యువజంట కష్టం అగ్గి పాలు

ABN , First Publish Date - 2021-06-21T04:31:05+05:30 IST

పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఎవరి అండ లేకున్నా రెక్కల కష్టం నమ్ముకుని భార్యభర్తలు శ్రమించి భవిష్యత్తును అందంగా

యువజంట కష్టం అగ్గి పాలు
కాలి బూడిదైన పూరిల్లు

షార్ట్‌ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం

రూ.10 లక్షల నగదు, బంగారం ఆహుతి

కట్టుబట్టలతో వీధిన పడ్డ కుటుంబం

ఏఎస్‌పేట, జూన్‌ 20: పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఎవరి అండ లేకున్నా రెక్కల కష్టం నమ్ముకుని భార్యభర్తలు శ్రమించి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకో వాలని ఆశపడ్డారు. కానీ అందరికి వెలుగునిచ్చే విద్యుత్‌ వీరి జీవితంలో అంధకారం నింపిం ది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి సిలిండర్‌ పేలి వారి ఐదేళ్ల కష్టం బూడిదపాలైంది. ఆ యువజంట కట్టుబట్టలతో వీధినపడ్డారు. ఈ ఘటన అదివారం ఏఎస్‌ పేట మండలం చిరమన గ్రామంలో చోటు చేసుకుంది. 

 చిరమన గ్రామానికి చెందిన నరాల శ్రీనివాసులు ఐదేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఎంబీఏ పూర్తిచేసినా ఉద్యోగం రాలేదని బాధపడకుండా పూరింటిలోనే ఎవరి అండా లేకున్నా తమ కష్టాన్నే నమ్ముకుని కులవృతినే ఉపాధిగా ఎంచుకుని శ్రమించాడు. భర్తకు అండగా భార్య సైతం పనులకు వెళ్లి కొంత నగదు కూడ బెట్టారు. ఇల్లు నిర్మించుకోవాలని సుమారు రూ.10 లక్షలు సమకూర్చుకోవడంతో పాటు తన భార్యకు 3 సవర్ల బంగారాన్ని చేయించాడు. పూరింటి నుంచి మేడలోకి మారాలని ఆశప డ్డారు. మంచి ముహూర్తం చూసి తమ ఆశలకు పునాది వేయాలనుకున్నారు. రోజులాగే ఆదివారం ఉదయం భార్యభర్తలు పనులకు వెళ్లారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూరింటికి మంటలు వ్యాపించి లోపల గ్యాస్‌ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో గ్రామ స్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే ఇంటితో పాటు అందులో ఉన్న రూ.10 లక్షల నగదు, బంగారం, ఎంబీఏ సర్టిఫికెట్లు పూర్తిగా కాలి బూడిద య్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కట్టుబట్టలతో వీధిన పడ్డ ఆ యువజంట రోదన చూపరులను కంట తడి పెట్టించింది.

Updated Date - 2021-06-21T04:31:05+05:30 IST