Abn logo
Jun 3 2021 @ 23:37PM

మంత్రాల నెపంతో నిప్పంటించాడు..

 కిరోసిన్‌పోసి వృద్ధురాలిపై హత్యాయత్నం

 వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితురాలు 

వేలేరు(ధర్మసాగర్‌) జూన్‌ 3: తన భార్యపై మంత్రాలు చేసిందన్న నెపంతో ఓ వ్యక్తి వృద్ధురాలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన వేలేరు మండలంలోని గుడ్లసాగర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. గుడ్లసాగర్‌కు చెందిన రాజయ్య భార్య లక్ష్మి మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు అనసూర్య అలియాస్‌ సూరమ్మ మంత్రాలు చేయడంతోనే తన భార్య అనారోగ్యం పాలైందని రాజయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరమ్మ పాలకోసం వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా రాజయ్య ఆమెను అడ్డగించి కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారని ఎస్సై తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.