపీ మొహమ్మద్ ముస్తఫాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముస్తఫా నాలుగు రోజుల క్రితం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు.


ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆయన హెచ్చరికలపై ‘ఆప్’ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు, సోషల్ మీడియాలో ముస్తఫా వీడియో వైరల్ కావడంతో స్పందించిన మాలెర్‌కోట్లా పోలీసులు గత రాత్రి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 


ముస్తఫా భార్య రజియా సుల్తానా మాలెర్‌కోట్లా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. తనపై కేసు నమోదైన విషయమై ముస్తఫా మాట్లాడుతూ.. ఇదంతా రాజకీయ కుట్ర అని, అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపడేశారు. తాను ఏ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.


తనను వెంటాడి హాని చేసేందుకు ఆప్ కార్యకర్తలు ప్రయత్నించడంతో తాను వారిని హెచ్చరించిన మాట వాస్తవమేనన్నారు. అయితే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాత్రం అర్ధ రహితమని, నిజానిజాలు నిర్ధారించుకోకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తుకు తాను సహకరిస్తానని చెప్పారు. దర్యాప్తు అధికారి పిలిచిన వెంటనే వివరణ ఇస్తానని తెలిపారు. 


‘ఆప్’ మాలెర్‌‌కోట్లా అభ్యర్థి జమీలుర్ రహ్మాన్ మాట్లాడుతూ.. ముస్తఫా తమ కార్యకర్తలను బెదిరించారని, సమావేశాలు ఎలా పెట్టుకుంటారో చూస్తానని హెచ్చరించారని ఆరోపించారు. ఆయన భార్య భారీ తేడాతో ఓడిపోతుందన్న భయంతోనే ఆయన ఇలా బెదిరిస్తున్నారని విమర్శించారు.  

Updated Date - 2022-01-23T22:58:46+05:30 IST